రూ. పది నాణేలు చెల్లుతాయ్
అమరావతి: ‘సార్... రూ.10 నాణేలు ఎవ్వరూ తీసుకోవడం లేదు సార్... నా దగ్గర రూ.3,000 విలువైన రూ.10 నాణేలు ఉన్నాయి. రూ. 2,500 ఇచ్చి ఈ మొత్తం తీసుకోండి సార్’... ఇదీ విజయవాడలోని పాన్ షాపు యజమాని ఆందోళన. కాకినాడకు చెందిన ఈశ్వర్ రూ.5,000 విత్‌డ్రా చేసుకుందామని బ్యాంకుకు వెళితే మొత్తం రూ.10 నాణేలే ఇచ్చారు. ‘సార్ ఇవి బయట చెల్లడం లేదు నోట్లు ఇవ్వమని అడిగితే.. రూ.10 నాణేలు ఇచ్చినట్లు బుక్‌లో రాసేశాము.. మార్చడం కుదరదు’ అన్నారు. తీరా బయట ఇస్తే ఎవ్వరూ తీసుకోవడం లేదు. ఏమి చేయాలో అర్థం కావడం లేదంటూ ఈశ్వర్ వాపోయారు. పది రూపాయల నాణేలు చెల్లడం లేదంటూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున వదంతులు షికార్లు చేస్తున్నాయి.
దీంతో కిరాణా, పాన్ షాపుల యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. తాము ఇస్తే నాణేలు ఎవ్వరూ తీసుకో వడం లేదని, కానీ సిగరెట్లు వెలిగించుకున్న తర్వాత ఆనాణేలు అంటగట్టి వెళ్లిపోతున్నా రంటూ పాన్‌షాపు వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ వదంతులే, వీటిని నమ్మవద్దని ఆర్‌బీఐ పేర్కొంది. రూ.10 నాణేలు చెల్లుతాయని, వీటిని చెలామణీలోంచి ఉపసంహరించే ఉద్దేశం కూడా లేదని స్పష్టం చేసింది. ఈ మధ్యనే జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆర్‌బీఐ రీజనల్ డైరక్టర్ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. రూ.10 నాణేలు చెల్లవన్న వదంతులను ఖండించారు. అసలు ఈ ప్రచారం ఎక్కడ మొదలయ్యిందో, ఎవరు ఎందుకు వ్యాప్తి చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. అన్ని రకాల పది రూపాయల నాణేలు చెల్లుబాటు అవుతాయని, వదంతులను నమ్మవద్దని స్పష్టం చేశారు.
కొత్త ఆర్థిక సంవత్సరం మొదలై వారం రోజులు దాటుతున్నా ఇప్పటి వరకు రాష్ట్రానికి ఆర్‌బీఐ నుంచి ఒక్క నయాపైసా కూడా రాలేదు. దీంతో రాష్ట్రంలో నగదుకొరత అంతకంతకు తీవ్రమవుతోంది. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రాబ్యాంక్ వంటి పెద్ద బ్యాంకులు తీవ్ర నగదు కొరతను ఎదుర్కొంటున్నాయి. చిన్న బ్యాంకులు రొటేషన్ విధానంలో తమ దగ్గర ఉన్న నగదుతో నెట్టుకొస్తున్నాయి.
రాష్ట్రంలో నగదు కొరత గురించి ఆర్‌బీఐ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకువెళ్తున్నామని, మార్చి 31న తక్షణ అవసరాలకు రూ. 800 కోట్లు పంపుతున్నట్లు ఆర్‌బీఐ హామీ ఇచ్చిందని, కానీ ఆ మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రానికి చేరలేదని ఆ అధికారి స్పష్టం చేశారు. నగదు కొరతతో ఏటీఎంలు సగానికిపైగా పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.