హంద్రీ-నీవాలో 358% పెంపు | 358 percent in handree-neeva | Sakshi
Sakshi News home page

హంద్రీ-నీవాలో 358% పెంపు

Published Wed, Aug 17 2016 2:43 AM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

358 percent in handree-neeva

పేరూరు బ్రాంచ్ కెనాల్ అంచనాలు భారీగా పెంచేశారు
ఆర్థిక శాఖ, ఎస్‌ఎల్‌ఎస్‌సీ అభ్యంతరాలు బేఖాతర్
తనకు సన్నిహితుడైన ఎమ్మెల్సీకి కట్టబెట్టాలంటూ ‘పెదబాబు’ ఒత్తిడి

 సాక్షి, హైదరాబాద్ : అస్మదీయుడైతే.. పనులు చేయకున్నా ఫర్వాలేదు. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలనే సాకు చూపి అంచనాలను అడ్డగోలుగా పెంచేస్తారు. పనిలో పనిగా మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేస్తారు. పెంచిన మేరకు వాటాలు పంచుకుతింటారు.

 తస్మదీయుడైతే.. నిబంధనల మేరకు పనులు చేస్తున్నా.. చేయడం లేదనే సాకు చూపి 60-సీ సెక్షన్ ప్రయోగిస్తారు. ముందుస్తు నోటీసులు ఇవ్వకుండా పనులు రద్దు చేసేస్తారు. ఆ తర్వాత అంచనాలు పెంచేసి.. వాటిని దొడ్డిదారిన అస్మదీయుడికి అప్పగించి పెంచిన అంచనాల మేరకు వాటాలు పంచుకుతింటారు.

 .. ఇదీ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో సాగుతోన్న అక్రమాల దందా. హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం తొలి దశలో జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరు బ్రాంచ్ కెనాల్ తవ్వి 80,600 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించారు. 36వ ప్యాకేజీ కింద పేరూరు బ్రాంచ్ కెనాల్ పనులను 2005లో ఓం-రే(జాయింట్ వెంచర్) రూ.93.92 కోట్లకు దక్కించుకుంది. టీడీపీ అధికారంలోకి రాగానే  పనులు చేయడం లేదనే సాకు చూపి ఒప్పందం రద్దు చేసేశారు. అదే పని అంచనా వ్యయాన్ని రూ.336.15 కోట్లకు పెంచుతూ మంగళవారం జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఉత్తర్వుల(జీవో-577)ను జారీ చేశారు. అంటే ఒకేసారి అంచనా వ్యయాన్ని 358 శాతం పెంచినట్లు స్పష్టమవుతోంది. ఈ పనిని తనకు సన్నిహితుడైన ఎమ్మెల్సీకి ‘కొటేషన్’ పద్ధతిలో కట్టబెట్టాలంటూ జలవనరుల శాఖ అధికారులపై పెదబాబు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు.

 టీడీపీ అధికారంలోకి రాగానే..
భూసేకరణను వేగంగా చేసి.. పనులు సజావుగా చేయడానికి సహకరించాల్సిన సర్కార్ తద్భిన్నంగా వ్యవహరించింది. విపక్ష పార్టీకి చెందిన కాంట్రాక్టర్ అనే నెపంతో కక్ష సాధింపులకు దిగి పనులను రద్దు చేసేసింది. ఆ తర్వాత రంగంలోకి దిగిన ఓ ఎమ్మెల్సీ పనుల అంచనా వ్యయాన్ని పెంచేయాలంటూ ఒత్తిడి తెచ్చారు. ఆ మేరకు అంచనా వ్యయాన్ని రూ.355.304 కోట్లకు పెంచాలంటూ గత ఏప్రిల్ 19న అనంతపురం జిల్లా సీఈ జలంధర్ జలవనరుల శాఖకు ప్రతిపాదనలు పంపారు. ఒకేసారి అంచనా వ్యయం నాలుగు రెట్లు పెంచడంపై స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ(ఎస్‌ఎల్‌ఎస్‌సీ) ఆశ్చర్యం వ్యక్తం చేసి.. తోసిపుచ్చింది. అవే ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు పంపగా.. అంచనా వ్యయం 400 శాతం పెంచడానికి అనుమతించబోమని అధికారులు తెగేసి చెప్పారు.

దీనిపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ అంచనా వ్యయం రూ.336.15 కోట్లకు పెంచే ఫైలుపై తానే సంతకం చేసేశారు. ఆ మేరకు జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనల ప్రకారం ఈ పనులను టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించాలి. కానీ.. యుద్ధప్రాతిపదికన ఆ పనులు పూర్తి చేయాలనే సాకుతో కొటేషన్ల ద్వారా తనకు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్సీకి కట్టబెట్టాలంటూ జలవనరుల శాఖపై పెదబాబు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. వారంలోగా ఈ పనులు టీడీపీ ఎమ్మెల్సీకి కట్టబెడుతూ ఉత్తర్వులు వెలువడడం ఖాయమని జలవనరుల శాఖ కీలక అధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు.

 ఐదో లిఫ్టు పేరుతో 52 కోట్లు ఎత్తిపోత!
హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పనుల్లో ఇదో కొత్తరకం దోపిడీ... అదనపు లిఫ్టు చేపట్టాలంటూ వచ్చిన ప్రతిపాదనను రాష్ర్టప్రభుత్వం కనీసం పరిశీలించక ముందే కాంట్రాక్టర్ పనులు ప్రారంభించేశారు. ఎవరేమనుకుంటే మాకేం అన్నట్లు రూ.52.52 కోట్ల పనులకు ప్రభుత్వ పెద్దలు పచ్చ జెండా ఊపేశారు. హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం రెండో దశలో.. మడకశిర బ్రాంచ్ కెనాల్(ఎంబీసీ) ద్వారా అనంతపురం జిల్లాలో మడకశిర, హిందూపురం, పెనుకొండ నియోజకవర్గాల్లో 74,400 ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. హంద్రీ-నీవా ప్రధాన కాలువ 304.50 కి.మీ నుంచి నాలుగు దశల్లో 121.481 మీటర్లకు 18.219 క్యూసెక్‌ల నీటిని నాలుగు లిఫ్టుల ద్వారా ఎంబీసీలోకి ఎత్తిపోయాలని ప్రతిపాదించారు.

లిఫ్టుల నిర్మాణానికి సంబంధించిన ఎలక్ట్రో మెకానిక్ పనులను రూ.357.80 కోట్లకు వీఆర్‌సీఎల్-ష్యూ-డబ్ల్యూపీఐఎల్ జాయింట్ వెంచర్(జేవీ) చేజిక్కించుకుని జూన్ 18, 2008న ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అయితే ప్రధాన కాలువ నుంచి ఎంబీసీకి నీటిని తరలించే ప్రాంతం 323.950 కి.మీకి మారినందువల్ల అదనంగా ఐదో లిఫ్టును చేపట్టాలని 2013లో కాంట్రాక్టర్ ప్రతిపాదించగా... విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం తిరస్కరించింది. టీడీపీ అధికారంలోకి రాగానే పెదబాబు ‘ఆస్థాన’ కాంట్రాక్టర్ ఆ పనులను సబ్ కాంట్రాక్టు కింద చేజిక్కించుకున్నారు.

ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే.. పెదబాబు నోటి మాటపై అదనపు లిఫ్టు పనులు చేపట్టారు. పెదబాబు ఒత్తిడి మేరకు.. ఆ పనులకు ఎస్‌ఎస్‌ఎల్‌సీ(రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ), ఐబీఎం(ఇంటర్నల్ బెంచ్ మార్క్) కమిటీలు అనుమతి ఇచ్చేశాయి. అదనపు లిఫ్టు పనుల విలువను రూ.52.52 కోట్లుగా నిర్ధారించాయి. టెండర్‌తో నిమిత్తం లేకుండా పాత కాంట్రాక్టర్‌కే అప్పగిస్తూ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ జూన్ 20న ఆమోదముద్ర వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement