4.8 కిలోల బంగారం దొంగతనం... నిందితుని అరెస్ట్ | 4.8 kilograms gold theft and the victim was arrested | Sakshi
Sakshi News home page

4.8 కిలోల బంగారం దొంగతనం... నిందితుని అరెస్ట్

Published Fri, Mar 13 2015 10:55 PM | Last Updated on Sat, Sep 2 2017 10:47 PM

4.8 కిలోల బంగారం దొంగతనం... నిందితుని అరెస్ట్

4.8 కిలోల బంగారం దొంగతనం... నిందితుని అరెస్ట్

శంషాబాద్(రంగారెడ్డి) : శంషాబాద్ విమానాశ్రయంలోని కార్గో టెర్మినల్ నుంచి సుమారు ఐదు కిలోల బంగారం ఉన్న పార్శిల్‌ను దొంగిలించిన ఇద్దరిని ఆర్‌జీఐఏ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌చేసి, రిమాండ్‌కు తరలించారు. సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం శంషాబాద్ డీసీపీ ఏఆర్.శ్రీనివాస్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్‌కు చెందిన వడ్త్యా మనోజ్‌కుమార్ (25), అల్వాల్‌కు చెందిన ఆలూరి సత్యనారాయణరాజు (34)లు బేగంపేట్‌లోని రాయల్ ఎక్స్‌ప్రెస్ కార్గో సంస్థలో పనిచేస్తున్నారు. వీరిద్దరూ శంషాబాద్ విమానాశ్రయంలోని కార్గో నుంచి ప్రతిరోజు పార్శిళ్లను నగరానికి తరలిస్తుంటారు.

కార్గోలో వచ్చే బంగారం, ఇతర వస్తువుల గురించి పట్టుఉన్న వీరిద్దరు గత ఫిబ్రవరి 7న ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన 6ఈ0348 విమానంలో కోల్‌కత్తా నుంచి వచ్చిన 132 పార్శిళ్లలో ఒక పార్శిల్‌ను దొంగిలించారు. అయితే రిజిస్టర్‌లో మాత్రం 131 పార్శిళ్లను మాత్రమే తీసుకున్నట్లు సంతకాలు చేశారు. అక్కడి నుంచి నగరంలోని తమ నివాసాలకు వెళ్లిన తర్వాత పార్శిల్‌లో ఉన్న రూ.1.20 కోట్ల విలువైన 4.8 కిలోల బంగారు అభరణాలను సమానంగా పంచుకున్నారు. పార్శిళ్లను స్వీకరించిన నగరానికి చెందిన సుశీల్‌కుమార్ పచేరియా ఒక పార్శిల్ తక్కువగా ఉండడంతో ఆర్‌జీఐఏ పోలీసులకు అదే రోజు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. కార్గో నుంచి పార్శిళ్లను తీసుకెళ్లిన ఇద్దరిపై అనుమానం రావడంతో వారిని విచారించారు. నిందితులిద్దరి నుంచి 4.8 కేజీల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఆర్‌జీఐఏ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ సుదర్శన్‌రెడ్డి బందం సమర్థవంతంగా పనిచేసిందని డీసీపీ కితాబునిచ్చారు.




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement