సాక్షి, హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. కోవిడ్ మహమ్మారి కారణంగా డొమెస్టిక్ విమానాలు మాత్రమే రాకపోకలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. వందేభారత్ మిషన్‌లో భాగంగా పరిమిత సంఖ్యలో మాత్రమే అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. సాధారణ వర్షమైనా సరే విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయంగా మారుతుంది. అదే సమయంలో ప్రయాణికులు సైతం ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎయిర్‌పోర్టుకు చేరుకొనేవిధంగా రహదారులు ఉండాలి.దీనిని దష్టిలో ఉంచుకొని ఎయిర్‌పోర్టు రన్‌వేలు, రహదారులు, తదితర అన్ని ప్రాంతాల్లో అవసరమైన మరమ్మతులను చేపట్టింది. ‘వర్షాకాలం నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుంది. కానీ ఏ క్షణంలోనైనా అంతర్జాతీయ విమానాల రాకపోకలు మొదలు కావచ్చు. ఇందుకనుగుణంగా ఎయిర్‌పోర్టును పూర్తిస్థాయి సన్నద్ధం చేస్తున్నట్లు జీఎమ్మార్ ఎయిర్‌పోర్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సాధారణ రోజుల్లో కొనసాగే విమానాల రాకపోకలు, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఎయిర్‌పోర్టులో రోడ్డు, రవాణా వ్యవస్థను పటిష్టం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు కోజికోడ్ దుర్ఘటన దష్ట్యా కూడా జీఎమ్మార్ ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు.
డీజీసీఐ నిబంధనల మేరకు చర్యలు..
ప్రతి ఏడాది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నియమాలకు అనుగుణంగా వర్షాకాలానికి ముందే ఎయిర్‌పోర్టులో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. వరదలు, డ్రైనేజీ బ్లాకేజ్, నీరు నిల్వ వంటివి చోటుచేసుకోకుండా నిరంతరం పర్యవేక్షిస్తారు. అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారు. అలాగే విమానాశ్రయం మొత్తం రూఫ్ లీకేజీలు, నీరు నిలిచే అవకాశం లేకుండా తనిఖీలు నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా వర్షాకాలం ప్రారంభం నుంచే తగిన చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఎయిర్‌పోర్టులో ఎయిర్ సైడ్, ల్యాండ్ సైడ్, టెర్మినల్ బిల్డింగ్ మూడు విభాగాలలో వర్షపు నీటి నిర్వహణ, అవసరమైన మరమ్మతుల కోసం ప్రత్యేక యాక్షన్ టీమ్‌లను రంగంలోకి దింపినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే పాడైన రోడ్లను బాగు చేయడంతో పాటు ఎయిర్‌పోర్టులో వర్షపు నీరు నిలవకుండా ఈ ప్రత్యేక బృందాలు నిరంతరం విధులు నిర్వహిస్తాయని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టు టెక్నికల్, ఇంజనీరింగ్ విభాగాలతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు.
సురక్షితమైన రన్‌వే..
ఎయిర్‌పోర్టులో రన్‌వేల నిర్వహణ ఎంతో కీలకమైంది. ప్రస్తుతం పరిమితంగానే విమానాలు నడుస్తున్నాయి. కానీ సాధారణంగా రోజుకు 550 విమానాలు, 60 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. వర్షకాలంలో విమానాలు సురక్షితంగా దిగడానికి, గాలిలోకి ఎగరడానికి రన్ వే మీద ఉండే టార్మాక్ ఎంతో ముఖ్యమైంది. దీని నాణ్యత ఏ మాత్రం దెబ్బతిన్నా రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎయిర్ సైడ్ ఆపరేషన్స్ టీం, సేప్టీ, తదితర విభాగాలతో తనిఖీలను ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. ఎయిర్ సైడ్ ప్రాంతంలోని గడ్డిని కత్తిరించడం వర్షాకాలం ముందస్తు ఏర్పాట్లలో ఒక ముఖ్య భాగం. ఈ గడ్డి 1525 సెంటీమీటర్ల మధ్యలో ఉండేట్లు కత్తిరించడమే కాకుండా, గడ్డి మీద తగిన పురుగు మందులను కూడా స్ప్రే చేశారు.
వర్షపు నీటి నిర్వహణ..
వాన నీటి పరిరక్షణ కోసం హైదరాబాద్ విమానాశ్రయంలో ఒక సమగ్ర నీటి సంరక్షణ విధానాన్ని పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం అన్ని చోట్ల కురిసిన వాన నీరు వెంటనే ప్రవహించడానికి వీలుగా డ్రెయిన్లు, ఛానెల్ డక్ట్‌లను నిర్మించారు. దీనివల్ల నేలపై ఎక్కడా నీరు నిలిచే అవకాశం ఉండదు. వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోవడానికి విమానాశ్రయపు తూర్పు భాగంలో ఆర్టిఫిషియల్ రీచార్జ్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. ఎయిర్ పోర్టులో వివిధ చర్యల ద్వారా ఏడాదికి సుమారు 1.729 మిలియన్ క్యూబిక్ మీటర్ల వర్షపు నీటిని భూమిలోకి రీచార్జ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment