హైదరాబాద్ : అభయ ఘటన నేపథ్యంలో పోలీసులు జారీ చేసే 'నా వాహనం సురక్షితం' అనే స్టిక్కర్ ఉన్న క్యాబ్లోనే ఐటీ ఉద్యోగినులు ప్రయాణించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ పోలీసు రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా తిరిగే క్యాబ్‌లకు రూ.500 జరిమానాతో పాటు వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. రూ. కోట్లతో 120 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సీవీ ఆనంద్ వెల్లడించారు. అభయ తరహా ఘటనలు పునరావృతం కాకుండా అయిదు సూత్రాల రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు.
రిజిస్ట్రేషన్ ఇలా...
ఐటీ కారిడార్‌లోని ఉద్యోగులను తరలించే ప్రతి క్యాబ్ పోలీసు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇందుకోసం వాహనం, డ్రైవర్, యజమాని వివరాలు నింపేందుకు ప్రత్యేక ఫారాలను తయారు చేశారు. వాహనం రిజిస్ట్రేషన్ కాగితాలు, ఫిట్‌నెస్, పొల్యుషన్, ఇన్సూరెన్స్ కాగితాలు సమర్పించాలి. అలాగే డ్రైవర్ వివరాల కోసం అతని ఫోటో, చిరునామా తెలిపే రేషన్, ఓటర్, ఆధార్‌లో ఏదైనా ఒక కార్డు, సెల్‌నంబర్ ఇవ్వాలి. ఇక వాహన యజమాని వివరాలకై చిరునామా తెలిపే ఏదేని ప్రభుత్వ కార్డు, సెల్‌నంబర్ ఇవ్వాల్సి ఉంది.
క్యాబ్ వివరాలు క్షణాల్లో...
క్యాబ్‌లకు పోలీసులు ప్రత్యేకంగా క్యూర్ నంబర్‌ను కేటాయిస్తారు. డ్రైవర్ ఫోటో, వివరాలతో కూడిన స్టిక్కర్‌ను వాహనం లోపల, బయటి వ్యక్తులకు కనిపించేలా అతికించాలి. స్టిక్కర్‌లో ఉన్న కోడ్ నంబర్‌ను మొబైల్ యాప్ ద్వారా ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ సెల్‌నంబర్ 8500411111కు ఎస్‌ఎంఎస్ చేస్తే క్షణాల్లో వాహనం, డ్రైవర్ పూర్తి వివరాలు అందుతాయి. ఇలా పోలీసుల వద్ద రిజిస్ట్రేషన్ అయిన క్యాబ్‌ల వివరాలన్నీ త్వరలో ట్రాఫిక్ పోలీసు వెబ్‌సెట్‌లో పొందుపరుస్తారు. దాంతో క్యాబ్ డ్రైవర్లు నేరాలకు పాల్పడరని అధికారులు ఆశిస్తున్నారు.
'క్యూర్ నెంబర్ వాహనంలోనే ప్రయాణించండి'
Published Fri, May 9 2014 2:28 PM | Last Updated on Thu, Sep 27 2018 3:58 PM
Advertisement
Advertisement