
పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిన మహిళలు
హైదరాబాద్: పేకాట స్థావరంపై దాడిచేసి ఏడుగురు మహిళలను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి.. నగరంలోని చైతన్యపురి గ్రీన్ హిల్స్ కాలనీలోని ఓ అపార్టుమెంట్ ఫ్లాటులో పేకాట క్లబ్ నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పేకాట ఆడుతున్న ఏడుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 26 వేల నగదుతో పాటు ఏడు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.
స్థానిక కాలనీలోని ఓ ఇంట్లో ఒక మహిళ మూడు ముక్కలాట క్లబ్ నిర్వహిస్తోందనే సమాచారంతో రంగంలోకి దిగిన చైతన్యపురి పోలీసులు పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేశారు. వీళ్లందరినీ చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. ఈ మహిళలంతా బడా వ్యాపారవేత్తల కుటుంబాలకు చెందినవారని తెలుస్తోంది. అసలు తెలంగాణ పరిధిలో ఎక్కడా పేకాట క్లబ్బులను అనుమతించేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టంగా చెబుతుండగా, మరోవైపు మహిళలు ఇలా డబ్బులతో పేకాట ఆడటం విస్మయం కలిగించిందని ఎస్ఓటీ పోలీసులు అంటున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటన ఈ ప్రాంతంలో జరిగింది. గతంలో రోడ్ నెం.2లో కొంతమంది మహిళలు పేకాట ఆడారని చెబుతున్నారు.