దుబాయ్‌లో 750 ఉద్యోగాలు
రెండు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం, రెండు కంపెనీలు దుబాయ్‌లో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దీంతో రాష్ట్రానికి చెందిన దాదాపు 750 మంది యువకులు ఉద్యోగాలు పొందనున్నారు. దుబాయ్‌లోని అల్ముల్లా గ్రూప్‌లో 500 మందికి, జజీరా ఎమిరేట్స్ పవర్‌లో 250 మందికి ఉద్యోగాలిచ్చేందుకు ఆయా కంపెనీలు తెలంగాణ ఓవర్‌సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్) చైర్మన్, నాయిని సమక్షంలో ఎంవో యూ చేసుకున్నాయి.
అల్ముల్లా గ్రూప్‌కు చెందిన మహ్మద్ సర్వర్, జజీరా ఎమిరేట్స్‌కు చెందిన ఎన్‌టీ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఎంప్లాయిమెంట్ డెరైక్టర్ వైకే నాయక్ వీటిపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాంకేతికంగా నైపుణ్యం పొందిన యువకులు తెలంగాణలో ఎంతోమంది ఉన్నారని, వారికి శిక్షణ ఇచ్చి టామ్‌కామ్ మరింత సమర్థులుగా తయారు చేస్తుందన్నారు. నిరుద్యోగులు దళారుల చేతిలో పడి మోసపోకుండా టామ్‌కా మ్ ద్వారా ఉద్యోగాలు పొందేందుకు తగిన చర్యలు చేపడతామన్నారు. కార్మిక శాఖ రాష్ట్ర కార్యదర్శి హరిప్రీత్‌సింగ్, హోం శాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది, టామ్‌కామ్ డెరైక్టర్ భవాని, గల్ఫ్‌లో తెలంగాణ సంక్షేమ సంఘం ప్రతినిధులు శ్రీనివాస్‌శర్మ, రాజా శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.