ఓ వంతెన.. వంద ప్రణాళికలు!
ఉప్పల్ వద్ద నిర్మించ తలపెట్టిన బ్రిడ్జి కథ ఇదీ
- రోడ్లు, భవనాల శాఖ, జీహెచ్‌ఎంసీ వేర్వేరు ప్రణాళికలు
- ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రూ.1,350 కోట్లతో ప్రతిపాదనలు
- రూ.950 కోట్లలోపే సరిపెట్టాలని కేంద్రం సూచన
- ఇష్టారాజ్యంగా చేసే ప్రణాళికలకు నిధులివ్వబోమని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: రోడ్లు, భవనాల శాఖ.. నేషనల్ హైవే అథారిటీ.. జీహెచ్‌ఎంసీ.. హైదరాబాద్ మెట్రో రైలు.. ట్రాఫిక్ రద్దీని తగ్గించే ఆలోచనతో ఈ సంస్థలు వేటికవే చేసుకుంటున్న ప్రణాళికలు కలగాపులగంగా మారి గందరగోళానికి కారణమవుతున్నాయి. ఇష్టా రాజ్యంగా చేస్తున్న ప్రణాళికలకు తాము నిధులివ్వ బోమని తాజాగా కేంద్రం తేల్చి చెప్పాల్సి వచ్చింది. దీనికి ఉప్పల్ వద్ద ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్, క్లవర్ లీఫ్ నమూనా ఇంటర్ చేంజ్ వంతెన, అండర్‌పాస్ ఆలోచనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
రూ.950 కోట్లలోపే ఉండాలి..
హైదరాబాద్ నగరంలోని ప్రధాన కూడళ్లలో ఆకాశ మార్గాలను నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిం ది. ఇందులో భాగంగా జాతీయ రహదారులపై నిర్మించే వంతెనల భారం కేంద్రమే భరించేలా ప్రయ త్నిస్తోంది. ఈ క్రమంలో కొన్నింటికి కేంద్రం పచ్చ జెండా ఊపింది. ఇందులో ఉప్పల్ వద్ద నిర్మించే వంతెన ఒకటి. ఇక్కడ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని నిర్ణయించారు. దీంతో రోడ్లు భవనాల శాఖ ప్రణాళిక సిద్ధం చేసి రూ.1,350 కోట్లతో కేంద్రానికి ప్రతిపాద నలు పంపింది. దీనికి జీహెచ్‌ఎంసీ ప్రణాళికనూ జత చేసింది. దీనిపై స్పందించిన కేంద్రం.. జీహెచ్‌ఎంసీ నమూనాను కలపొద్దని, మొత్తం ప్రణాళిక రూ.950 కోట్లలోపే ఉండాలని తేల్చి చెప్పింది.
క్లవర్ లీఫ్ నమూనాకు జీహెచ్‌ఎంసీ ప్రణాళిక
హైదరాబాద్ నుంచి వరంగల్ మార్గంలో ఉప్పల్ కూడలికి 250 మీటర్ల తర్వాత ఎలివేటెడ్ కారిడార్ మొదలై నారపల్లి వద్ద ముగుస్తుంది. ఆకాశమార్గం ఆరు వరసలుగా, దిగువన 4 వరసల రోడ్డు, దానికి సర్వీసు రోడ్డు అదనంగా ఉండేలా రోడ్లు భవనాల శాఖ ప్రతిపాదన సిద్ధం చేసింది. ఉప్పల్ కూడలిలో క్లవర్ లీఫ్ నమూనాలో వంతెనకు జీహెచ్‌ఎంసీ ప్రణాళిక రూపొందించింది. ఈ రెండు కేంద్రం ముందుకు వెళ్లాయి. స్పందించిన కేంద్రం.. జీహెచ్‌ఎంసీ ప్రణాళి కను అందులో జత చేయొద్దని తేల్చి చెప్పింది. భూసేకరణ పేరుతో రూ.వందల కోట్ల భారాన్ని మోపితే ఎలా అని ప్రశ్నించింది. దీంతో ఆరు లైన్ల వంతెనను నాలుగు లైన్లకు పరిమితం చేశారు. దిగువన ఉప్పల్ కూడలి నుంచి ఎలివేటెడ్ వంతెన మొదలయ్యే వరకు నాలుగు వరసల రోడ్డు, సర్వీసు రోడ్డుకు వీలుగా ప్రైవేటు ఆస్తులు సేకరించాలన్న యోచన విరమించుకున్నారు. సర్వీసు రోడ్డు ప్రతిపాదనను పక్కన పెట్టేశారు.
ఎవరి ప్రణాళికలు వారివి..
ఉప్పల్ కూడలిలో నిర్మించే వంతెనలకు కేంద్రం నిధులివ్వదని తేలిపోవటంతో ఆ బాధ్యత పూర్తిగా జీహెచ్‌ఎంసీ తీసుకోవాల్సి ఉంది. జీహెచ్‌ఎంసీ సొంతంగా చేసుకున్న ప్రణాళికలకు మెట్రో రైలు నిర్మాణాలు అడ్డుగా మారాయి. దీంతో తొలుత క్లవర్ లీఫ్ నమూనాలో ఇంటర్‌చేంజ్ వంతెనకు ప్రణాళిక వేసుకుని, తర్వాత దాని బదులు అండర్‌పాస్ నమూనా నిర్మాణం చేపట్టాలని భావించగా, దానికి మెట్రో రైల్ యంత్రాంగం అభ్యంతరం చెబుతోంది. దీంతో మెట్రో రైలు వంతెనపై నుంచి వంతెన నిర్మిస్తే బాగుంటుందని జీహెచ్‌ఎంసీ పేర్కొనగా, అంత ఎత్తు వంతెన నిర్మిస్తే అది ల్యాండ్ అయ్యే చోటికి, ఎలివేటెడ్ కారిడార్ మొదలయ్యే చోటికి మధ్య దూరం తగ్గి గందరగోళంగా మారుతుందని, ఇది సవ్యమైన ఆలోచన కాదని రోడ్లు భవనాల శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఈ మొత్తం వ్యవహారం అయోమయంగా తయారైంది.