సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్(హెచ్‌ఎంఆర్) సంస్థ పిల్లర్ల మధ్యలో నిర్మిస్తున్న గోడపై నగర ట్రాఫిక్ విభాగం అధికారులు అధ్యయనం పూర్తి చేశారు. దీని నిర్మాణం నేపథ్యంలో మొత్తం 106 చోట్ల పాదచారులు రోడ్డు దాటేందుకు ఉపకరించే పెడస్ట్రియన్ క్రాసింగ్స్ ఏర్పాటు చేయాల్సి ఉందని గుర్తించారు. వీటిలో 49 ప్రాంతాల్లో ‘యూ’టర్న్స్ ఉంటాయి. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను హెచ్‌ఎంఆర్‌కు సమర్పిం చారు. దసరా తర్వాత ఆ సంస్థ పనులు చేపట్టే అవకాశం ఉందని ట్రాఫిక్ విభాగం చీఫ్ డాక్టర్ వి.రవీందర్ ‘సాక్షి’కి తెలిపారు.
పాదచారుల పాట్లు ఎన్నో..
రాజధానిలో పాదచారుల పాట్లు అన్నీఇన్నీ కావు. ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న వారిలో వీరి సంఖ్యే ఎక్కువ. మెట్రో నిర్మాణం నేపథ్యంలో నగరంలో ఫుట్‌ఓవర్ బ్రిడ్జ్‌లు పూర్తిగా కనుమరుగయ్యాయి. జీబ్రా క్రాసింగ్స్, పెలికాన్ సిగ్నల్స్ సైతం అవసరమైన స్థాయిలో లేవు. వీటికి తోడు మెట్రోరైల్ నిర్మిస్తున్న ‘అడ్డు గోడ’కొత్త సమస్యల్ని తెచ్చిపెట్టింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మెట్రో రైల్ మార్గం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో ఎలివేటెడ్ విధానంలో నిర్మించిన ట్రాక్ ప్రధాన రహదారి వెంటే ఉంటోంది. దీనికోసం డివైడర్ మధ్యలో పిల్లర్లు నిర్మించారు. ఇప్పుడు సుందరీకరణ పేరుతో హెచ్‌ఎంఆర్ మరో అడ్డుగోడను నిర్మిస్తోంది. పిల్లర్ల మధ్యలో డివైడర్‌కు అటుఇటు దాదాపు రెండున్నర అడుగుల ఎత్తులో గోడను నిర్మిస్తోంది. దీని మధ్యలో మట్టిని పోయడంతో పాటు ఆకర్షణీయంగా ఉండే మొక్కలు పెంచాలని ఆ సంస్థ యోచిస్తోంది. నాగోల్–హబ్సిగూడ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ ఈ నిర్మాణం సాగుతోంది. ఫలితంగా రోడ్డు దాటడానికి పాదచారులు, టర్న్స్ తీసుకోవడానికి వాహనచోదకులు ఎన్నో ఇబ్బందులు పడటంతో పాటు కిలోమీటర్లు చుట్టిరావాల్సి వస్తోంది.
జీహెచ్‌ఎంసీతో కలసి ఠాణాల వారీగా..
ఈ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల వారీగా స్థానిక జీహెచ్‌ఎంసీ ఇంజనీర్లతో కలసి మెట్రో గోడల నిర్మాణంతో పాటు పాదచారులు రోడ్డు దాటేందుకు, వాహనాలు టర్న్స్ తీసుకునేందుకు ఎక్కడెక్కడ అవకాశం కల్పించాలనే దానిపై అధ్యయనం చేశారు. నగరంలో సరాసరిన ప్రతి 1.5 కి.మీ. దూరంలో మెట్రో స్టేషన్లు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఇవే ఫుట్‌ఓవర్ బ్రిడ్జ్‌లుగా ఉపకరిస్తున్నాయి. ఇవి మినహా మిగిలిన చోట్ల ప్రతి 300 మీటర్లకు ఒక చోట పాదచారులు రోడ్డు దాటేందుకు మొత్తం 106 పెడస్ట్రియన్ క్రాసింగ్ అవసరమని గుర్తించారు. వీటిలో 49 చోట్ల వాహనాల కోసం ‘యూ’టర్న్స్‌తో కూడి ఉంటాయి.
ప్రత్యేక డిజైన్‌తో క్రాసింగ్స్
ఈ ప్రాంతాల్లో పాదచారులతో పాటు వాహనచోదకులకూ ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ట్రాఫిక్ పోలీసులు నిశిత అధ్యయనం చేశారు. రాకపోకలు ఎక్కువగా సాగే జనావాస ప్రాంతాలు, ప్రభుత్వ/ప్రైవేట్ కార్యాల యాలు, మార్కెట్స్, మాల్స్, వాణిజ్య ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్లారు. పాదచారులు రోడ్డు దాటేందుకు అనువుగా క్రాసింగ్స్, ప్లాట్‌ఫామ్స్‌తో పాటు 12 చోట్ల పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేసేలా నివేదిక రూపొందించారు. దీనికి సంబంధించి ఓ ప్రత్యేక డిజైన్ సైతం రూపొందించి హెచ్‌ఎంఆర్‌కు అందించారు. ఈ పనుల నిర్వహణ బాధ్యతల్ని ఆ సంస్థ నాలుగు ఏజెన్సీలకు అప్పగించింది. దసరా తర్వాత పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.