
ఆడీ కారులో సరదాగా తిరగాలనే..
ఆడి కారులో తిరగాలనే సరదా.. ఓ యువకుడిని కటకటాల పాలు చేసింది. వివరాల్లోకి వెళితే.. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12లోని సయ్యద్ నగర్లో నివసించే ఎండీ నజీర్(28)కు ఆడి కారులో తిరగాలని కోరిక. దీంతో అతడు రెండు నెలల క్రితం స్థానికంగా నివసించే రస్సెల్స్ స్పోకెన్ ఇంగ్లీష్ అధినేత రస్సెల్స్ జహీర్ వద్ద డ్రైవర్ గా చేరాడు. అంతటితో ఆగకుండా.. గత నెల 12వ తేదీన యజమానికి చెప్పకుండా.. కారు ఎత్తుకు పోయాడు. దీంతో కారు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మూడు రోజులకు కారును శంషాబాద్ ఎయిర్ పోర్టు పార్కింగ్ ప్లేస్ లో గుర్తించారు. నిందితుడు ముంబయికి పరారయ్యాడు. అతడిని గురువారం పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. విచారణలో తనకు ఆడి కారులో తిరగాలని సరదా ఉందని.. రాత్రి పూట పీవీఆర్ ఎక్స్ ప్రెస్ వే పై షికార్లు కొట్టాలని ఉండేదని అందుకే చోరీ చేసినట్లు వెల్లడించారు.
కారు కొట్టేసిన తర్వాత రెండు రోజుల పాటు అర్థరాత్రి ఎయిర్ పోర్టు వరకూ షికార్లు కొట్టానని.. ఎయిర్ పోర్టుకు వెళ్లే వాళ్లకు షేరింగ్ ఇవ్వడం ద్వారా.. డీజిల్ ఖర్చులు సంపాదించానని నిందితుడు తెలిపాడు. అయితే డబ్బులు సరిపోక పోవడంతో.. కారును వదిలేశానని వివరించారు. నజీర్ పై పోలీసులు కేసు నమోదు చేసి.. రిమాండ్ కు తరలించారు.