డ్రగ్‌తో దొరికితేనే పెడ్లర్
♦ వాడుతున్నానని చెబితే బాధితుడు
♦ అమ్మినట్టు ఆధారాలుంటేనే నేరారోపణ
సాక్షి, హైదరాబాద్: అసలు డ్రగ్స్ కేసుల్లో ఎవరు డీలర్ (పెడ్లర్)? ఎవరు బాధితులు? ఈ అంశాలపై ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎన్‌డీపీఎస్(నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకోట్రోఫిక్ సబ్‌స్టాన్సెస్) యాక్ట్ ప్రకారం... ఓ వ్యక్తిని దర్యాప్తు విభాగాలు తనిఖీ చేసినప్పుడు అతడి వద్ద డ్రగ్స్ దొరికితేనే అరెస్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే అతడు డ్రగ్స్ ఇతరులకు అమ్ముతున్నట్టు విచారణలో అదనపు ఆధారాలు లభిస్తేనే.. ఆ వ్యక్తిపై పలు సెక్షన్ల కింద పెడ్లర్‌గా నేరారోపణ మోపే అధికారం ఉంటుంది.
అలా కాకుండా డీలర్ల నుంచి డ్రగ్ కొనుగోలు చేసి తాను మాత్రమే వాడుతున్నట్టు తెలిస్తే.. అతడిని అరెస్ట్ చేసే అవకా శం లేదు. ఆ సమయంలో అతడు బాధితు డవుతాడు. అతడికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చి వదిలివేయాలని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత... తాను డ్రగ్స్ తీసుకుంటున్నట్టు కోర్టులో ఒప్పుకుంటూ డీ అడిక్షన్ సెంటర్‌కు వెళ్తానని స్వయంగా తెలిపితే బెయిల్ విషయంలో కూడా సడలింపులుంటాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.