సర్కారీ ఉద్యోగులకూ ‘ఆసరా’! | aasara scheme for government employees also | Sakshi
Sakshi News home page

సర్కారీ ఉద్యోగులకూ ‘ఆసరా’!

Published Sat, Apr 4 2015 2:25 AM | Last Updated on Sat, Jul 6 2019 4:04 PM

సర్కారీ ఉద్యోగులకూ ‘ఆసరా’! - Sakshi

సర్కారీ ఉద్యోగులకూ ‘ఆసరా’!

 ప్రభుత్వ ఉద్యోగులు, వారి తల్లిదండ్రులకు పింఛన్లు
     భర్త బతికే వున్నా, అసలు పెళ్లే కాకున్నా వితంతు పింఛన్లు
     నల్లగొండ మునిసిపాలిటీలో భారీ గోల్‌మాల్
     ఒకే వార్డులో 13 ప్రభుత్వ ఉద్యోగ కుటుంబాలకు పింఛన్లు
     మున్సిపాలిటీ విచారణలో వెల్లడి
 సాక్షి, హైదరాబాద్: ఆసరా పింఛన్లు... సామాజిక, ఆర్థిక సమస్యలకు తోడు వృద్ధాప్యం, వైకల్యం, వైధవ్యంతో దీనస్థితిలో బతుకీడుస్తున్న అభాగ్యులకు కొద్దిపాటి ఊరట కలిగించే సాధనం. మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ పథకం పక్కదారి పడుతోంది. ప్రతి నెలా ఒకటో తేదీన ఠంఛన్‌గా ఐదంకెల జీతాలు అందుకునే ప్రభుత్వ ఉద్యోగులు సైతం సామాజిక పింఛన్లు బొక్కేస్తున్నారు. ఐదొందలు, వెయ్యి రూపాయలకు కక్కుర్తిపడి అభ్యాగుల ‘ఆసరా’ను లాక్కుంటున్నారు. వడ్డించే వాడు మనోడే అని.. నల్లగొండ పురపాలక సంఘం పరిధిలో ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులు, వారి భార్యలు, తల్లిదండ్రులు, సర్వీసు పెన్షన్‌దారులు సైతం ఆసరా పింఛన్లను అందుకుంటున్నారు.

ఓ ఫిర్యాదు ఆధారంగా పురపాలక శాఖ జరిపిన ప్రత్యేక విచారణలో ఇలాంటి అక్రమాలు బహిర్గతమయ్యాయి. నల్లగొండ పట్టణంలోని 15వ వార్డులో ఆసరా పింఛన్ల పంపిణీలో జరుగుతున్న అక్రమాలపై ఇటీవల ఓ వ్యక్తి పురపాలక శాఖ రాష్ట్ర కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు డీఈఈతో దీనిపై విచారణ చేపట్టగా నివ్వెరబోయే వాస్తవాలు బయటపడ్డాయి. ఈ ఒక్క వార్డులోనే 13 పింఛన్లను ప్రభుత్వ ఉద్యోగులు, వారి భార్యలు, తల్లిదండ్రులు దిగమింగుతున్న విషయం వెల్లడైంది. నల్లగొండ పురపాలక సంఘంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల తల్లులు సైతం ఇందులో ఉన్నారు. భర్త బతికే వున్నా ఓ మహిళ వితంతు పింఛన్ అందుకుంటుండగా.. అసలు పెళ్లే కాని ఓ మహిళ సైతం వితంతు పింఛన్ పొందుతోంది.

65 ఏళ్ల వయసు లేని వారు సైతం వృద్ధ్యాప్య పెన్షన్లు తీసుకుంటున్నారు. స్థానిక మునిసిపల్ కమిషనర్ నుంచి పురపాలక శాఖకు చేరిన విచారణ నివేదికను ‘సాక్షి’ సంపాదించింది. వెంటనే ఈ పింఛన్లను రద్దు చేసి వీరి స్థానంలో అర్హులైన లబ్ధిదారులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ఉన్నతాధికారులు మునిసిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. బోగస్ లబ్ధిదారుల నుంచి పింఛన్ల సొమ్మును రికవరీ చేయడంతో పాటు బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు చెప్పారు.


 నల్లగొండలోని 15వ వార్డులో ‘ఆసరా’ అక్రమాల చిట్టా..
 క్ర.సం    లబ్ధిదారుడు    భర్త/తండ్రి    వివరం
 1.    జి. రాములమ్మ    సాయిలు    ఈమె ప్రభుత్వ ఉద్యోగి
 2.    కత్తుల ఆడివమ్మ    నర్సయ్య    ఈమె కుమారుడు విద్యుత్ శాఖ ఉద్యోగి
 3.    కత్తుల మల్లయ్య    దుర్గయ్య    కుమారుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు
 4.    కత్తుల యల్లయ్య    వెంకయ్య    ఇతనికి 65 ఏళ్లు లేకున్నా వృద్ధాప్య పింఛన్
 5.     కత్తుల సత్తమ్మ    చిత్తారి    భర్త విద్యాశాఖ రిటైర్డు ఉద్యోగి. సర్వీసు పెన్షన్ లభిస్తోంది.
 6.    కత్తుల ముత్తమ్మ    లింగయ్య    భర్త ప్రభుత్వ ఉద్యోగి
 7.    మైనం లక్ష్మీ    ఆదం    భర్త చనిపోలేదు (వితంతువుగా అనర్హురాలు)
 8.    బి. హరిబాయమ్మ    యల్లయ్య    కొడుకు పోలీసు శాఖలో ఉద్యోగి
 9.    తీగల లచ్చయ్య    లింగయ్య    కొడుకు విద్యాశాఖలో ఉద్యోగి
 10.    కత్తుల రాములమ్మ    లచ్చయ్య    కొడుకు సమాచార, ప్రచార శాఖలో ఉద్యోగి
 11.    సముద్రాల భద్రమ్మ    పెద్దయ్య    భర్తకూ పెన్షన్ వస్తోంది. ఈమె వయసు 65 ఏళ్ల లోపే.
 12.    సముద్రాల భద్రమ్మ    వెంకటేశ్వర్లు    ఈమె కుమారుడు ప్రభుత్వ వైద్యాధికారి
 13.    బత్తుల లక్ష్మమ్మ    యల్లమ్మ    ఈమె కుమారుడు నల్లగొండ మునిసిపాలిటీలో ఉద్యోగి
 14.    కత్తుల పిచ్చమ్మ    లింగయ్య    ఈమె కుమారుడు నల్లగొండ మునిసిపాలిటీలో ఉద్యోగి
 15.    తగుళ్ల లక్ష్మి       -    ఈమెకు పెళ్లి కాలేదు. వితంతు పింఛన్‌కు అనర్హురాలు
 16.    రడంపల్లి చంద్రమ్మ    భిక్షమయ్య    ఈమె కుమారుడు రైల్వే శాఖలో ఉద్యోగి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement