క్షణ క్షణం!
అభయ్ కిడ్నాప్‌నకు గత సోమవారం పథక రచన
మంగళవారం అవసరమైన ‘వస్తువుల’ సేకరణ
బుధవారం 3 గంటల్లోనే కిడ్నాప్, హత్య, పరారీ
షాహినాయత్‌గంజ్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న పదో తరగతి విద్యార్థి అభయ్ కిడ్నాప్‌నకు కుట్ర, అమలు మూడు రోజుల్లోనే జరిగాయి. అపహరణ, హత్య, పరారీ... ఘట్టాలను ముగ్గురు నిందితులు బుధవారం మూడు గంటల్లోనే పూర్తి చేశారు. దీని పూర్వాపరాలు ఇలా... - సాక్షి, సిటీబ్యూరో
సోమవారం రాత్రి:
నెలలుగా సినిమాల్లో చేరాలనే కోరికతో ఉన్న, దానికి డబ్బు కావాలని భావిస్తున్న సాయి, రవి, మోహన్ సోమవారం రాత్రి తమ గదిలో ఓ సినిమా చూశారు. అది ఇచ్చిన స్ఫూర్తితోనే అభయ్‌ను కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నారు.
మంగళవారం:
కిడ్నాప్‌కు, బాధితుడిని బంధించడానికి, అతడి కుటుంబీలకు ఫోన్లు చేసి డబ్బు డిమాండ్ చేయడానికి అవసరమైన ‘ఉపకరణాలను’ బేగంబజార్ ప్రాంతం నుంచి సమకూర్చుకున్నారు.
బుధవారం జరిగింది ఇదీ
⇒మధ్యాహ్నం : 3.00 అభయ్‌ను కిడ్నాప్ చేయడానికి రంగంలోకి దిగిన సాయి... జ్ఞాన్‌బాగ్‌కాలనీ పరిసర ప్రాంతాల్లో కాపుకాశాడు.
⇒సాయంత్రం : 4.49 అల్పాహారం తెచ్చేందుకు అభయ్ తన ఇంటి నుంచి సీతారాంపేట్‌లో ఉండే మహాలక్ష్మీ టిఫిన్ సెంటర్‌కు వెళ్లాడు.
⇒సాయంత్రం : 5.00 లిఫ్ట్ ఇవ్వమంటూ అభయ్‌ను ట్రాప్ చేసిన సాయి... కిడ్నాప్ చేసేందుకు తన రూమ్ వైపు మళ్లించాడు.
⇒సాయంత్రం : 5.30 హిందీనగర్‌లోని రూమ్‌కు వెళ్లిన తర్వాత కిడ్నాప్ చేస్తున్నట్లు అభయ్‌కు చెప్పిన ముగ్గురు నిందితులూ బంధించారు.
⇒ రాత్రి : 7.10 అభయ్ మరణించాడని గుర్తించిన ముగ్గురు నిందితులూ మృతదేహాన్ని పార్శిల్ చేసి సికింద్రాబాద్‌కు బయలుదేరారు.
⇒ రాత్రి : 7.30 అభయ్ ఆచూకీ తెలియకపోవడంతో జ్ఞాన్‌బాగ్‌కాలనీ పరిసర ప్రాంతాల్లో గాలించిన కుటుంబీకులు షాయినాయత్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
⇒ రాత్రి : 6.00 అబిడ్స్ జగదీష్ మార్కెట్ మీదుగా సికింద్రాబాద్ చేరుకున్న నిందితులు ‘పార్శిల్’ను అల్ఫా హోటల్ వద్ద వదిలేసి రైల్వేస్టేషన్‌లోకి వెళ్లిపోయారు.
⇒రాత్రి : 9.00 నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కిన నిందితులు ఆ రైలు కదలడానికి ముందు అభయ్ కుటుంబీ కులకు తొలి బెదిరింపు ఫోన్‌కాల్ చేశారు.
⇒ రాత్రి : 11.00 రైలు గుంటూరు వైపు పరిగెడుతుండగా... మరో బెదిరింపు కాల్ చేశారు.
గురువారం : విజయవాడలో సిమ్‌కార్డులు, సెల్‌ఫోన్ పారేసిన నిందితులు హౌరా ఎక్స్‌ప్రెస్ ఎక్కి ఇచ్ఛాపురం, బరంపురం వెళ్లారు.
శనివారం : ముమ్మరంగా గాలించిన పోలీసులు ముగ్గురు నిందితుల్నీ పట్టుకున్నారు.
ఆదివారం : అభయ్ కిడ్నాప్, హత్య కేసులో పోలీసులు సాయి, రవి, మోహన్‌లను అరెస్టు చేశారు.