భాగ్యనగరిపై.. చెరగని సంతకం
సలాం కలాం
అణు శాస్త్రవేత్తగా ప్రస్థానం... వైద్య రంగంలో అత్యాధునిక పరికరాల సృష్టికర్తగా ఆవిష్కరణం... రాష్ట్రపతిగా అరుదైన గౌరవం... సామాజిక సేవతో చైతన్యం... వ్యక్తిత్వ వికాస నిపుణునిగా స్ఫూర్తిదాయకం...ఇలా జీవితపు ప్రతి మలుపులోనూ భాగ్యనగ రితో ఆయనది మరువరాని అనుబంధం. అన్ని విశిష్టతల విలక్షణమూర్తి... మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం. ఆయన ఇక లేరన్న నిజాన్ని తట్టుకోలేక మహా నగరం శోక సంద్రంలో మునిగిపోయింది. ‘కలలు కనండి... వాటిని సాకారం చేసుకోండి’ అంటూ కర్తవ్య బోధ చేసిన స్ఫూర్తి ప్రదాతను మరి చూడలేమంటూ యువలోకం చిన్నబోయింది.
ఓయూతో విడదీయరాని అనుబంధం
ఉస్మానియా యూనివర్సిటీ: భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఉస్మానియా విశ్వవిద్యాలయంతో ఎంతో అనుబంధం ఉంది. కలామ్ సైంటిస్టుగా ఉన్నడు క్యాంపస్‌లోని ఇంజినీరింగ్ కళాశాల ఎదుట ఆర్‌అండ్‌టీ యూనిట్ ఫర్ నావిగేషనల్ ఎలక్ట్రానిక్స్ స్థాపించి తొలి డెరైక్టర్‌గా పనిచేశారు. ఈ సంస్థ ద్వారా అనే పరిశోధనలు చేసి రక్షణ రంగానికి అందచేశారు. ఓయూను అనేక సార్లు సందర్శించిన కలాం రాష్ట్రపతి హోదాలో దివగంత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో కలసి క్యాంపస్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం కీలక దశలో ఉంది. ప్రస్తుత టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ (గతంలో ఓయూ విద్యార్థి) స్నాతకోత్సవంలో జై తెలంగాణ నిదాలు చేయగా.. ఓపిక పట్టాలని కలాం శాంతింప చేశారు. గత ఏడాది ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల బయోమెడిసిన్ ఇంజినీరింగ్ విభాగంలో నానో, బయో, టెక్నో, కాగ్నో (ఎన్‌బీఐసీ) అంశంపై జరిగిన జాతీయ సదస్సుకు కలాం హాజరయ్యారు. అదే రోజు ఓయూ రోడ్డులోని శ్రీ అరంబిందో ఇంటర్నేషనల్ స్కూల్‌లో విద్యార్థులను ఉత్తేజపరిచేలా ప్రసంగించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఓపికతో సమాధానాలు చెప్పారు. ఇప్పటికీ కళ్లలో మెదులుతున్న ఆ దృష్యాలు చెదరక ముందే ఆ గొప్ప దార్శనికుడు కన్నుమూయడం దేశానికి ఎంతో లోటని ఓయూ బయోమెడిసిన్ ఇంజినీరింగ్ అధ్యాపకుడు మేడిపల్లి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన ఉపాన్యాసాన్ని ట్రాన్స్‌లేట్ చేశా
సాక్షి,సిటీబ్యూరో: మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం స్ఫూర్తి, కీర్తి దేశానికి అవసరమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి అన్నారు. గత ఏడాది ఫిబ్రవరి 4న ఎల్‌బీ స్టేడియంలో లీడ్ ఇండియా 2020 కార్యక్రమంలో కలాం ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించానని, ఆ భాగ్యం తనకు దక్కడం పూర్వ జన్మ సుకృతమన్నారు. కలాం మన జాతి రత్నమని, శాస్త్రవేత్తగా, వేదాంతిగా, భగవద్గీత, ఖురాన్‌లను అవగాహన చేసుకొన్న మేధావి అని కొనియాడారు. ప్రపంచం శ్లాఘించదగ్గ శాస్త్రవేత్త ఇక లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నామన్నారు. కలాం మృతికి ప్రగాఢ సానుభూతి వ్యక ్తం చేస్తున్నట్లు తెలిపారు.
రేడియోలో ప్రసంగాలు తర్జుమా చేశా: డా. చెన్నయ్య
రాష్ట్రపతి అబ్దుల్ కలాం ముఖ్య దినాల్లో జాతినుద్దేశించి చేసే ప్రసంగాలు ఏడాదికి ఆరు సార్లు చాలా సంవత్సరాలు తెలుగులోకి ఆకాశవాణిలో అనువాదం చేసినట్లు తెలుగు వ ర్సిటీ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ డాక్టర్ జె. చెన్నయ్య తెలిపారు. ఆయన మృతి భారతజాతికి తీరనిలోటన్నారు.
జాతిరత్నం మృతిని జీర్ణించుకోలేం: విరాహత్ అలీ
భారత జాతి రత్నం అబ్దుల్ కలాం మృతి జీర్ణించుకోలేమని ఐజేయూ అనుబంధ విభాగం టీయూడబ్ల్యూజే తెలంగాణ రాష్ట్ర ముఖ్యనేత విరాహత్ అలీ అన్నారు. జర్నలిస్టులకు కూడా ఆయన జీవనశైలి ఆదర్శప్రాయంగా నిలిచిందని, ఆయన మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
ఎక్కువ సమయం చిన్నారులతోనే..
చాంద్రాయణగుట్ట: భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు పాతబస్తీతో విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన సైంటిస్ట్‌గా కొనసాగిన డీఆర్‌డీవో కూడా పాతబస్తీలోనే ఉంది. ఆయన రాష్ట్రపతిగా నియమితులైన అనంతరం 2004 జనవరి 19న పాతబస్తీ లాల్ దర్వాజాలోని ఇంద్ర విద్యానికేతన్ హైస్కూల్‌ను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. డీఆర్‌డీవోలో ఆయనతో కలిసి పనిచేసిన పాఠశాల చైర్మన్ ఆర్.ఎన్.అగర్వాల్ ఆహ్వానం మేరకు ఆయన పాఠశాలకు విచ్చేశారు. దాదాపు రెండు గంటల పాటు విద్యార్థులతో మాట్లాడారు. ఆ సమయంలో స్థానికంగా ఉన్న వివిధ పాఠశాలల విద్యార్థులను కూడా ఇక్కడికి రప్పించి ఆయనతో మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. ఈ సమయంలో పాఠశాల యాజమాన్యం మరికొన్ని కార్యక్రమాలు రూపొందించినా ఆయన కేవలం విద్యార్థులతో ముచ్చటించేందుకే సమయాన్ని కేటాయించారు. అలాంటి గొప్ప వ్యక్తి మృతి వార్త తెలుసుకుని పాఠశాల ఉపాధ్యాయులు విచారం వ్యక్తం చేశారు.
తప్పు చేస్తే ‘హీరో ఆఫ్‌ది డే’ అనేవారు
కలాం అధ్వర్యంలో జరిగిన అగ్ని, పృథ్వి మిస్సైల్ ప్రాజెక్టులో ఐదేళ్ల పాటు పనిచేసే భాగ్యం నాకు దక్కింది. విధి నిర్వహణలో చిన్నచిన్న పొరపాట్లు చేస్తే ఆయన కోపగించుకునేవారు కాదు. ‘ఈ రోజు హీరో ఆఫ్ ది డే నువ్వే’ అనేవారు. జరిగిన లోపాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని ఆయన నిరంతరం మాకు సూచించేవారు. అర్ధరాత్రి, అపరాత్రి పరిశోధనలే ఆయన ప్రపంచం. ఆర్‌సీఐలో పనిచేస్తున్న సమయంలోనే పద్మవిభూషణ్ అవార్డు కలాంను వరించింది. విధుల్లో ఎలాంటి సందేహాలు తలెత్తినా ఆయనను అడిగితే ఓర్పుతో సమాధానం ఇచ్చేవారు. తన కింద పనిచేస్తున్న ఉద్యోగులతో మిత్రుడిగా, సహచరుడిగా మెలిగేవారు. కష్టపడి పనిచేసేవారిని ఎప్పుడూ మెచ్చుకునేవారు.
- టి.వి.రెడ్డి, ఆర్‌సీఐ రిటైర్డ్ టెక్నికల్ అధికారి