Former President APJ Abdul Kalam
-
‘మిసైల్ మ్యాన్’కు నివాళి
దివంగత మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్ కలాంకు గురువారం ఉదయం సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే ఉభయ సభలు నివాళులర్పించాయి. ఒక నిమిషం పాటు మౌనం పాటించడం ద్వారా శ్రద్ధాంజలి ఘటించారు. కాగా, ఒక సామాన్య వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించి, భారతరత్న పురస్కారాన్ని అందుకునే స్థాయికి ఎదిగడంతో పాటు యువతలో స్ఫూర్తిని నింపిన దార్శనికుడిని కోల్పోవడం నిజంగా దురృష్టమని ఈ సందర్భంగా సభ్యులు వ్యాఖ్యానించారు. - సాక్షి, బెంగళూరు -
ఆయన ఏదీ ఉచితంగా తీసుకొనేవారు కాదు..
*మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సంగీత గురువు కల్యాణి * సంగీతమంటే ప్రాణం * శ్రీరాగం ఇష్టపడేవారు * వీణ నేనే అందజేశా *బాధలో ఉన్నా..సంతోషంగా ఉన్నా వీణ వాయించేవారు హైదరాబాద్ : ‘స్వచ్ఛమైన దేశభక్తుడు, గొప్ప మానవతావాది ఆయన. చిన్నా పెద్ద తేడాలేకుండా కోట్లాది మందిలో స్ఫూర్తినింపారు అబ్దుల్ కలాం. సామాన్యుడిగా పుట్టి అత్యున్నత శిఖరాలను ఒక కలతో అందుకొన్న అసామాన్యుడు. తల్లి, తండ్రి, గురువు ఈ మూడు పదాలను ఎంతో ఇష్టపడే అనన్య సామాన్యుడు. ఒకరకంగా నాకు ఆయనే మార్గదర్శి. అంత గొప్ప వ్యక్తికి సంగీతం నేర్పించే అవకాశం లభించడం నా అదృష్టం. ఒక మంచి ఘడియలో.. యువతరానికి స్పీచ్ ఇస్తూ తుది శ్వాస విడిచిన ఆ దైవ స్వరూపం మళ్లీ పుట్టాలి. పుడతారు కూడా...అంటూ గద్గద స్వరంతో చెప్పుకొచ్చారు ప్రముఖ సంగీత గురువు ఎం.కల్యాణి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు నాలుగేళ్లపాటు సంగీతం నేర్పించిన ఆమె..కలాంతో ఉన్న అనుబంధాన్ని మంగళవారం ‘సాక్షి’ కి వివరించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... అబ్దుల్ కలాం డీఆర్డీవోలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయమది. ఆ సమయంలో ఆయన ప్రభుత్వ కీలక సలహాదారుగానూ ఉన్నారు. డిఫెన్స్ ల్యాబ్స్ స్కూల్లో నేను సంగీత ఉపాధ్యాయురాలిని. స్కూల్లో ఏదో కార్యక్రమానికి ఆహ్వానించేందుకు వెళ్లాం. కలాంతో అదే తొలి పరిచయం. నేను సంగీతం నేర్చుకొంటా అన్నారు. అక్కడి మెస్‌లో సాయంత్ర సమయంలో సంగీత క్లాసులు నిర్వహిస్తారని తెలిసి..ఓ శనివారం వచ్చారు. 1989 ఆగస్టు మొదలు 1992 డిసెంబర్ వరకు వీణ నేర్చుకునేందుకు వచ్చేవారు. ఆ తర్వాత రాష్ట్రపతిగా ఢిల్లీ వెళ్లారనుకొంటా. గాంధీ తర్వాత... భగవద్గీత, ఇతర హిందూ గ్రంథాలు, ఖురాన్, బైబిల్లను ఇష్టపడే వారు. కొన్ని విషయాలపై చర్చించే వారు. ఆయన మతాలకు అతీతమైన వ్యక్తిగా నేను నేరుగా చూశాను. మహాత్మాగాంధీ తర్వాత అంతటి వ్యక్తి కలాం. స్థాయిలోనూ, వయసులోనూ చిన్నదాన్ని అయినా.. నాకు ఎనలేని గౌరవం ఇచ్చేవారు. ఆయన నుంచే పెద్దలను, గురువులను గౌరవించటం, పిల్లలను ప్రేమించటం నేర్చుకొన్నా. ఆయనలో ఫాదర్ నేచర్ చూశా. శ్రీ రాగం ఇష్టపడేవారు.. త్యాగయ్య కీర్తనల్లోని శ్రీరాగం బాగా ఇష్టపడేవారు. సంతోషంగా ఉన్నా, ఒత్తిడికి గురైనా వెంటనే వీణ వాయించేవారు. కలాం మరణం భారతదేశానికి తీరని లోటు. అంతా ఈశ్వర నిర్ణయం. ఆ స్కూల్లో పని చేయటం నా అదృష్టం. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన యువతకి నేర్పిన స్ఫూర్తి నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. నా చేతుల మీదుగా వీణ ఇచ్చా... ఆయన ఏదీ ఉచితంగా తీసుకొనేవారు కాదు. వీణ కొన్నది ఆయనే. కానీ నా చేతుల మీదుగా ఇమ్మని తీసుకొని బంగారు వస్తువు దాచుకొన్నట్లు జాగ్రత్తగా దాచుకున్నారు. వర్ణించలేని గొప్ప లక్షణాలు ఉన్నవారు. మా నాన్న నా చిన్న వయసులో పోయారు. కలాం నాకు తండ్రి లాంటి వారు. నేనే ఆయనకు పాదాభివందనం చేశా. ఉపాధ్యాయులను గౌరవించటం ఎవరైనా ఆయన నుంచే నేర్చుకోవాలి. -
కలాంకు క్రీడా ప్రపంచం నివాళి
శ్రద్ధాంజలి ఘటించిన ప్రముఖులు న్యూఢిల్లీ: మాజీ రాష్ర్టపతి ఏపీజే అబ్దుల్ కలాం పార్థివ దేహానికి భారత క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ నివాళులర్పించాడు. సోమవారం షిల్లాంగ్‌లోని ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ కుప్పకూలిన కలాం మరణించిన విషయం తెలిసిందే. మంగళవారం రాజాజీ మార్గ్‌లోని ఆయన అధికారిక నివాసంలో ఉంచిన మృతదేహాన్ని సచిన్ సందర్శించాడు. కలాంలాంటి ఉన్నతమైన వ్యక్తిని కోల్పోయి దేశం రోదిస్తోందని సచిన్ అన్నాడు. కలాం పుస్తకాలు ప్రభావితం చేశాయి: పుజారా కలాం రాసిన పుస్తకాలు దేశ యువతతో పాటు తనను కూడా ఎంతగానో ప్రభావితం చేశాయని టెస్టు బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ‘విజన్ 2020 మిషన్స్’ అనే పుస్తకమంటే ఎంతో ఇష్టమని చెప్పాడు. ‘కలాం పుస్తకాలు దాదాపు అన్నీ చదివాను. ఆయనకున్న అపార పరిజ్ఞానాన్ని దేశంతో పంచుకున్న తీరు అద్భుతం. అందరికీ ఆయన ఆదర్శప్రాయుడే’ అని పుజారా తెలిపాడు. కొనసాగిన క్రీడా ప్రముఖుల నివాళి అబ్దుల్ కలాం మృతికి క్రీడాలోకం నివాళి అర్పిస్తూనే ఉంది. దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్‌తో పాటు బల్బీర్ సింగ్ సీనియర్ తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. రాష్ర్టపతి భవన్లో జరిగిన అవార్డుల కార్యక్రమంలో తాను కలాంను కలుసుకున్నట్టు మిల్కా సింగ్ తెలిపారు. తనను చూడగానే ఆయన ఎంతో సంతోషించారని, దేశంలో క్రీడలు ఎందుకు వెనుకబడి ఉన్నాయని అడిగారని గుర్తుచేసుకున్నారు. కలలను సాకారం చేసుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలంటూ ఆయన చెబుతుండేవారని 91 ఏళ్ల మాజీ హాకీ ఆటగాడు బల్బీర్ సింగ్ అన్నారు. ఆయన చేతుల మీదుగా పద్మశ్రీ తీసుకున్నా.. అబ్దుల్ కలాం చేతులమీదుగా తాను పద్మశ్రీ అవార్డును అందుకోవడం జీవితంలో మరిచిపోలేని క్షణమని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ‘2003 ప్రపంచకప్ అనంతరం మేమంతా కలాంను కలిశాం. కొద్దిసేపు నేను ఆయనతో సంభాషించడం గౌరవంగా భావిస్తున్నాను. క్రికెట్ గురించి ఆయనకు విడమరిచి చెప్పాం. 2004లో ఆయన చేతుల మీదుగానే పద్మశ్రీని అందుకున్నాను. అదో చిరస్మరణీయ జ్ఞాపకం. ఎలాంటి భేషజాలు లేని అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. నా వాట్స్అప్లో కలాంతో దిగిన ఫొటోను పెట్టుకున్నాను’ అని గంగూలీ తెలిపాడు. -
చెరగని జ్ఞాపకం
రాష్ట్రపతి హోదాలో, ఆ తర్వాత పలుమార్లు అబ్దుల్ కలాం జిల్లా పర్యటన తిరుమలేశుని దర్శించుకోవడం ఆయనకు ఎంతో ఇష్టం ఎస్వీయూ స్వర్ణోత్సవాలకు హాజరు మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాంకు ఈ జిల్లాతో విడదీయలేని బంధం ఉంది. రాష్ర్టపతి హోదాలోనూ, అనంతరం కూడా పలుమార్లు జిల్లాలో పర్యటించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం అంటే ఆయనకు చాలా ఇష్టం. శ్రీవారి ప్రసాదం ప్రీతిపాత్రంగా స్వీకరించేవారు. తిరుమల: భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు తిరుమల క్షేత్రంతో విడదీయరాని బంధం ఉంది. రాష్ట్రపతి హోదాలోనూ, ఆ తర్వాత పలుమార్లు ఆయన తిరుమల క్షేత్రాన్ని సందర్శించారు. శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ‘ఈ క్షేత్రానికి రావడం, శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఇష్టం’ అని తన అనుభూతిని పంచుకునేవారు. స్వామి దర్శనంలో భక్తిశ్రద్ధలతో కనిపించేవారు. సామాన్య మహ్మదీయ కుటుంబంలో జన్మించిన ఆయన మత సామరస్యాన్ని పాటించారు. ఇక్కడి ఆలయ ఆచార సంప్రదాయాలను గౌరవించారు. శ్రీవారి ప్రసాదాన్ని ఇష్టంగా స్వీకరించేవారు. ఆలయ పెద్ద జీయర్తోనూ, ప్రధాన అర్చకులు రమణ దీక్షితులతోనూ ఇష్టంగా మాట్లాడేవారు. అందరికంటే వేద విద్యార్థులు కనిపిస్తే వారిని పిలిచి మరీ మాట్లాడేవారు. స్వామివారంటే ఎనలేని భక్తి ‘అబ్దుల్‌కలాంగారు రాష్ట్రపతి హోదాలో, పదవీ విరమణ తర్వాత కూడా స్వామివారి దర్శనానికి వచ్చారు. స్వామి అంటే ఎనలేని భక్తి. సామాన్యుడిగానే కనిపించేవారు. ఆలయానికి వచ్చినప్పుడు ఆప్యాయంగా పలకరించేవారు. ఆయన సైంటిస్ట్‌గా ఉన్నప్పుడే తరచూ ఆలయానికి వచ్చేవారు. ఆ సందర్భంలోనే నేనొక సైంటిస్ట్ అనే వారితో ముచ్చటించాను. లౌకిక పరమైన విషయాలతో కాకుండా ఆధ్యాత్మిక భావన, సోదర, మానవతా దృష్టితో ప్రపంచాన్ని చూసేలా నిత్యం నలుగిరికీ ప్రబోధించాలన్న కలాంగారి మాటల్ని మరువలేను. ఆ తర్వాత రాష్ట్రపతి హోదాలో వారితో గడిపిన క్షణాలు మరువలేం. పరలోకంలో ఉన్నా వారి ఆత్మకు శాంతిని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు.’ - రమణదీక్షితులు, ఆలయ ప్రధాన అర్చకులు -
భాగ్యనగరిపై.. చెరగని సంతకం
సలాం కలాం అణు శాస్త్రవేత్తగా ప్రస్థానం... వైద్య రంగంలో అత్యాధునిక పరికరాల సృష్టికర్తగా ఆవిష్కరణం... రాష్ట్రపతిగా అరుదైన గౌరవం... సామాజిక సేవతో చైతన్యం... వ్యక్తిత్వ వికాస నిపుణునిగా స్ఫూర్తిదాయకం...ఇలా జీవితపు ప్రతి మలుపులోనూ భాగ్యనగ రితో ఆయనది మరువరాని అనుబంధం. అన్ని విశిష్టతల విలక్షణమూర్తి... మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం. ఆయన ఇక లేరన్న నిజాన్ని తట్టుకోలేక మహా నగరం శోక సంద్రంలో మునిగిపోయింది. ‘కలలు కనండి... వాటిని సాకారం చేసుకోండి’ అంటూ కర్తవ్య బోధ చేసిన స్ఫూర్తి ప్రదాతను మరి చూడలేమంటూ యువలోకం చిన్నబోయింది. ఓయూతో విడదీయరాని అనుబంధం ఉస్మానియా యూనివర్సిటీ: భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఉస్మానియా విశ్వవిద్యాలయంతో ఎంతో అనుబంధం ఉంది. కలామ్ సైంటిస్టుగా ఉన్నడు క్యాంపస్‌లోని ఇంజినీరింగ్ కళాశాల ఎదుట ఆర్‌అండ్‌టీ యూనిట్ ఫర్ నావిగేషనల్ ఎలక్ట్రానిక్స్ స్థాపించి తొలి డెరైక్టర్‌గా పనిచేశారు. ఈ సంస్థ ద్వారా అనే పరిశోధనలు చేసి రక్షణ రంగానికి అందచేశారు. ఓయూను అనేక సార్లు సందర్శించిన కలాం రాష్ట్రపతి హోదాలో దివగంత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో కలసి క్యాంపస్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం కీలక దశలో ఉంది. ప్రస్తుత టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ (గతంలో ఓయూ విద్యార్థి) స్నాతకోత్సవంలో జై తెలంగాణ నిదాలు చేయగా.. ఓపిక పట్టాలని కలాం శాంతింప చేశారు. గత ఏడాది ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల బయోమెడిసిన్ ఇంజినీరింగ్ విభాగంలో నానో, బయో, టెక్నో, కాగ్నో (ఎన్‌బీఐసీ) అంశంపై జరిగిన జాతీయ సదస్సుకు కలాం హాజరయ్యారు. అదే రోజు ఓయూ రోడ్డులోని శ్రీ అరంబిందో ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యార్థులను ఉత్తేజపరిచేలా ప్రసంగించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఓపికతో సమాధానాలు చెప్పారు. ఇప్పటికీ కళ్లలో మెదులుతున్న ఆ దృష్యాలు చెదరక ముందే ఆ గొప్ప దార్శనికుడు కన్నుమూయడం దేశానికి ఎంతో లోటని ఓయూ బయోమెడిసిన్ ఇంజినీరింగ్ అధ్యాపకుడు మేడిపల్లి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఉపాన్యాసాన్ని ట్రాన్స్‌లేట్ చేశా సాక్షి,సిటీబ్యూరో: మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం స్ఫూర్తి, కీర్తి దేశానికి అవసరమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి అన్నారు. గత ఏడాది ఫిబ్రవరి 4న ఎల్బీ స్టేడియంలో లీడ్ ఇండియా 2020 కార్యక్రమంలో కలాం ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించానని, ఆ భాగ్యం తనకు దక్కడం పూర్వ జన్మ సుకృతమన్నారు. కలాం మన జాతి రత్నమని, శాస్త్రవేత్తగా, వేదాంతిగా, భగవద్గీత, ఖురాన్‌లను అవగాహన చేసుకొన్న మేధావి అని కొనియాడారు. ప్రపంచం శ్లాఘించదగ్గ శాస్త్రవేత్త ఇక లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నామన్నారు. కలాం మృతికి ప్రగాఢ సానుభూతి వ్యక ్తం చేస్తున్నట్లు తెలిపారు. రేడియోలో ప్రసంగాలు తర్జుమా చేశా: డా. చెన్నయ్య రాష్ట్రపతి అబ్దుల్ కలాం ముఖ్య దినాల్లో జాతినుద్దేశించి చేసే ప్రసంగాలు ఏడాదికి ఆరు సార్లు చాలా సంవత్సరాలు తెలుగులోకి ఆకాశవాణిలో అనువాదం చేసినట్లు తెలుగు వ ర్సిటీ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ డాక్టర్ జె. చెన్నయ్య తెలిపారు. ఆయన మృతి భారతజాతికి తీరనిలోటన్నారు. జాతిరత్నం మృతిని జీర్ణించుకోలేం: విరాహత్ అలీ భారత జాతి రత్నం అబ్దుల్ కలాం మృతి జీర్ణించుకోలేమని ఐజేయూ అనుబంధ విభాగం టీయూడబ్ల్యూజే తెలంగాణ రాష్ట్ర ముఖ్యనేత విరాహత్ అలీ అన్నారు. జర్నలిస్టులకు కూడా ఆయన జీవనశైలి ఆదర్శప్రాయంగా నిలిచిందని, ఆయన మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ సమయం చిన్నారులతోనే.. చాంద్రాయణగుట్ట: భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు పాతబస్తీతో విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన సైంటిస్ట్‌గా కొనసాగిన డీఆర్డీవో కూడా పాతబస్తీలోనే ఉంది. ఆయన రాష్ట్రపతిగా నియమితులైన అనంతరం 2004 జనవరి 19న పాతబస్తీ లాల్ దర్వాజాలోని ఇంద్ర విద్యానికేతన్ హైస్కూల్‌ను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. డీఆర్డీవోలో ఆయనతో కలిసి పనిచేసిన పాఠశాల చైర్మన్ ఆర్.ఎన్.అగర్వాల్ ఆహ్వానం మేరకు ఆయన పాఠశాలకు విచ్చేశారు. దాదాపు రెండు గంటల పాటు విద్యార్థులతో మాట్లాడారు. ఆ సమయంలో స్థానికంగా ఉన్న వివిధ పాఠశాలల విద్యార్థులను కూడా ఇక్కడికి రప్పించి ఆయనతో మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. ఈ సమయంలో పాఠశాల యాజమాన్యం మరికొన్ని కార్యక్రమాలు రూపొందించినా ఆయన కేవలం విద్యార్థులతో ముచ్చటించేందుకే సమయాన్ని కేటాయించారు. అలాంటి గొప్ప వ్యక్తి మృతి వార్త తెలుసుకుని పాఠశాల ఉపాధ్యాయులు విచారం వ్యక్తం చేశారు. తప్పు చేస్తే ‘హీరో ఆఫ్‌ది డే’ అనేవారు కలాం అధ్వర్యంలో జరిగిన అగ్ని, పృథ్వి మిస్సైల్ ప్రాజెక్టులో ఐదేళ్ల పాటు పనిచేసే భాగ్యం నాకు దక్కింది. విధి నిర్వహణలో చిన్నచిన్న పొరపాట్లు చేస్తే ఆయన కోపగించుకునేవారు కాదు. ‘ఈ రోజు హీరో ఆఫ్ ది డే నువ్వే’ అనేవారు. జరిగిన లోపాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని ఆయన నిరంతరం మాకు సూచించేవారు. అర్ధరాత్రి, అపరాత్రి పరిశోధనలే ఆయన ప్రపంచం. ఆర్సీఐలో పనిచేస్తున్న సమయంలోనే పద్మవిభూషణ్ అవార్డు కలాంను వరించింది. విధుల్లో ఎలాంటి సందేహాలు తలెత్తినా ఆయనను అడిగితే ఓర్పుతో సమాధానం ఇచ్చేవారు. తన కింద పనిచేస్తున్న ఉద్యోగులతో మిత్రుడిగా, సహచరుడిగా మెలిగేవారు. కష్టపడి పనిచేసేవారిని ఎప్పుడూ మెచ్చుకునేవారు. - టి.వి.రెడ్డి, ఆర్సీఐ రిటైర్డ్ టెక్నికల్ అధికారి