ఆయన ఏదీ ఉచితంగా తీసుకొనేవారు కాదు.. | Kalam is a pure patriot | Sakshi
Sakshi News home page

ఆయన ఏదీ ఉచితంగా తీసుకొనేవారు కాదు..

Published Wed, Jul 29 2015 10:39 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 AM

ఆయన ఏదీ ఉచితంగా తీసుకొనేవారు కాదు..

ఆయన ఏదీ ఉచితంగా తీసుకొనేవారు కాదు..

 *మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సంగీత గురువు కల్యాణి
 *  సంగీతమంటే ప్రాణం
*  శ్రీరాగం ఇష్టపడేవారు
 
*  వీణ నేనే అందజేశా
*బాధలో ఉన్నా..సంతోషంగా ఉన్నా వీణ వాయించేవారు

 
హైదరాబాద్ :  ‘స్వచ్ఛమైన దేశభక్తుడు, గొప్ప మానవతావాది ఆయన. చిన్నా పెద్ద తేడాలేకుండా కోట్లాది మందిలో స్ఫూర్తినింపారు అబ్దుల్ కలాం. సామాన్యుడిగా పుట్టి అత్యున్నత శిఖరాలను ఒక కలతో అందుకొన్న అసామాన్యుడు. తల్లి, తండ్రి, గురువు ఈ మూడు పదాలను ఎంతో ఇష్టపడే అనన్య సామాన్యుడు. ఒకరకంగా నాకు ఆయనే మార్గదర్శి. అంత గొప్ప వ్యక్తికి సంగీతం నేర్పించే అవకాశం లభించడం నా అదృష్టం. ఒక మంచి ఘడియలో.. యువతరానికి స్పీచ్ ఇస్తూ తుది శ్వాస విడిచిన ఆ దైవ స్వరూపం మళ్లీ పుట్టాలి. పుడతారు కూడా...అంటూ గద్గద స్వరంతో చెప్పుకొచ్చారు ప్రముఖ సంగీత గురువు ఎం.కల్యాణి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు నాలుగేళ్లపాటు సంగీతం నేర్పించిన ఆమె..కలాంతో ఉన్న అనుబంధాన్ని మంగళవారం ‘సాక్షి’ కి వివరించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...

 అబ్దుల్ కలాం డీఆర్‌డీవోలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయమది. ఆ సమయంలో ఆయన ప్రభుత్వ కీలక సలహాదారుగానూ ఉన్నారు. డిఫెన్స్ ల్యాబ్స్ స్కూల్‌లో నేను సంగీత ఉపాధ్యాయురాలిని. స్కూల్‌లో ఏదో కార్యక్రమానికి ఆహ్వానించేందుకు వెళ్లాం. కలాంతో అదే తొలి పరిచయం. నేను సంగీతం నేర్చుకొంటా అన్నారు. అక్కడి మెస్‌లో సాయంత్ర సమయంలో సంగీత క్లాసులు నిర్వహిస్తారని తెలిసి..ఓ శనివారం వచ్చారు. 1989 ఆగస్టు మొదలు 1992 డిసెంబర్ వరకు వీణ నేర్చుకునేందుకు వచ్చేవారు. ఆ తర్వాత రాష్ట్రపతిగా ఢిల్లీ వెళ్లారనుకొంటా.

 గాంధీ తర్వాత...
భగవద్గీత, ఇతర హిందూ గ్రంథాలు, ఖురాన్, బైబిల్‌లను ఇష్టపడే వారు. కొన్ని విషయాలపై చర్చించే వారు. ఆయన మతాలకు అతీతమైన వ్యక్తిగా నేను నేరుగా చూశాను. మహాత్మాగాంధీ తర్వాత అంతటి వ్యక్తి కలాం. స్థాయిలోనూ, వయసులోనూ చిన్నదాన్ని అయినా.. నాకు ఎనలేని గౌరవం ఇచ్చేవారు. ఆయన నుంచే పెద్దలను, గురువులను గౌరవించటం, పిల్లలను ప్రేమించటం నేర్చుకొన్నా. ఆయనలో ఫాదర్ నేచర్ చూశా.

శ్రీ రాగం ఇష్టపడేవారు..
 త్యాగయ్య కీర్తనల్లోని శ్రీరాగం బాగా ఇష్టపడేవారు. సంతోషంగా ఉన్నా, ఒత్తిడికి గురైనా వెంటనే వీణ వాయించేవారు. కలాం మరణం భారతదేశానికి తీరని లోటు. అంతా ఈశ్వర నిర్ణయం. ఆ స్కూల్‌లో పని చేయటం నా అదృష్టం. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన యువతకి నేర్పిన స్ఫూర్తి నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది.
 
 నా చేతుల మీదుగా వీణ ఇచ్చా...
ఆయన ఏదీ ఉచితంగా తీసుకొనేవారు కాదు. వీణ కొన్నది ఆయనే. కానీ నా చేతుల మీదుగా ఇమ్మని తీసుకొని బంగారు వస్తువు దాచుకొన్నట్లు జాగ్రత్తగా దాచుకున్నారు. వర్ణించలేని గొప్ప లక్షణాలు ఉన్నవారు. మా నాన్న నా చిన్న వయసులో పోయారు. కలాం నాకు తండ్రి లాంటి వారు. నేనే ఆయనకు పాదాభివందనం చేశా. ఉపాధ్యాయులను గౌరవించటం ఎవరైనా ఆయన నుంచే నేర్చుకోవాలి.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement