తాగండి.. వద్దండి..!
వంద కోట్ల లిక్కర్ అమ్మకాలపై ఆబ్కారీ శాఖ దృష్టి
- మందుబాబుల కట్టడికి అడుగడుగునా తనిఖీలంటున్న పోలీసులు
- గతేడాదితో పోలిస్తే ఈసారి తగ్గిన నయాసాల్ జోష్
- ఈవెంట్ల సంఖ్యా తగ్గుముఖం.. పార్టీలపై నోట్ల రద్దు ఎఫెక్ట్
సాక్షి, హైదరాబాద్: న్యూ ఇయర్ జోష్‌కు భాగ్యనగరం సిద్ధమైంది. విద్యుత్ దీపాల వెలుగులు, డీజే హోరుతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు నగర యువత రెడీ అయింది. వేడుకల్లో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నగరంలో పరిమితికి మించిన శబ్దం చేసే డీజేలు తదితరాల వినియోగాన్ని నిషేధించారు. తాగి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్, మితిమీరిన వేగం, పరిమితికి మంచి వాహనాలపై ప్రయాణించే వారిపై దృష్టి పెట్టారు. ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. న్యూఇయర్ ఈవెంట్స్‌పై పెద్ద నోట్ల రద్దు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఓలా క్యాబ్ డ్రైవర్లు ఆందోళన బాట పట్టడంతో ఈవెంట్స్‌కు హాజరయ్యేవారికి ఇబ్బందులు తప్పేలా లేవు. గ్రేటర్‌లో 25 వేలకు పైగా క్యాబ్స్ సేవలు స్తంభించాయి.
భారీగా తగ్గిన ఈవెంట్స్...
పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో ఈసారి న్యూఇయర్ జోష్ కాస్త తగ్గింది. గతేడాదితో పోలిస్తే ఈవెంట్స్ కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. గ్రేటర్ పరిధిలో సుమారు వందకు పైగా పబ్స్, రిసార్ట్స్ ఉన్నాయి. వీటిల్లో న్యూ ఇయర్ వేడుకలను నిర్వహిస్తున్నారు. గతేడాది 250 ఈవెంట్స్ జరగగా.. ఈసారి వంద లోపలే ఈవెంట్స్ నిర్వహణకు ఆబ్కారీ, పోలీసు శాఖలు అనుమతులివ్వడం గమనార్హం. డిసెంబర్ 31న జరిగే ఈవెంట్స్‌లో కానకష్టంగా రూ.50 నుంచి రూ.60 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. దీంతో మందుబాబులను ఆకర్షించేందుకు కొందరు ఈవెంట్స్ నిర్వాహకులు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. క్యాబ్ సర్వీసులు సిద్ధంగా ఉంచుతామని ఒకరు ప్రకటిస్తే.. ఈవెంట్స్ జరిగే చోటనే తెల్లవార్లూ వసతి సౌకర్యం కల్పిస్తామని మరొకరు ఆఫర్ చేస్తున్నారు.
తెల్లవార్లూ డ్రంకన్ డ్రైవ్..
సాధారణ రోజుల్లో వైన్ షాపులు రాత్రి 10 గంటల వరకు, బార్లు 11 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఈ నేపథ్యంలో మద్యం తాగి వాహనాలు నడిపే వారి కోసం ట్రాఫిక్ పోలీసులు రాత్రి 10 నుంచి ఒంటి గంట వరకు ప్రత్యేక డ్రైవ్స్ చేస్తున్నారు. శనివారం ప్రత్యేక డ్రైవ్‌ను రాత్రి 8 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు నిర్వహిం చాలని నిర్ణయించారు. ఇతరులకు ఇబ్బంది కలుగకుండా వేడుకలు నిర్వహిం చుకోవాలని, రాత్రి 2 గంటల తరవాత ఏ కార్యక్రమం ఉండరాదని పోలీసులు స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం జోష్‌ను పురస్క రించుకుని ట్యాంక్ బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలోని దాదాపు అన్ని ఫ్లైఓవర్లను మూసేశారు. న్యూఇయర్ పార్టీల నేపథ్యంలో డ్రగ్స్ విక్రయం, వినియోగం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు స్పెషల్ టీమ్స్ రంగంలోకి దింపారు.
హైదరాబాద్ మహానగర పరిధి లో ని 400పైగా మద్యం దుకాణాలు.. 500 పైగా బార్లు.. వందకుపైగా పబ్బుల ద్వారా డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో రూ.100 కోట్ల అమ్మకాలు రాబడతాం..
– ఆబ్కారీ శాఖ అధికారుల లక్ష్యమిదీ..
గ్రేటర్‌లో మందుబాబుల కట్టడికి అడుగడుగునా తనిఖీలు చేస్తాం.. 31వ తేదీ రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజా మున 5 గంటల వరకు స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తాం. ర్యాష్ డ్రైవింగ్, మితిమీరిన వేగంతో వాహనాలు నడిపే వారిపై దృష్టి పెడతాం.
– నగర పోలీసులు, ట్రాఫిక్ పోలీసుల ప్రకటన ఇదీ
నూతన సంవత్సర వేడుకల ద్వారా భారీగా ఆదాయాన్ని రాబట్టు కోవాలని ఒకవైపు ఆబ్కారీ శాఖ సన్నా హాలు చేస్తుంటే.. మందుబాబుల కట్టడికి నగర పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు సన్నద్ధమవుతున్నారు.