రాష్ట్ర పోలీసు విభాగానికి బాస్ డీజీపీ అయినా ముఖ్యమంత్రితో నిత్యం ముఖాముఖి మాట్లాడేది మాత్రం నిఘా విభాగం అధిపతిగా ఉండే అదనపు డీజీనే. ఆయన రోజూ ఉదయం క్యాంప్ ఆఫీస్‌లో సీఎంను కలసి రాష్ట్రంలోని పరిస్థితులు, శాంతిభద్రతలు, రాజకీయ పరిణామాలపై బ్రీఫింగ్ ఇవ్వాల్సిందే.
ఇక నిత్యం గవర్నర్‌కు నివేదించాల్సిందే
ఎన్నికలు నిష్పాక్షికంగా జరుగుతాయంటున్న మాజీ అధికారులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు విభాగానికి బాస్ డీజీపీ అయినా ముఖ్యమంత్రితో నిత్యం ముఖాముఖి మాట్లాడేది మాత్రం నిఘా విభాగం అధిపతిగా ఉండే అదనపు డీజీనే. ఆయన రోజూ ఉదయం క్యాంప్ ఆఫీస్‌లో సీఎంను కలసి రాష్ట్రంలోని పరిస్థితులు, శాంతిభద్రతలు, రాజకీయ పరిణామాలపై బ్రీఫింగ్ ఇవ్వాల్సిందే. రాష్ట్రపతి పాలన నేపథ్యంలో పాలన మొత్తం గవర్నర్ చేతికి వెళ్లనుంది. కాబట్టి నిఘా అధిపతి ఇకపై నిత్యం గవర్నర్‌కు గానీ లేదా ఆయన సలహాదారుల్లో శాంతిభద్రతలను పర్యవేక్షించే అధికారిని గానీ కలసి బ్రీఫింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. 1973 తరవాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రానుండటం మళ్లీ ఇప్పుడే. ఈ నేపథ్యంలో అప్పట్లో పోలీసు విభాగంలో పని చేసిన ఉన్నతాధికారుల్ని శుక్రవారం ‘సాక్షి’ పలకరించింది. వారి అనుభవాలు ఇవి...
పర్యవేక్షణ నిశితంగా ఉంటుంది:
‘‘రాష్ట్రపతి పాలనతో పాలనపై రాజకీయ ప్రాబల్యం, పైరవీకారుల జోరు తగ్గుతుంది. పాలన సజావుగా, వేగంగా సాగుతుంది. అవసరమైన ప్రతి ఫైలూ చకచకా ముందుకు పోతుంది. పరిపాలన, శాంతిభద్రతల పరిస్థితులపై పర్యవేక్షణ నిశితంగా ఉంటుంది. ఎన్నికలు పూర్తి నిష్పాక్షికంగా జరుగుతాయి. ఎవరూ ఎవరినీ ప్రభావితం చేయలేరు. 1973లో రాష్ట్రపతి పాలన వచ్చినప్పుడు నేను ఖమ్మం ఎస్పీగా ఉన్నా. ఐసీఎస్ అధికారి హెచ్‌సీ శరేన్ హోం శాఖను పర్యవేక్షించారు. అప్పట్లో పాల్వంచ కేటీపీఎస్, కొత్తగూడెం సింగరేణిల్లో తెలంగాణ, ఆంధ్రా అధికారుల మధ్య, సిబ్బంది మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం ఉండేది. శరేన్ ఖమ్మం పర్యటనకు వచ్చినప్పుడు కలెక్టర్ జిలానీతో కలసి ఆ ప్రాంతాల్లో ఆంధ్రా అధికారులుండే ప్రాంతాల్లో మారువేషాల్లో తిరిగి ఎందరికో ధైర్యాన్నిచ్చాం’’
- పేర్వారం రాములు, మాజీ డీజీపీ
అదనపు బందోబస్తులు తప్పుతాయి
‘‘రాష్ట్రపతి పాలనతో పోలీసులకు స్వాతంత్య్రం వస్తుంది. నాయకుల ప్రభావం ఏమాత్రం ఉండదు. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో మామూలుగానే పోలీసులు చాలా బిజీగా ఉంటారు. దానికి తోడు ప్రచారం కోసం వచ్చే సీఎంకు, మంత్రులకు ప్రొటోకాల్ ప్రకారం అదనపు బందోబస్తు కల్పించాల్సి వస్తుంది. రాష్ట్రపతి పాలనతో ఇవన్నీ తగ్గుతాయి. అధికార దుర్వినియోగానికి ఆస్కారమే ఉండదు. 1973లో నేను వరంగల్ ఎస్పీగా పని చేస్తున్నప్పుడు ఇవన్నీ ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చాయి’’
- ఎంవీ భాస్కరరావు, మాజీ డీజీపీ
కాస్త ముందే ‘రాజకీయ విముక్తి’
‘‘సాధారణంగా ప్రతి ఎన్నికల సందర్భంలోనూ నోటిఫికేషన్ వెలువడగానే పోలీసు విభాగమంతా ఎన్నికల సంఘం అధీనంలోకి వెళ్తుంది. ఇప్పుడు రాష్ట్రపతి పాలనతో పోలీసులకు కాస్త ముందుగానే రాజకీయ విముక్తి కలగనుంది. 1973లో రాష్ట్రపతి పాలనప్పుడు హైదరాబాద్ కమిషనరేట్‌లో శాంతిభద్రతల విభాగం డీసీపీగా, కృష్ణా జిల్లా ఎస్పీగా పని చేశాను. జై ఆంధ్రా ఉద్యమ సమయంలో శాంతిభద్రతల సమస్యల్ని సమర్థంగా ఎదుర్కొని సాధారణ పరిస్థితులు నెలకొనేలా కృషి చేశాం’’
- హెచ్‌జే దొర, మాజీ డీజీపీ