కూరగాయాలే!
అమాంతం పెరిగిన ధరలు
►5 రోజుల్లోనే రెండు రెట్లు..
►నషాళానికి అంటిన పచ్చిమిర్చి రేటు
►చేదెక్కిన కాకరకాయ
►దిగిరానంటున్న టమాటా
►దిగుబడి తగ్గడమే ప్రధాన కారణం
కూరగాయల ధరలు ఆకాశంలో నక్షత్రాల సరసన చేరాయి. టమాటా ధర వింటేనే మాడు పగులుతోంది. పచ్చిమిర్చి ధర వినగానే
ఘాటెక్కుతోంది. గోకర, బీరకాయ, బీన్స్ ఇలా ఏ కూరగాయల ధరలు చూసినా సామాన్యులకు అందేస్థితిలో లేవు. కేవలం 15 రోజుల్లోనే వీటి ధరలు రెండింతలు పెరగడంతో చాలా కుటుంబాల్లో పచ్చడి మెతుకులే గతవుతున్నాయి.
చేవెళ్ల / కడ్తాల్ :ప్రస్తుతం పంటలు వేసే సీజన్ కావటంతో కూరగాయల దిగుబడులు తక్కువయ్యాయి. దీంతో మార్కెట్‌లో ధరలు మండిపోతున్నాయి. సామాన్య ప్రజలకు అవి చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న జిల్లాలోని పరిసర ప్రాంతాలతో పాటు చేవెళ్లలో ఎక్కువ మంది రైతులు కూరగాయలు పండిస్తుంటారు. జిల్లాలో వేల హెక్టార్లలో కూరగాయల సాగు చేస్తుంటారు. అయితే రబీ సీజన్‌లో వేసిన పంటల దిగుబడులు తగ్గుముఖం పట్టాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావటంతో ప్రస్తుతం రైతులు పంటలు వేసే పనిలో పడ్డారు. దీంతో దిగుబడులు లేక ఉన్న కూరగాయలకు ధరలు అమాంతం పెరిగిపోయాయి.
ప్రస్తుతం ఏ కూరగాయలు కొనాలన్నా కిలో 40 రూపాయలకు పైమాటే. ఎక్కువగా మిర్చి ధర ఘాటెక్కిస్తుంది. కూరగాయలన్నింటిలో అధికంగా కిలో రూ.100రూపాయలు వరకు పలుకుతుంది. ఈ ధరలతో కొనకముందే మిర్చి ఘాటేక్కిస్తుందని అంటున్నారు. పదిహేను రోజుల కిత్రం ధరలతో చూస్తే ఇప్పుడు ధరలు రెట్టింపుగా కనిపిస్తున్నాయి.