మానవ వనరులు పుష్కలం
- ఏపీలో పెట్టుబడులకు అది సానుకూలం
- బ్రిటిష్ హైకమిషనర్ బృందానికి బుగ్గన, ఉమ్మారెడ్డి వివరణ
సాక్షి, హైదరాబాద్: ఏపీలో మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని, ఇక్కడ వ్యాపార, వాణిజ్య అవకాశాలు పెంపొందించుకోవడానికి ఎంతగానో దోహదం చేస్తాయని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు బ్రిటిష్ హైకమిషన్ బృందానికి తెలియజేశారు. తెలివి తేటలతోపాటుగా కష్టపడి పనిచేసే మనస్తత్వం, పట్టుదల గల యువకులు ఉండటం ఈ రాష్ట్రంలో సానుకూల అంశమని వారు నొక్కి చెప్పారు. బ్రిటిష్ హైకమిషనర్ యాష్‌క్విత్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకోవడానికి వచ్చారు.
జగన్ ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నందున ఏపీ అసెంబ్లీ పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, శాసనమండలిలో పార్టీ పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హైకమిషన్ బృందానికి పార్టీ కేంద్ర కార్యాలయంలో సాదరంగా ఆహ్వానం పలికి వారితో సుమారు 45 నిమిషాలు రాష్ట్ర స్థితిగతులపై మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న వనరులు, ప్రత్యేకతలు, అభివృద్ధి అవకాశాలు వివరించారు. హైకమిషనర్ యాస్క్విత్‌తోపాటుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వ్యవహారాలను చూసే డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ మెక్ అలిస్తర్ మరి కొందరు ఉన్నతాధికారులు ఈ బృందంలో ఉన్నారు. ఏపీలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు గల అవకాశాలు, రాజధాని నిర్మాణం, ఇతర అంశాలపై హైకమిషనర్ బృందం కూలంకషంగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను అడిగి తెలుసుకుంది.
ముద్రగడ ఆవేదన హృదయ విదారకం: ఉమ్మారెడ్డి
ముద్రగడ పద్మనాభం దీక్ష చేస్తున్నపుడు ఆసుపత్రిలో ఆయన పడ్డ బాధలు, అనుభవించిన ఆవేదన స్వయంగా వివరిస్తూ ఉంటే హృదయ విదారకంగా ఉందని శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. ముద్రగడ పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు దారుణమని విమర్శించారు. ఆయన బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.