జగ్జీవన్‌రామ్‌కు వైఎస్సార్‌సీపీ నివాళి
సాక్షి, హైదరాబాద్ : దళితులకు ఓటు హక్కు ఉండి తీరాలని పోరాడి సాధించిన మహనీయుడు బాబూ జగ్జీవన్‌రామ్ అని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు శ్లాఘించారు. బాబూ జగ్జీవన్‌రామ్ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఏపీ శాసనమండలి సభాపక్ష వైఎస్సార్‌సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తొలుత శ్రద్ధాంజలి ఘటిస్తూ కేంద్ర మంత్రివర్గంలో 9 శాఖలు నిర్వహించిన ఘనత ఆయనదన్నారు. దేశంలో దళితులకు ఓటు హక్కు కావాలని 1936లోనే బ్రిటిష్ వారితో జగ్జీవన్ పోరాడారని గుర్తు చేశారు.
ఆహారభద్రత గురించి ఇపుడు కొందరు పెద్దగా మాట్లాడుతున్నారని.. కానీ బాబూ ఎప్పుడో దీని గురించి దూరాలోచన చేసి ఆహారధాన్యాల నిల్వ కోసం ఎఫ్‌సీఐ ఆధ్వర్యంలో గోదాములు నిర్మించారన్నారు. ప్రధాని కాగల అర్హతలన్నీ ఉన్నా కాలేక పోయారన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాష్ మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్ ఏ పదవి తీసుకున్నా సమర్థంగా పనిచేశారన్నారు. సమర్థత ఉన్నా జనతా ప్రభుత్వంలో ఆయనను ప్రధాని కాకుండా అన్యాయం చేశారన్నారు. నివాళులర్పించిన వారిలో పార్టీ నేతలు పీఎన్వీ ప్రసాద్, కొండా రాఘవరెడ్డి, విజయచందర్, చల్లా మధుసూదన్‌రెడ్డి, పుత్తా ప్రతాపరెడ్డి, నాగదేశి రవికుమార్, కర్నాటి ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు.