నాకు ప్రాణహాని: నటి పూజిత
తనకు ప్రాణహాని ఉందంటూ ఒకప్పటి హీరోయిన్, నేటి బుల్లితెర నటి పూజిత మీడియా ముందుకొచ్చింది. తనకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. న్యాయం చేయాల్సిన వాళ్లే అన్యాయం చేస్తే ఎలా ? అని ప్రశ్నిస్తోంది. తనకు, తన కుమారుడికి ప్రాణహాని ఉందని ఆమె భయపడుతున్నారు. భర్త విజయ్ గోపాల్ తనతో పాటు పలువురు మహిళలను మోసం చేసి తాజాగా ఓ ఐఏఎస్ అధికారిణిని పెళ్లాడినట్లు పూజిత తెలిపారు. వివరాల్లోకి వెళితే...
ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ సహా అనేక తెలుగు సినిమాల్లో పూజిత హీరోయిన్‌గా నటించింది. రుతురాగాలు వంటి ఫేమస్ సీరియల్స్‌లో సైతం బిజీ నటిగా వెలిగిపోయిన పూజిత తన భర్త విజయ్‌గోపాల్ ఓ ఎంపి వద్ద పిఏగా పని చేస్తున్నాడని తెలిపారు. ఆయన తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని వెల్లడించారు. తమకు ఓ బాబు కూడా ఉన్నాడని పూజిత చెప్పారు. అయితే 13 సంవత్సరాలు తనతో కాపురం చేసిన తన భర్త తాజాగా ఓ ఐఎఎస్ ఆఫీసర్ రేఖారాణిని పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు.
తనకు విడాకులు ఇవ్వకుండా, తననూ, తన కుమారుడిని పట్టించుకోకుండా, ఎలా రెండో పెళ్లి చేసుకుంటాడని ప్రశ్నించారు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే తిరిగి తననే బెదిరించారని పూజిత ఆరోపించారు. పోలీస్ అధికారిణి అంజనా సిన్హా తనను ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారన్నారు. కాగా విజయ్ గోపాల్ డ్రగ్స్ వ్యాపారం చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయన్నారు.
దీనిపై శాప్ ఎండీ రేఖారాణి 'సాక్షి' ఫోన్ లైన్లో మాట్లాడుతూ ...'విజయ్ గోపాల్, పూజిత పదేళ్ల క్రితమే విడిపోయారు. వారిద్దరికీ వివాహం జరగలేదు. కేవలం సహజీవనం చేశారు. నేను అన్ని లీగల్గా చూసుకునే ఈ పెళ్లి చేసుకున్నా. పూజతి మీడియా వరకూ రావటం అనేది సరైన పద్ధతి కాదు. మనకు కోర్టులు, చట్టాలు ఉన్నాయి. మీడియాలో పర్సనల్ విషయాలు ఎంతవరకూ బహిర్గతం చేయాలనేదానికి ఓ లైన్ ఉంటుంది. ఈ విషయం వివాదం కావడం ఇష్టం లేదు. పూజిత, విజయ్గోపాల్కు పదేళ్ల నుంచి ఎలాంటి సంబంధం లేదు. ఆమె ఇప్పుడు ఎందుకు మీడియా ముందుకు వచ్చిందో తెలియదు. నేను అమ్మాయినే, ఆమె కూడా అమ్మాయే.
ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. మోసపోయానంటున్న ఆమెపై నాకు సానుభూతి ఉంది. ఎందుకంటే ఏ అమ్మాయి అయినా రోడ్డు మీదకు వచ్చేది తనకు అన్యాయం జరిగితేనే. అయితే పూజిత అప్రోచ్ అవాల్సింది మీడియాను కాదు. కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది. అయితే అది ఆమె వ్యక్తిగతం. అయితే అది నేను డిసైడ్ చేయలేదు. విజయ్ గోపాల్తో రిలేషన్ వద్దని వదిలేసుకుంది. ఇక మా తల్లిదండ్రులు కూడా ఆమెకు సపోర్ట్ చేయటం నా బ్యాడ్లక్. ఇక నావైపు నుంచి పూజితకు ఎలాంటి అపాయం లేదు. ఒకవేళ ఆమెకు అన్యాయం జరిగినట్లు అయితే నేను పూజితకు మద్దతుగా నిలుస్తా. షీ ఈజ్ గుడ్ గాళ్. ఆమెపై ఎలాంటి వ్యతిరేకత లేదు. ఆమెకు అన్నివిధాల సహకరిస్తా...' అని తెలిపారు. రేఖారాణి గతంలో నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేశారు.
ఈ సందర్భంగా నటి పూజిత మాట్లాడుతూ విజయ్గోపాల్, రేఖారాణి వివాహం జరిగిన తర్వాత ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసేందుకు తనను వారి వద్దకు పిలిచారన్నారు. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. భర్త తనతో పాటు కొడుకును పట్టించుకోకుండా ఉంటే, న్యాయం కోసం పోలీసుల్ని ఆశ్రయిస్తే వాళ్లే ఎన్కౌంటర్ చేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు.
మరోవైపు పూజిత ఆరోపణలు, ఫిర్యాదులపై ఆమె అడ్వకేట్ అనిల్ కుమార్ సాక్షితో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ విజయ్ గోపాల్, రేఖారాణి పెళ్లి మూడు రోజుల క్రితం జరిగిందన్నారు. గోల్కొండ రిజిస్ట్రార్ వాళ్ల ఇంటికి వెళ్లి ఈ వివాహం చేశారన్నారు. గోల్కొండ సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో వారి పెళ్లికి సంబంధించిన వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా తాము తీసుకున్నామన్నారు.
దీనిపై హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి గారిని కలిశామన్నారు. అయితే తాము ఏమీ చేయలేమని, ఇందుకు సంబంధించి ఆధారాలు తీసుకురావాలని సూచించారన్నారు. అలాగే పూజితతో పాటు ఆమె కుమారుడికి ప్రాణ హాని ఉందని ఫిర్యాదు చేశామని, వారికి రక్షణ కల్పించాలని ఎస్సార్ నగర్ పోలీసులకు ఆయన ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. చట్టపరంగా తాము ముందుకు వెళతామని అనిల్ కుమార్ తెలిపారు.