
పచ్చని కాపురంలో అనుమానం చిచ్చు..
అనుమానం పచ్చని కాపురంలో చిచ్చుపెట్టింది. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావని భార్య అనడంతో ఆగ్రహానికి గురైన భర్త ఆమెను చంపి.. ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.
మియాపూర్, న్యూస్‌లైన్: అనుమానం పచ్చని కాపురంలో చిచ్చుపెట్టింది. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావని భార్య అనడంతో ఆగ్రహానికి గురైన భర్త ఆమెను చంపి.. ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. మియాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మియాపూర్ ఎస్‌ఐ సైదిరెడ్డి, మృతురాలి సోదరి కథనం ప్రకారం... జగద్గిరిగుట్ట శ్రీనివాస్‌నగర్‌కు చెందిన డ్రైవర్ ఎస్‌కే అజ్మత్, బోరబండకు చెందిన లాల్‌మహ్మద్ కూతురు గౌసియాబేగం (23)లు ప్రేమించుకొని మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు.
ప్రస్తుతం వీరు మియాపూర్ సాయినగర్‌లో ఉంటున్నారు. గౌసియా బ్యూటీషియన్‌గా పని చేస్తోంది. వీరికి సంతానం లేదు. భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని గౌసియాకు అనుమానం వచ్చి.. మంగళవారం రాత్రి అతడిని నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అదే సమయంలో గౌసియా తన అక్క అస్మాబేగంకు ఫోన్ చేసి.. ‘నా భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు..
అతనితో మాట్లాడకు’ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. దీంతో మరింత ఆగ్రహానికి గురైన అజ్మత్.. భార్య గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత చీరతో ఫ్యానుకు ఉరేసుకొని తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం అక్క అస్మాబేగం ఎన్నిసార్లు ఫోన్ చేసినా గౌసియా స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె తన తమ్ముడు ముస్తాఫాను సాయినగర్‌కు పంపింది. అతడు వచ్చి చూసే సరికి గౌసియా, అజ్మత్‌లు శవమై కనిపించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.