అక్కడే ఎక్కువ!
సంపన్న ప్రాంతాల్లోనే అధిక ఆక్రమణలు
బీఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులతో వెల్లడి
సిటీబ్యూరో: సాధారణంగా నగరంలో అక్రమ నిర్మాణాలు ఎక్కడ ఉంటాయి..! బస్తీల్లోను, దిగువ మధ్య తరగతి నివాసం ఉండే ప్రాంతాల్లోనే అనుకుంటారు. ఆర్థిక స్థోమత లేనివారు, తక్కువ స్థలం ఉన్నవారు తమ అవసరాల నిమిత్తం కొంత స్థలం ఆక్రమించుకుంటారు.. ఇంతకాలం చాలామందిలో ఇదే అభిప్రాయం ఉంది. కానీ, అక్రమ నిర్మాణాలు, అక్రమ లే ఔట్లు ఎక్కువగా సంపన్నుల ప్రాంతాల్లోనే ఉన్నట్టు తాజాగా తేలింది. అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన బీఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌ల కోసం జీహెచ్‌ఎంసీకి అందిన దరఖాస్తులను పరిశీలిస్తే ఈ విషయం బయటపడింది. సిటీలో సంపన్న ప్రాంతాలైన అమీర్‌పేట, సోమాజిగూడ, వెంగళరావు నగర్, నాగోల్, హయత్‌నగర్, వనస్థలిపురం, కేపీహెచ్‌బీ కాలనీ, మూసాపేట, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కాప్రా నుంచి ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు అందాయి. వీటిల్లో బీఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్ రెండింటిలోనూ ఎల్‌బీనగర్ (3ఏ) సర్కిల్ ప్రథమ స్థానంలో ఉంది. అక్రమ భవనాలు, అక్రమ లే ఔట్లు ఇక్కడే ఎక్కువ. ఈ సర్కిల్‌లోని నాగోల్, మన్సూరాబాద్, హయత్‌నగర్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్, హస్తినాపురం వంటి డివిజన్లు ఉన్నాయి.
వేలల్లో దరఖాస్తులు..
ఎల్‌బీనగర్(3ఏ) సర్కిల్ నుంచి బీఆర్‌ఎస్‌కు 22,200 దరఖాస్తులు అందగా, ఎల్‌ఆర్‌ఎస్ కోసం 21,921 వచ్చాయి. అక్రమ భవనాలకు సంబంధించిన దరఖాస్తులు ఖైరతాబాద్-ఏ, కూకట్‌పల్లి-ఏ సర్కిళ్ల పరిధిలో ఎక్కువగా ఉండగా, లే ఔట్ల అక్రమాలు ఎల్‌బీనగర్-ఏ, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి-1 సర్కిళ్లలో అధికంగా ఉన్నాయి. బీఆర్‌ఎస్‌కు ఎక్కువ దర ఖాస్తులు (2వ స్థానం) ఖైరతాబాద్ (10ఏ) సర్కిల్ నుంచి అందాయి. ఇక్కడి నుంచి 14,784 దరఖాస్తులు వచ్చాయి. దీని పరిధిలో వెంగళరావు నగర్, సోమాజిగూడ, యూసుఫ్‌గూడ, రహ్మత్‌నగర్, బోరబండ తదితర ప్రాంతాలు ఉన్నాయి. ఇక మూడో స్థానంలో ఉన్న కూకట్‌పల్లి (14ఏ) సర్కిల్ నుంచి 14, 644 దరఖాస్తులందాయి. దీని పరిధిలో కేపీహెచ్‌బీ కాలనీ, మూసాపేట, మోతీనగర్, ఫతేనగర్ తదితర ప్రాంతాలు ఉన్నాయి. ఎల్‌ఆర్‌ఎస్‌కు ఎల్‌బీనగర్-ఏ తర్వాత కుత్బుల్లాపూర్ నుంచి అత్యధికంగా 6,248 దరఖాస్తులు వచ్చాయి. తర్వాతి స్థానాల్లో శేరిలింగంపల్లి-1, కాప్రా సర్కిళ్లు ఉన్నాయి.
ప్రస్తుతం వీటి పరిశీలనలో ఉన్న అధికారులు బీఆర్‌ఎస్ అనంతరం ఆస్తిపన్ను, ట్రేడ్ లెసైన్సుల ఫీజులు, తదితర వాటి ద్వారా జీహెచ్‌ఎంసీ ఆదాయం గణనీయంగా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. బీఆర్‌ఎస్‌పై హైకోర్టు స్టే ఉన్నందున వాటిని పక్కనపెట్టి ఎల్‌ఆర్‌ఎస్‌లను పరిష్కరిస్తున్నారు. ఈ నెలాఖరుకు 10 వేల ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలనేది లక్ష్యం. ఇప్పటికి ఏడువేల దరఖాస్తులను పరిష్కరించారు. జీహెచ్‌ఎంసీకి బీఆర్‌ఎస్ కోసం 1.30 లక్షల ద రఖాస్తులు అందగా, ఎల్‌ఆర్‌ఎస్ కోసం 73 వేల దరఖాస్తులు అందాయి.