అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పిచ్చింది. అగ్రిగోల్డ్ డిపాజిట్ల కుంభకోణం కేసు గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఫిబ్రవరి 1నుంచి ఆస్తులు వేలం వేస్తామని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కోర్టుకు వివరించింది. ఎమ్ఎస్టీసీ, శ్రీరామ్ ఆటో మాల్, ఈ-ప్రొక్యూర్మెంట్ టెక్నాలజీకి వేలం బాధ్యతలు అప్పగించామని కమిటీ తెలిపింది. మొదటి విడతలో సంస్థకు చెందిన ఆరు ఆస్తులు వేలం వేయనున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఎమ్ఎస్టీసీ, శ్రీరామ్ ఆటో మాల్, ఈ-ప్రొక్యూర్మెంట్ టెక్నాలజీలలో ఒక్కో సంస్థకు రెండు ఆస్తులు వేలం వేసేందుకు అప్పగిస్తామన్నారు. ఇందుకు సంబంధించి మూడు వారాల్లో వెబ్సైట్ ఏర్పాటు చేసి అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం, టెండర్ల వివరాలను అందులో పొందుపరచాలని హైకోర్టు ఆదేశించింది.
తొలి విడత వేలంలో రూ.3500 కోట్లు వస్తాయని అగ్రిగోల్డ్ సంస్థ కోర్టుకు వివరించింది. సామాన్య ప్రజల నుంచి అగ్రిగోల్డ్ యాజమాన్యం రూ.6,350 కోట్లను డిపాజిట్ల రూపంలో వసూలు చేసి చేతులెత్తేసిందని, ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అగ్రిగోల్డ్ డిపాజిట్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎ.రమేష్‌బాబు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా నేడు హైకోర్టులో విచారణకు రాగా, అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా పడింది.