deposits scam
-
AP News: అనధికార డిపాజిట్లు ఇక జప్తే..!
సాక్షి, అమరావతి: ఆర్థిక మోసాలు, అనధికార డిపాజిట్ల దందాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ చేపట్టింది. రాష్ట్రంలో అనధికారికంగా, ఆర్బీఐ అనుమతి లేకుండా డిపాజిట్లు సేకరించడాన్ని నిరోధించేందుకు కఠిన నిబంధనలను రూపొందించింది. అనధికారికంగా సేకరించే డిపాజిట్లు, అటువంటి సంస్థల ఆస్తులను జప్తు చేసే అధికారాన్ని పోలీసులకు అప్పగించింది. తద్వారా అధిక వడ్డీల ఎరకు మోసపోకుండా సామాన్యులకు రక్షణ కవచాన్ని కల్పించింది. అనధికార డిపాజిట్ల సేకరణపై పోలీసులకు విస్తృత అధికారాలు కల్పిస్తూ హోం శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల్లోని ప్రధాన అంశాలు.. ► ఆర్బీఐ అనుమతులు లేకుండా ఏ సంస్థగానీ, వ్యక్తులుగానీ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించడానికి వీల్లేదు. ► అనధికారికంగా డిపాజిట్లు సేకరించే వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నియమించే అధికారికి విస్తృత అధికారాలు ఉంటాయి. ► ఎవరైనా డిపాజిట్లు సేకరిస్తే వాటికి సంబంధించిన వివరాలను ఆ అధికారికి తెలపాలి. ► తమ బ్యాంకు ఖాతాల్లోని డిపాజిట్ల వివరాలు వెల్లడించలేకున్నా వాటిని అనధికారిక డిపాజిట్లుగానే పరిగణిస్తారు. ► అడిగిన వివరాలు చెప్పకుండా పరారైతే సంబంధిత వ్యక్తులు, సంస్థల వివరాలను న్యాయస్థానానికి నివేదిస్తారు. ► ఇక అనధికారికంగా సేకరించిన డిపాజిట్లను, అలా సేకరించిన వ్యక్తులు, సంస్థల ఆస్తులనూ జప్తు చేసే అధికారం ఆ అధికారికి ప్రభుత్వం ఇచ్చింది. ఆస్తుల జప్తునకు సంబంధించిన వివరాలను న్యాయస్థానానికి సమర్పిస్తారు. ► స్థానిక పోలీసు అధికారులతో కలసి ఆ వ్యక్తులు, సంస్థల ఆస్తులు, కార్యాలయాలు, బ్యాంకు ఖాతాలను కూడా ఆ అధికారి పరిశీలించవచ్చు. వీటికి మినహాయింపు డ్వాక్రా గ్రూపులు, చేనేత, స్వగృహ సహకార సంఘాలు, గుర్తింపు పొందిన మతపరమైన సంస్థలకు మినహాయింపు నిచ్చారు. ఆ సంఘాల్లోని ఒక్కో సభ్యుడు ఏడాదికి గరిష్టంగా రూ. 10 వేల వరకు చేసే డిపాజిట్లను అనధికారిక డిపాజిట్లుగా పరిగణించరు. మతపరమైన సంస్థలు నిర్వహించే అన్నదాన కార్యక్రమాలు, వేద పాఠశాలలు, గోశాలల నిర్వహణకు సేకరించే డిపాజిట్లకు కూడా ప్రభుత్వం ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది. డిపాజిట్‌దారుల సొమ్ముకు రక్షణ సామాన్యులు అవగాహన లేకుండా అనధికారిక డిపాజిట్లు చేస్తే.. వారి సొమ్ముకు కూడా ప్రభుత్వం భద్రత కల్పించింది. అనధికారికంగా సేకరించిన డిపాజిట్లను, ఆ సంస్థల ఆస్తులను వెంటనే జప్తు చేస్తారు. ఆ విధంగా జప్తు చేసిన నగదు, ఆస్తులను ఇతరులకుగానీ ఇతర సంస్థలకుగానీ బదిలీ చేయడానికి వీల్లేదు. కేసు పరిష్కారమైన తరువాత డిపాజిటర్లకు వారి డిపాజిట్ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి శిక్షణ తప్పనిసరి రాష్ట్రంలో ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలకు అనుమతులకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం కఠినతరం చేసింది. సెక్యూరిటీ ఏజెన్సీలు పాటించాల్సిన నిబంధనలు, సెక్యూరిటీ సిబ్బంది నియామక అర్హతలు, వారికి ఇవ్వాల్సిన కనీస శిక్షణ ప్రమాణాలను నిర్దేశించింది. విధివిధానాలను పాటించే ఏజెన్సీలకే లైసెన్సులు జారీచేస్తామని స్పష్టం చేస్తూ హోం శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. -
Deposits Scam: భర్తను ప్రోత్సహించి డిపాజిట్ల గోల్మాల్
భవానీపురం (విజయవాడ పశ్చిమ): అక్రమ సంపాదనపై ఆ మహిళ ఇష్టం పెంచుకుంది. నేరానికి పాల్పడుతున్న భర్తను నిలువరించాల్సిన ఆమె ఇంకా డబ్బు తెమ్మంటూ మరింత ప్రోత్సహించింది. భర్తను పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు కూడా అక్రమ సంపాదనపై నోరు విప్పలేదు. చివరికి పోలీసులు ఆమె గుట్టును రట్టు చేసి అరెస్ట్ చేశారు. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, ఏపీ కో ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ లిమిటెడ్‌కు చెందిన ఫిక్స్డ్ డిపాజిట్ల దుర్వినియోగం, దారి మళ్లింపు కేసును పోలీసులు ప్రతిష్టాత్యకంగా తీసు కుని దర్యాప్తును వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు కేసుల్లో మొత్తం రూ.14.6 కోట్ల మేర మోసం జరిగింది. ఇప్పటికే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ భవానీపురం బ్రాంచి మేనేజర్ సందీప్‌కుమార్, అసిస్టెంట్ మేనేజర్ మృదుల, పూసలపాటి యోహాన్ రాజును అరెస్ట్ చేసి వారి వద్ద నగదు, వివిధ బ్యాంకు అకౌంట్లలోని నగదును స్తంభింప చేశారు. ఈ ముగ్గురితోపాటు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన వారిలోపై రెండు కేసుల్లో పాత్రధారులైన చుండూరి వెంకటకోటిసాయికుమార్, నండూరి వెంకట రమణ అలియాస్ వెంకట రామన్, మరీదు వెంకటేశ్వరరావు అలియాస్ డాక్టర్ వెంకట్ అలియాస్ రాజేష్, యర్ర జొన్నల సోమశేఖర్ అలియాస్ రాజకుమార్, పద్మనాభన్ అలియాస్ పద్మన్, బండారి వీర వెంకట నాగసత్యనారాయణను కూడా గతంలోనే పీటీ వారెంట్లపై కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు మంగళవారం విజయవాడ చిట్టినగర్ ప్రైజర్‌పేటకు చెందిన మరొక నిందితురాలిని అరెస్టు చేశారు. విచారణలో తేలిందేమిటంటే... కేసులో ముద్దాయి పూసలపాటి యోహాన్‌రాజు ప్రభుత్వ సంస్థలకు చెందిన డిపాజిట్ల మళ్లింపులో తన వాటాకు వచ్చిన డబ్బును ఇంటికి తీసుకువచ్చాడు. పెద్ద మొత్తంలో తీసుకొచ్చిన సొమ్మును చూసి అతని భార్య పూసలపాటి ప్రమీలా రాణి ఏమి జరిగిందంటూ భర్తను ఆరా తీసింది. అక్రమంగా నగదు తెచ్చినట్టు భర్త నుంచి తెలుసుకుని వారించాల్సిందిపోయి, ఇంకా డబ్బు తీసుకు రావాలని ప్రోత్సహించింది. పెద్దమొత్తంలో నగదును ఇంటిలో ఉంచినా, బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో వేసినా అందరికీ అనుమానం వస్తుందని ప్రమీలా రాణి ఆలోచించింది. దీంతో సుస్మిత ట్రేడర్స్ పేరిట ఓ కంపెనీని ఏర్పాటు చేసింది. విజయవాడ బ్యాంక్ ఆఫ్ బరోడా వన్‌టౌన్ బ్రాంచిలో కరెంట్ అకౌంట్ తెరి చింది. భర్త అక్రమంగా తీసుకొస్తున్న నగదును ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు పలు దఫాలుగా రూ.73,10,000 ఆ అకౌంట్లో జమచేసింది. కుటుంబ అవసరాలకు రూ.7 లక్షలు వాడుకుంది. యోహాన్రాజును అరెస్ట్ చేసిన సమయంలో కూడా తన కరెంట్ అకౌంట్ వివరాలను ప్రమీలారాణి గోప్యంగా ఉంచింది. భర్త చేసిన నేరాల్లో పాలుపంచుకున్నందుకు ఆమెను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి, ఆమె బ్యాంక్ ఖాతాలోని రూ.66,08,901లను స్తంభింప చేశారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు ఆదేశాల మేరకు ఈస్ట్ జోన్ డీసీపీ హర్షవర్ధన్ రాజు పర్యవేక్షణలో సీసీఎస్ ఏసీపీ కె.శ్రీనివాసరావు ఈ రెండు కేసుల దర్యాప్తును పూర్తి స్థాయిలో చేపట్టారు. ఈ నేరాలలో ఇంకా ఎవరి పాత్ర అయినా ఉందా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటి వరకు సీజ్ చేసిన నగదు వివరాలు ► ఇప్పటి వరకు ముద్దాయిలు, వారికి చెందిన అకౌంట్లలో రూ.40,70,000లను పోలీసులు సీజ్ చేశారు. ► ముద్దాయిలు మళ్లించిన వివిధ అకౌంట్లలో రూ.1,99,45,810 నగదును స్తంభింపజేశారు. ► రెండు కేసులలో ముద్దాయిలు కాజేసిన నగదుతో కొన్న రూ.1.7 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు. -
Telugu Academy: రిమాండ్ రిపోర్టు కీలక విషయాలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమి డిపాజిట్లలో కేసులో పోలీసులు రిమాండ్ రిపోర్టును విడుదల చేశారు. తొమ్మిది పేజీల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే 10మంది అరెస్ట్ చేశామని, రిమాండ్ రిపోర్టులో సీసీఎస్ పోలీసులు తెలిపారు. కీలక సూత్రదారి సాయికుమార్‌గా పోలీసులు తేల్చారు. కృష్ణారెడ్డి, పద్మనాభన్, మదన్, భూపతి, యోహన్ రాజ్ పరారీలో ఉన్నారని తెలిపారు. భూపతి సాయంతో తెలుగు అకాడమీ డిపాజిట్లను యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యేలా సాయి కుమార్ చూశారని పేర్కొన్నారు. ఏడాది కాల వ్యవధికి చేయాల్సిన డిపాజిట్లను పదిహేను రోజులకే ఈ ముఠా చేసిందని అన్నారు. కృష్ణారెడ్డి, పద్మనాభన్, మదన్‌లు డిపాజిట్ పత్రాలను ఫోర్జరీ చేసినట్లు పేర్కొన్నారు. 64.5కోట్లను కొల్లగొట్టి నిందితులు వాటాలు పంచుకున్నారని, 20కోట్లు సాయి కుమార్, 7కోట్లు వేంకటరమణ, 3కోట్లు రాజ్ కుమార్, 3కోట్లు వేంకటేశ్వర్ రావు, 6కోట్లు కృష్ణారెడ్డి, 2.5కోట్లు భూపతి, 6కోట్లు రమణా రెడ్డి, 50లక్షలు పద్మనాభన్, 30 లక్షలు మదన్, 10కోట్లు సత్యనారాయణ, 2.5 కోట్లు మస్తాన్ వలీ, 2కోట్లు కెనరా బ్యాంకు మేనేజర్ సాధన, 50 లక్షలు యోహన్ రాజు తీసుకున్నారని తెలిపారు. నిందితులు సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉందని, కస్టడికి తీసుకొని విచారించాల్సి ఉందని చెప్పారు. అదేవిధంగా పరారీ నిందితుల కోసం గాలిస్తున్నామని సీసీఎస్ పోలీసులు రిమాండ్ రిపోర్టు వివరించారు. -
అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
-
అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పిచ్చింది. అగ్రిగోల్డ్ డిపాజిట్ల కుంభకోణం కేసు గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఫిబ్రవరి 1నుంచి ఆస్తులు వేలం వేస్తామని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కోర్టుకు వివరించింది. ఎమ్‌ఎస్‌టీసీ, శ్రీరామ్ ఆటో మాల్, ఈ-ప్రొక్యూర్మెంట్ టెక్నాలజీకి వేలం బాధ్యతలు అప్పగించామని కమిటీ తెలిపింది. మొదటి విడతలో సంస్థకు చెందిన ఆరు ఆస్తులు వేలం వేయనున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఎమ్‌ఎస్‌టీసీ, శ్రీరామ్ ఆటో మాల్, ఈ-ప్రొక్యూర్మెంట్ టెక్నాలజీలలో ఒక్కో సంస్థకు రెండు ఆస్తులు వేలం వేసేందుకు అప్పగిస్తామన్నారు. ఇందుకు సంబంధించి మూడు వారాల్లో వెబ్సైట్ ఏర్పాటు చేసి అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం, టెండర్ల వివరాలను అందులో పొందుపరచాలని హైకోర్టు ఆదేశించింది. తొలి విడత వేలంలో రూ.3500 కోట్లు వస్తాయని అగ్రిగోల్డ్ సంస్థ కోర్టుకు వివరించింది. సామాన్య ప్రజల నుంచి అగ్రిగోల్డ్ యాజమాన్యం రూ.6,350 కోట్లను డిపాజిట్ల రూపంలో వసూలు చేసి చేతులెత్తేసిందని, ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అగ్రిగోల్డ్ డిపాజిట్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎ.రమేష్‌బాబు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా నేడు హైకోర్టులో విచారణకు రాగా, అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా పడింది.