భవానీపురం (విజయవాడ పశ్చిమ): అక్రమ సంపాదనపై ఆ మహిళ ఇష్టం పెంచుకుంది. నేరానికి పాల్పడుతున్న భర్తను నిలువరించాల్సిన ఆమె ఇంకా డబ్బు తెమ్మంటూ మరింత ప్రోత్సహించింది. భర్తను పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు కూడా అక్రమ సంపాదనపై నోరు విప్పలేదు. చివరికి పోలీసులు ఆమె గుట్టును రట్టు చేసి అరెస్ట్ చేశారు. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, ఏపీ కో ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ లిమిటెడ్‌కు చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల దుర్వినియోగం, దారి మళ్లింపు కేసును పోలీసులు ప్రతిష్టాత్యకంగా తీసు కుని దర్యాప్తును వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు కేసుల్లో మొత్తం రూ.14.6 కోట్ల మేర మోసం జరిగింది. ఇప్పటికే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ భవానీపురం బ్రాంచి మేనేజర్ సందీప్‌కుమార్, అసిస్టెంట్ మేనేజర్ మృదుల, పూసలపాటి యోహాన్ రాజును అరెస్ట్ చేసి వారి వద్ద నగదు, వివిధ బ్యాంకు అకౌంట్లలోని నగదును స్తంభింప చేశారు.
ఈ ముగ్గురితోపాటు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన వారిలోపై రెండు కేసుల్లో పాత్రధారులైన చుండూరి వెంకటకోటిసాయికుమార్, నండూరి వెంకట రమణ అలియాస్ వెంకట రామన్, మరీదు వెంకటేశ్వరరావు అలియాస్ డాక్టర్ వెంకట్ అలియాస్ రాజేష్, యర్ర జొన్నల సోమశేఖర్ అలియాస్ రాజకుమార్, పద్మనాభన్ అలియాస్ పద్మన్, బండారి వీర వెంకట నాగసత్యనారాయణను కూడా గతంలోనే పీటీ వారెంట్లపై కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు మంగళవారం విజయవాడ చిట్టినగర్ ప్రైజర్‌పేటకు చెందిన మరొక నిందితురాలిని అరెస్టు చేశారు.
విచారణలో తేలిందేమిటంటే...
కేసులో ముద్దాయి పూసలపాటి యోహాన్‌రాజు ప్రభుత్వ సంస్థలకు చెందిన డిపాజిట్ల మళ్లింపులో తన వాటాకు వచ్చిన డబ్బును ఇంటికి తీసుకువచ్చాడు. పెద్ద మొత్తంలో తీసుకొచ్చిన సొమ్మును చూసి అతని భార్య పూసలపాటి ప్రమీలా రాణి ఏమి జరిగిందంటూ భర్తను ఆరా తీసింది. అక్రమంగా నగదు తెచ్చినట్టు భర్త నుంచి తెలుసుకుని వారించాల్సిందిపోయి, ఇంకా డబ్బు తీసుకు రావాలని ప్రోత్సహించింది.
పెద్దమొత్తంలో నగదును ఇంటిలో ఉంచినా, బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో వేసినా అందరికీ అనుమానం వస్తుందని ప్రమీలా రాణి ఆలోచించింది. దీంతో సుస్మిత ట్రేడర్స్ పేరిట ఓ కంపెనీని ఏర్పాటు చేసింది. విజయవాడ బ్యాంక్ ఆఫ్ బరోడా వన్‌టౌన్ బ్రాంచిలో కరెంట్ అకౌంట్ తెరి చింది. భర్త అక్రమంగా తీసుకొస్తున్న నగదును ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు పలు దఫాలుగా రూ.73,10,000 ఆ అకౌంట్‌లో జమచేసింది. కుటుంబ అవసరాలకు రూ.7 లక్షలు వాడుకుంది. యోహాన్‌రాజును అరెస్ట్ చేసిన సమయంలో కూడా తన కరెంట్ అకౌంట్ వివరాలను ప్రమీలారాణి గోప్యంగా ఉంచింది.
భర్త చేసిన నేరాల్లో పాలుపంచుకున్నందుకు ఆమెను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి, ఆమె బ్యాంక్ ఖాతాలోని రూ.66,08,901లను స్తంభింప చేశారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు ఆదేశాల మేరకు ఈస్ట్ జోన్ డీసీపీ హర్షవర్ధన్ రాజు పర్యవేక్షణలో సీసీఎస్ ఏసీపీ కె.శ్రీనివాసరావు ఈ రెండు కేసుల దర్యాప్తును పూర్తి స్థాయిలో చేపట్టారు. ఈ నేరాలలో ఇంకా ఎవరి పాత్ర అయినా ఉందా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
ఇప్పటి వరకు సీజ్ చేసిన నగదు వివరాలు
► ఇప్పటి వరకు ముద్దాయిలు, వారికి చెందిన అకౌంట్లలో రూ.40,70,000లను పోలీసులు సీజ్ చేశారు.
► ముద్దాయిలు మళ్లించిన వివిధ అకౌంట్లలో రూ.1,99,45,810 నగదును స్తంభింపజేశారు.
► రెండు కేసులలో ముద్దాయిలు కాజేసిన నగదుతో కొన్న రూ.1.7 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment