కారు ఢీ కొనడంతో ధ్వంసమైన వాహనాలు
గుణదల(విజయవాడ తూర్పు): జన సంచారం అధికంగా ఉండే సమయంలో నడి రోడ్డుపై కొత్త కారు బీభత్సం సృష్టించింది. మాచవరం దాసాంజనేయ స్వామి గుడి వద్ద శనివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన స్ధానికంగా కలకలం రేపింది. సేకరించిన వివరాల ప్రకారం.. విజయవాడ చుట్టుగుంట ప్రాంతానికి చెందిన చింతల శ్రీనివాస్(40) ప్రైవేటు ఉద్యోగి, శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో స్ధానిక దాసాంజనేయ స్వామి ఆలయం వద్ద (ఏపీ 16 బిఎల్ 1656) నంబరు గల తన కారును పూజ చేయించేందుకు వచ్చాడు.
అనంతరం స్వామిని దర్శించుకుని కారును తీశాడు. బ్రేక్‌కు బదులు ఎక్సలేటర్‌ను తొక్కడంతో ఒక్కసారిగా ఆ కారు పెద్ద శబ్దంతో ముందుకు దూకింది. ఈ శబ్దానికి భయపడిన అక్కడి భక్తులు, వాహన చోదకులు పరుగులు తీశారు. దీంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఎక్కడివారక్కడ పారిపోవడంతో కారు చుట్టు పక్కల ఉన్న వాహనాలపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్వల్పంగా గాయపడగా, ఐదు ద్విచక్ర వాహనాల ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని కారును స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment