
ఐదు తూటాలు ‘మిస్సింగ్’!
⇒బీహార్‌లో తుపాకీ, ఆరు తూటాలు కొనుగోలు చేసిన అక్రమ్
⇒గురువారం పోలీసులకు దొరికింది ఒక తూటానే
⇒మిగిలినవి హత్యల కోసం వాడినట్లు అనుమానం
⇒హైదరాబాదీ పాత్రపై దర్యాప్తు
సిటీబ్యూరో: రాజస్థాన్‌కు చెందిన వ్యాపారి నుంచి రూ.20 లక్షలు రంగురాళ్లు చోరీ చేసిన ధీరజ్‌సింగ్ అలియాస్ అక్రమ్ భాయ్ వద్ద ఉండాల్సిన ఐదు తూటాలు మిస్ అయ్యాయి. అటెన్షన్ డైవర్షన్ చేయడంలో ప్రత్యేక పంథాను అనుసరిస్తున్న అక్రమ్ గ్యాంగ్‌ను దక్షిణ మండల పోలీసులు గురువారం అరెస్టు చేసిన విషయం విదితమే. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న చార్మినార్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్రమ్ నుంచి ఒక తూటా, తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. వాస్తవానికి ఇతడు బీహార్‌లో ఆరు తూటాలు ఖరీదు చేయగా, మిగిలినవి ఏమయ్యాయనే కోణంలో ఆరా తీస్తున్నారు.
‘మాల్’ను ఇట్టే గుర్తుపట్టేస్తారు...
ఉత్తరాదిలోని వివిధ చెందిన ఆరుగురితో ముఠా ఏర్పాటు చేసిన అక్రమ్ భాయ్ ముంబై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాడు. ఢిల్లీ, మహారాష్ట్రతో పాటు కర్ణాటక రాష్ట్రంలోనూ వీరు పలు నేరాలకు పాల్పడ్డారు. వీరు ఏ నగరంలో అడుగుపెట్టినా హోటల్/లాడ్జ్/అద్దె ఇంట్లో బస చేసి, వరుసగా ఐదారు నేరాలు చేసి పత్తా లేకుండా పారిపోతారు. ఆయా నగరాల్లో బంగారం, వజ్రాలు, రంగురాళ్ల వ్యాపారం జరిగే ప్రాంతాల్లో కాపుకాసే ఈ ముఠా... విలువైన వస్తువులు, డబ్బుతో వస్తున్న వారిని ఇట్టే గుర్తుపట్టి టార్గెట్ చేస్తుంది. ఈ నెల 20న ముంబై నుంచి సిటీ నుంచి బయలుదేరిన ఈ గ్యాంగ్ మార్గమధ్యంలో 21న బెంగళూరులో ఆగి అక్కడో నేరం చేసింది. అదే రోజు బయలుదేరి 22న సిటీకి చేరుకుంది. లక్డీకాపూల్‌లోని హిల్‌పార్క్ ఇన్ హోటల్ గదితో పాటు ఉప్పర్‌పల్లిలో ఇంటిని అద్దెకు తీసుకుంది.
ఖరీదు చేసింది ఆరు తూటాలు...
అక్రమ్ భాయ్ స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని. అక్కడ తన పూర్వీకుల భూమికి సంబంధించి వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థుల్ని బెదిరించేందుకుగాను ఓ తుపాకీ ఖరీదు చేయాలని నిర్ణయించుకున్నాడు. గత ఏడాది బీహార్ వెళ్లిన అక్రమ్ హాజీపూర్‌కు చెందిన సంజయ్ కుమార్‌ను సంప్రదించాడు. రూ.35 వేలతో అతడి నుంచి నాటు తుపాకి, ఆరు తూటాలు ఖరీదు చేశాడు. ఈ తుపాకీ చూపి బెదిరించి తన భూమిని సొంతం చేసుకున్నాడు. గురువారం పోలీసులు అరెస్టు చేసిన సందర్భంలో అక్రమ్ దగ్గర తుపాకీతో పాటు ఒక తూటానే లభించింది. మిగిలిన ఐదింటినీ ఏ నేరంలో వాడాడనేది అంతుచిక్కట్లేదు. నిందితుడు ప్రాక్టీస్ చేయడానికి వాటిని వాడానని చెప్తున్నా, ఇతడి నేర చరిత్రను దృష్టిలో ఉంచుకుని నేరాల కోసమే వాడినట్లు అనుమానిస్తున్నామని డీసీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. అక్రమ్ గ్యాంగ్ నాలుగు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో నేరాలు చేసినట్లు భావిస్తున్నామన్నారు.
రషీద్‌కు తెలిసే సహకరించాడా?
ఈ గ్యాంగ్ సంజయ్ కుమార్ షా నుంచి తస్కరించిన రంగురాళ్లను ఉప్పర్‌పల్లిలోని డెన్‌లోనే పంచుకుంది. తన వద్ద ఉన్న వాటిని విక్రయించడం కోసం అక్రమ్ ప్రయత్నాలు చేశాడు. తన రెండో భార్యకు పరిచయస్తుడైన చంద్రాయణగుట్ట వాసి రషీద్‌కు వాటిని ఇచ్చి మార్కెట్‌లో విలువ కనుక్కుని, మంచి రేటుకు అమ్మమని చెప్పాడు. తొలుత కొన్ని దుకాణాలు తిరిగిన రషీద్ ఆ రాళ్లను చూపించగా... ఎక్కడా రూ.2 వేల నుంచి రూ.3 వేలకు మించి రేటు పలకలేదు.
ఇదే విషయాన్ని అక్రమ్‌కు చెప్పగా... తానూ వస్తానంటూ బుధవారం రాత్రి చార్మినార్ ఠాణా పరిధిలో ఉన్న ఆకాష్ అగర్వాల్ దుకాణం వద్దకు చేరుకున్నాడు. అప్పటికే చార్మినార్ పోలీసులు చోరీ, ఆ రాళ్ల వివరాలను అందరు వ్యాపారులకు వివరించారు. దీంతో అది చోరీ సొత్తుగా గుర్తించిన ఆకాష్ అగర్వాల్ దుకాణదారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వీరిద్దరూ చిక్కారు. విచారణలో మిగిలిన వారి వివరాలు వెలుగులోకి రావడంతో పట్టుకున్నారు. రషీద్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడికి చోరీ సొత్తని తెలిసి సహకరించాడా? తెలియకుండా చేశాడా? అన్నదానిపై ఆరా తీస్తున్నారు.
నగర యువతితో రెండో వివాహం..
ఉప్పర్‌పల్లికి చెందిన ఓ మహిళ తన సోదరిని కలవడానికి ముంబై వెళ్తుండేది. ఈ నేపథ్యంలో అక్రమ్ భాయ్‌తో ఈమెకు పరిచయం ఏర్పడింది. ఇది ప్రేమగా మారడంతో అక్రమ్ ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లు ముంబైలోనే ఉన్న ఈ యువతి ప్రస్తుతం ఉప్పర్‌పల్లిలో నివసిస్తోంది. చార్మినార్ ఠాణా పరిధిలోని పత్తర్‌గట్టీ కమాన్ ప్రాంతంలో జైపూర్ వాసి సంజయ్ కుమార్ షా నుంచి ఈ నెల 23న రూ.20 లక్షలు విలువైన రంగురాళ్లు ఉన్న బ్యాగ్‌ను తస్కరించిన అక్రమ్ గ్యాంగ్ అదే రోజు అఫ్జల్‌గంజ్ పరిధిలో మరో వ్యక్తి నుంచి నగదు ఉన్న బ్యాగ్ అపహరించింది. గ్యాంగ్ సభ్యులు హోటల్‌లో ఉంటుండగా... అక్రమ్ ఉప్పర్‌పల్లిలో భార్య వద్దే ఉండేవాడు.