తలుపులు బార్లా!
⇒మహానగరంలో ‘మద్య’భారతం
⇒రాత్రీ పగలు మందుబాబుల స్వైర విహారం
⇒వేళలు పాటించని వైన్ షాపులు, బార్లు
⇒అధిక ధరలతో అర్ధరాత్రీ అమ్మకాలు
⇒అవినీతి మత్తులో ఎక్సైజ్ శాఖ
మహానగరంలో మందుబాబుల ఆగడాలు మితిమీరుతున్నాయి. రాత్రీ పగలూ.. రహదారుల వెంట..వీధులు..కాలనీలు..నడిరోడ్లపై.. ఎక్కడ పడితే అక్కడ మద్యం తాగుతూ న్యూసెన్స్ సృష్టిస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల గుండా వెళ్లాలంటేనే మహిళలు, వృద్ధులు, చిన్నారులు హడలిపోతున్నారు. కాసుల కక్కుర్తితో వేళలు పాటించకుండా బార్లు, వైన్ షాపుల్లో ఎప్పుడు పడితే అప్పుడు మద్యం విక్రయిస్తున్నారు. అవినీతికి మరిగిన ఎక్సైజ్ శాఖ వీటిని పట్టించుకోక పోవడంతో మద్యం విక్రేతలు అధిక ధరలకూ విక్రయిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ వివిధ రేట్లలో మద్యం విక్రయాలు జరుపుతున్నారు. మహానగరవ్యాప్తంగా అసాంఘిక శక్తులు, మందుబాబుల ఆగడాలకు నిలయంగా మారిన మద్యం దుకాణాలు, బార్ల వద్ద పరిస్థితిని గురువారం రాత్రి, శుక్రవారం ‘సాక్షి’ బృందం విస్తృతంగా పరిశీలించింది. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులపై.. లైవ్ రిపోర్ట్...
నగరంలో చాలా చోట్ల మద్యం షాపులు, బార్ల వద్ద బహిరంగంగానే మద్యం తాగుతూ మందుబాబులు రెచ్చిపోతున్నారు. దీంతో ఆ దారుల గుండా వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. నిబంధనలను తుంగలో తొక్కుతూ మద్యం షాపులు, బార్లను అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచుతున్నారు. కొందరు దొడ్డిదారిలో యథేచ్ఛగా మద్యం విక్రయిస్తూ అధికరేట్లు వసూలు చేస్తున్నారు. మద్యం షాపుల వద్ద పరిస్థితిపై
సాక్షి లైవ్ రిపోర్టు ఇదీ...
సాక్షి, సిటీబ్యూరో:
రూట్ 1
ప్రాంతాలు: దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, ఎల్బీనగర్, వనస్థలిపురం, హస్తినాపురం, బీఎన్‌రెడ్డి నగర్ లైవ్‌రిపోర్ట్ నిబంధనలకు విరుద్ధంగా భారీ విస్తీర్ణంలో పర్మిట్‌రూంలు ఉన్నాయి. రాత్రి 9.30 తరువాత తలుపులు మూసి లైట్లు ఆర్పి.. అర్ధరాత్రి 12 వరకు మద్యం సరఫరా అవుతోంది. రాత్రి 10 తరవాత కూడా వనస్థలిపురం ప్రధాన రహదారిపై ఉన్న ఓ వైన్స్ సమీపంలో రోడ్డుపక్క నిలబడి మందుబాబులు బీర్లు తాగుతూ కనిపించారు.
రూట్ 2
ఏరియా: మాదాపూర్
ప్రాంతాలు: మాదాపూర్ పరిసరాలు
లైవ్‌రిపోర్ట్: ఐటీసంస్థలకు నిలయంగా మారిన ఈ ప్రాంతంలో మద్యం దుకాణాలు వేళాపాళా లేకుండా కొనసాగుతున్నాయి. మహిళా ఉద్యోగులు రాకపోకలు సాగించే ఈ మార్గంలో రోడ్డుపైనే మందుబాబుల ఆగడాలు కనిపించాయి. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ వంద అడుగుల రోడ్డులోని మద్యం దుకాణం ముందు వాహనాలు ఆపి బహిరంగంగా మద్యం సేవిస్తున్నారు. మద్యం మత్తులో పాదచారుల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్థానికులు చెప్పారు. కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు డ్రైవర్లు బస్సుల్ని ఆపి మరీ మద్యం కొనుగోలు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి.
రూట్ 3
ఏరియా: మారేడ్‌పల్లి
లైవ్‌రిపోర్ట్: మారేడుపల్లిలో ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ఓ మద్యం దుకాణం వద్ద ప్రజలు బహిరంగంగా మద్యం సేవిస్తూ కనిపించారు. వైన్‌షాపు సిబ్బంది కానీ, స్థానిక పోలీసులు కానీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. మందుబాబుల ఆగడాలతో పాదచారులు ఇబ్బందులు పడుతూ రాకపోకలు సాగించడం కనిపించింది. కొన్ని చోట్ల మద్యం షాపులు, బార్లు వేళాపాళా లేకుండా తెరవడం, మూయడం కన్పించింది. కనీస వేళలను ఎవరూ పట్టించుకోవడం లేదు.
రూట్ 4
లైవ్‌రిపోర్ట్: రాత్రి 10 గంటలు దాటినా మద్యం దుకాణాల వద్ద హడావిడి కనిపించింది. పర్మిట్ రూమ్‌లు నిబంధనలకు విరుద్ధంగా విశాలంగా నిర్మించారు.
రూట్ 5
ఏరియా: పాతబస్తీ
ప్రాంతాలు: లాల్‌దర్వాజా, ఛత్రినాక, ఉప్పుగూడ, శంషీర్‌గంజ్, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, ఫిసల్‌బండ
లైవ్‌రిపోర్ట్: లాల్‌దర్వాజా మోడ్ ప్రాంతంలోని ఓ వైన్స్ వద్ద న్యూసెన్స్ ఉంటుండడంతో అక్కడే బస్టాప్‌లో ఉంటున్న ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఛత్రినాక చౌరస్తాలోని ఓ వైన్స్ ముందు మందుబాబులు తిష్ట వేస్తుండడంతో పక్కన ఉన్న గల్లీలోకి స్థానికులు వెళ్లలేని దుస్థితి. ఉప్పుగూడలోని ఓ వైన్స్ ముందు కూడా పార్కింగ్ సమస్య కారణంగా వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. శంషీర్‌గంజ్‌లోని ఓ వైన్స్, నాగులబండలోని వైన్స్‌ల వద్ద పర్మిట్ రూమ్ 10 బై 10 కాకుండా అతి పెద్ద విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. చాంద్రాయణగుట్టలోని పరిధిలోని రెండు మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల కన్నామముందే తెరచుకుంటున్నాయి. కొన్ని బార్‌లు అర్ధరాత్రి అనంతరం కూడా అమ్మకాలు కొనసాగించాయి.
►గ్రేటర్ పరిధిలో మద్యం దుకాణాలు: 400
►బార్లు: 540