హైదరాబాద్: మద్యం అమ్మకాలు ఇకపై ఆన్‌లైన్ పర్యవేక్షణలో జరగనున్నాయి. డిస్టిలరీల్లో మద్యం తయారీ నుంచి వినియోగదారుడికి చేరేంత వరకు జరిగే పరిణామ క్రమాన్ని తెలుసుకునేందుకు హెడోనిక్ పాత్ ఫైండర్ సిస్టం (హెచ్‌పీఎఫ్‌ఎస్)ను ఎక్సైజ్ శాఖ రేపటి నుంచి (ఫిబ్రవరి 1) అమలు చేయనుంది. ఈ విధానాన్ని అమలు చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్‌కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎక్సైజ్ శాఖ టెండర్లు పిలిచింది. 2014-15 సంవత్సరం నుంచి ఐదేళ్ల పాటు ఈ ప్రాజెక్టు అమలు చేసేందుకు యుఫ్లెక్స్-స్రిస్టెక్-ఈ టెల్ (యూఎస్‌ఈ) అనే మూడు సంస్థల కన్సార్టియంకు ఎక్సైజ్ శాఖ అప్పగించింది. మద్యం బాటిళ్లపై 2 డీ బార్‌కోడ్‌లతో హాలోగ్రామ్‌లు ముద్రించడం, సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఒక్కో బాటిల్‌కు 25 పైసల వంతున ఒక్కో మద్యం కేసుకు డిస్టిలరీలు కాంట్రాక్టు సంస్థకు రూ. 20 చెల్లించాలి.
ప్రతి ఏటా మూడు కోట్ల కేసుల మద్యం డిస్టిలరీల నుంచి మార్కెట్‌కు చేరుతుంది. అంటే మొత్తం రూ. 60 కోట్ల మేర కాంట్రాక్టు పొందిన సంస్థలకు చెల్లిస్తున్నారు. దీంతో పాటు 33 మద్యం డిపోలు, 4,380 మద్యం దుకాణాలు, 770 బార్లు, ఎక్సైజ్ కార్యాలయాల్లో యూపీఎస్ తరహాలో ఉన్న కంప్యూటర్లు, స్కానర్లు లాంటి పరికరాలు అమర్చాలి. ఈ పరికరాలు, సాఫ్ట్‌వేర్‌ను కాంట్రాక్టు పొందిన సంస్థ నుంచే కొనుగోలు చేయాలని ఎక్సైజ్ శాఖ ఒత్తిడి చేయడంతో గతేడాదే 4,380 మద్యం షాపుల్లోనూ ఒక్కో షాపునకు రూ. లక్ష వెచ్చించి పరికరాలు అమర్చారు.
కల్తీ, ధరలపై నిఘా...
ట్రాక్ అండ్ ట్రేస్ విధానంలో ఆన్‌లైన్ అమ్మకాలు చేస్తే మద్యం వ్యాపారులు ఎంతకు మద్యం అమ్ముతున్నారనేది తెలిసిపోతుంది. డిస్టిలరీల్లో తయారయ్యే మద్యం కల్తీకి గురవుతుందా? లేదా? అన్నది ఇట్టే అర్ధమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం వ్యాపారులు కూటమి కట్టి మద్యం ఎమ్మార్పీకి మించి అమ్మకాలు జరుపుతున్నారు. బాటిల్‌ను రూ. 20 నుంచి రూ. 40 అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఆన్‌లైన్ విధానం అమలైతే అధిక ధరలకు విక్రయించడానికి వీల్లేదు. ఖచ్చితంగా బిల్లింగ్ మిషన్ నుంచి బిల్లు ఇవ్వాలి. అప్పుడు అధిక ధరలకు అమ్మితే వెంటనే తెలిసిపోతుంది. ట్రాక్ అండ్ ట్రేస్ విధానం ద్వారా ఎక్సైజ్ అధికారులు కార్యాలయాల్లో కూర్చుని మద్యం అమ్మకాలు పర్యవేక్షించే వీలుంది.