
లాల్‌దర్వాజా బోనాలకు బందోబస్తు
లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల సందర్భంగా గట్టి బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.
చాంద్రాయణగుట్ట : లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల సందర్భంగా గట్టి బందోబస్తును ఏర్పాటు చేయనున్నామని ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ అబ్దుల్ బారీ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటికే అన్ని ఆలయాల కమిటీ సభ్యులతో పోలీసు అధికారులు సమావేశాలు నిర్వహించారు. సున్నితమైన అలియాబాద్, శంషీర్‌గంజ్ తదితర ప్రాంతాలలో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. రౌడీషీటర్లను బైండోవర్ కూడా చేశారు. వచ్చే ఆదివారం జరిగే ఈ ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారు. నిఘా కోసం లాల్‌దర్వాజా ప్రధాన రహదారిలో 20 సీసీ కెమెరాలను నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాలను శాలిబండ పోలీస్‌స్టేషన్ నుంచి పర్యవేక్షిస్తారు.
బందోబస్తులో ఒక ఎస్పీ ర్యాంక్ అధికారి, ఇద్దరు అదనపు ఎస్పీలు, ఆరుగురు ఎస్పీలు, 10 మంది సీఐలు, 20 మంది ఎస్సైలు, 300 మంది కానిస్టేబుళ్లు, హోం గార్డులు ఉంటారు. బోనాల సందర్భంగా మహిళలపై వేధింపులు, చైన్ స్నాచింగ్‌ల బెడద లేకుండా షీ టీమ్‌లతో పాటు యాంటీ చైన్ స్నాచింగ్ టీమ్‌లను రంగంలోకి దిగుతాయి. డివిజన్ పరిధిలో మొత్తం తొమ్మిది ఆలయాలు.. లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి, ఉప్పుగూడ మహంకాళి దేవాలయం, గౌలిపురా మాతేశ్వరీ మహంకాళి, మక్దూంపురా ఎల్లమ్మ, గాంధీనికేతన్ బంగారు మైసమ్మ, సీఐబీ క్వార్టర్స్ నల్ల పోచమ్మ, అలియాబాద్ దర్బార్ మైసమ్మ, మేకలబండ నల్ల పోచమ్మ, వివేకానంద నగర్ బంగారు మైసమ్మ ఆలయాల తరఫున బోనాల్లో పాల్గొంటారు.