బాలికల గురుకులాల్లో ఇక అందరూ మహిళా ఉద్యోగులే! | all woman employees in girls gurukula school's | Sakshi
Sakshi News home page

బాలికల గురుకులాల్లో ఇక అందరూ మహిళా ఉద్యోగులే!

Published Sat, May 14 2016 3:18 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM

all woman employees in girls gurukula school's

కొత్త గురుకులాలతో పాటు పాత వాటిలోనూ భర్తీకి ప్రభుత్వం మొగ్గు
రెండు మూడు రోజుల్లో వెలువడనున్న ఉత్తర్వులు

 సాక్షి, హైదరాబాద్: కొత్తగా ప్రారంభించనున్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల బాలికల గురుకులాల్లో మొత్తం మహిళా ఉద్యోగులనే నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బాలికల అక్షరాస్యతను పెంచడంతో పాటు, వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం గురుకులాల ద్వారానే సాధ్యమని ప్రభుత్వం అంచనాకు వచ్చింది. ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో కొత్తగా బాలికల గురుకులాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. కొత్తగా ఏర్పాటుకానున్న బాలికల గురుకులాలతోపాటు ఇప్పటికే కొనసాగుతున్న బాలికల గురుకులాల్లో టీచర్లు, వార్డెన్లు మొదలుకుని అన్ని విధుల్లోనూ మహిళా ఉద్యోగులనే నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇప్పటివ రకూ 50 ఏళ్లకు పైబడిన పురుషులను బాలికల గురుకులాల్లో నియమించేందుకు మినహాయింపు ఉండేది. ప్రస్తుతం అటువంటి మిన హాయింపు లేకుండా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఈ విషయంలో సాంకేతికంగా, చట్టపరంగా ఇబ్బందులు ఎదురవుతాయేమోనన్న కోణంలోనూ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆయా అంశాలపై వివిధ సంక్షేమ శాఖలకు ఈ ఫైల్‌ను పంపించారు. ఆ తర్వాత సాధారణ పరిపాలన శాఖ ఆమోదముద్రకు పంపనున్నారు. ఇందుకు సంబంధించి రోజుల్లోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయవచ్చునని అధికార వర్గాల సమాచారం.

 బీసీ వర్గాల్లో అసంతృప్తి
కొత్తగా 100 ఎస్సీ, 71 మైనారిటీ, 50 ఎస్టీ గురుకులాలను, 30 రెసిడెన్షియల్ కాలేజీలను ఏర్పాటుచేయనున్నారు. తమను మినహాయించి మిగతా అన్నివర్గాలకు గురుకులాలను ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం పట్ల బీసీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొత్తగా 20 బీసీ గురుకులాలను ఏర్పాటు చేయాలని, ప్రస్తుతమున్న 16 స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలనే ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలపై వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఈ వర్గాల్లో పెరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement