‘అంబలి’ కేంద్రం... ఆయన సేవకు చిహ్నం
♦ ప్రశంసలందుకుంటున్న సిర్పూరు ఎమ్మెల్యే కోనప్ప
♦ నగరంలోని ఆరు ఆస్పత్రుల్లో అంబలి కేంద్రాలు ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: తన నియోజకవర్గ పేదల ఆకలి తీర్చే అంబలి కేంద్రాల స్థాపనతో అందరి మన్ననలు పొందుతున్న ఆ ఎమ్మెల్యే తన దాతృత్వాన్ని కొన్నేళ్లుగా నగరానికీ విస్తరించారు. వివిధ ఆసుపత్రులకు వచ్చే రోగులు, వారి బంధువులకు ఆపన్నహస్తం అందించేందుకు సంకల్పించారు. ఈ క్రమంలో ఇటీవల అసెంబ్లీ ఆవరణలో అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేసి అందరి మన్ననలు పొందిన సిర్పూరు కాగజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తాజాగా నగరంలోని ఆరు ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో అంబలి కేంద్రాల ఏర్పాటుకు నడుం కట్టారు.ఇందులో భాగంగా సోమవారం నిమ్స్‌లో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించగా, గాంధీ ఆస్పత్రిలోని కేంద్రాన్ని ఎంపీ నగేష్‌తో కలిపి రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, అడవులు, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న ప్రారంభించారు.
ఇక నీలోఫర్ నవజాత శిశువుల ఆస్పత్రిలో కూడా ఓ కేంద్రాన్ని ప్రారంభించారు. ఉస్మానియా సహా ఎంఎన్‌జే, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రుల వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాలను మంగళవారం ప్రారంభించనున్నారు. కోనేరు కోనప్ప కుటుంబం గత పదేళ్ల నుంచి సిర్పూరులో అంబలి కేంద్రాలను నిర్వహిస్తున్నారు. గతేడాది నగరంలో నాలుగు సెంటర్లు ఏర్పాటు చేసి 37 రోజుల్లో సుమారు మూడు లక్షల మందికి సరఫరా చేశామని, ఈ ఏడాది రో జుకు ఎనిమిది వేల మంది వంతున రెండున్నర మాసాల్లో ఆరు లక్షల మంది ఆకలి తీర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎమ్మెల్యే కోనప్ప తెలిపారు. ఇందు కోసం రూ.8 నుంచి పది లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. పేదల ఆకలి తీర్చడం తనకు సంతృప్తినిస్తోందన్నారు.
ఆదర్శప్రాయుడు కోనప్ప: ఇంద్రకరణ్‌రెడ్డి
పేదల దవాఖానాల్లో అంబలి కేంద్రాలు ఏర్పాటు చేసి, వారి ఆకలి తీరుస్తున్న సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆదర్శప్రాయుడని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గత పదేళ్ల నుంచి సిర్పూర్ నియోజకవర్గంలో ఆయన అంబలి పంపిణీ చేస్తున్నారనీ తన సేవలను రాజధాని నగరానికి కూడా విస్తరింపజేయడం ప్రశంసనీయమన్నారు.
ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి: జోగు రామన్న
ప్రతీ వేసవిలో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అంబలి పంపిణీ కేంద్రాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కోనప్ప అభినందనీయుడని రాష్ట్ర అడవులు, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఈ విషయంలో కోనప్పను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు అంబలి, చలివేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. వారికి తమ సహకారం ఉంటుందన్నారు.