
మరి ఎమ్మెల్యేలను చేర్చుకున్న వాళ్లు ఎవరితో సమానం?
♦ చంద్రబాబు ఎవరితో సమానమో రేవంత్ చెప్పాలి
♦ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి డిమాండ్
సాక్షి, హైదరాబాద్: పార్టీ మారిన ఎమ్మెల్యేలు చచ్చిన వాళ్లతో సమానమంటూ తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన తెలంగాణకేనా, ఆంధ్రప్రదేశ్‌కు కూడా వర్తిస్తుందా? అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. దీనికి టీడీపీ నేతలు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీలో చేరినవాళ్లు చచ్చిన వాళ్లతో సమానమైతే చేర్చుకున్న వాళ్లు ఎవరితో సమానం? చంద్రబాబు ఎవరితో సమానమో కూడా రేవంత్‌రెడ్డి చెబితే తెలుగు ప్రజలు సంతోషిస్తారని అన్నారు. అంబటి ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే బ్రోకర్ల వ్యవస్థను తీసుకొచ్చారని దుయ్యబట్టారు. ఇలాంటి వారు బ్రోకర్లుగా ఎందుకు వ్యవహరించాల్సి వస్తోందో ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు.
చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారు
వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన వారిని ప్రలోభ పెట్టి పచ్చ కండువాలు కప్పుతూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారు ఆనందపడిపోతున్నారని అంబటి మండిపడ్డారు. వారికి ైనె తిక విలువలు లేవని, ప్రజాస్వామ్య విలువలను పాటించడం లేదని దుయ్యబట్టారు. ఇంకొక ఎమ్మెల్యే తమ పార్టీని వీడి వెళ్లారు అనే దానికంటే.. మరో ఎమ్మెల్యేని కూడ టీడీపీ విజయవంతంగా కొనుగోలు చేయగలిగిందని మాట్లాడుకోవడమే అర్థవంతంగా ఉంటుందన్నారు. తనను తాను విలువలున్న రాజకీయ నాయకుడిగా నిత్యం ప్రకటించుకుంటున్న చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, తిరిగి తన పార్టీ గుర్తుతో గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యేలకు డబ్బులిచ్చి పార్టీలో చేర్చుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థను సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారని అంబటి స్పష్టం చేశారు. ఇలాంటి దుష్ట సంప్రదాయాలను ప్రజాస్వామికవాదులు, ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.