చర్చకు మీ ఊరికే వస్తాం.. సిద్ధమా కేశవ్
* నీ మొఖానికి జగన్ అవసరం లేదు.. మా కార్యకర్త చాలు
* టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావులపై అంబటి ఫైర్
సాక్షి, హైదరాబాద్: రాజధాని భూ దురాక్రమణపై చర్చకు వైఎస్ జగన్ ప్రకాశం బ్యారేజీ వద్దకు రావాలని టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ విసిరిన సవాలుకు వైఎస్సార్‌సీపీ గట్టిగా ప్రతిస్పందించింది. కేశవ్ సవాలును స్వీకరించిన వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు.. ప్రకాశం బ్యారేజీ వద్ద అవసరం లేదని చర్చకు తాము కేశవ్ ఊరు ఉరవకొండకే వస్తామని బదులిచ్చారు. గురువారం అంబటి విలేకరులతో మాట్లాడుతూ.. అనంతపురానికి చెందిన కేశవ్ రాజధాని ప్రాంతంలో ఎందుకు భూములు కొన్నారో చెప్పాల్సింది పోయి జగన్‌పై విరుచుకు పడటం ఏమిటని ప్రశ్నించారు.
జగన్‌కు దమ్మూ, ధైర్యం ఉంటే, నీతి నిజాయితీ ఉంటే రాయలసీమ రక్తం ప్రవహిస్తూ ఉంటే చర్చకు ప్రకాశం బ్యారేజీ వద్దకు రావాలని కేశవ్ రంకెలు వేశారన్నారు. ‘‘కేశవ్.. నీ మొఖానికి జగన్ రావాలా.. నీ అవినీతిని నిరూపించడానికి మా నాయకుడి అవసరమే లేదు. మా కార్యకర్త చాలు... నీ ఉరవకొండకే చర్చకు వస్తాం. నీకు సిగ్గు, శరం, చీము నెత్తురు ఏ మాత్రం ఉన్నా నిజంగా రాయలసీమ రక్తంతో మండే వాడివే అయితే చర్చకు రా’’ అని అంబటి ప్రతి సవాలు విసిరారు.
భూ కుంభకోణంలో తన వ్యవహారం గురించి సాక్షి పత్రికలో వార్త వస్తున్నదని తెలుసుకున్న కేశవ్ బుధవారం రాత్రి 11 గంటల వరకూ సాక్షి కార్యాలయం వాచ్‌మన్ దగ్గరి నుంచీ స్టింగర్ వరకూ కాళ్ల బేరానికి వచ్చి బతిమిలాడారని అంబటి వెల్లడించారు. రాత్రి కాళ్లబేరానికి వచ్చిన కేశవ్ పగలు జగన్‌పై ఘీంకరిస్తూ మాట్లాడారన్నారు. రాజధాని ప్రకటనకు ముందే కేశవ్ ఆ ప్రాంతంలో భూమికి అడ్వాన్సు ఇచ్చి ఆ తరువాత రిజిస్ట్రేషన్ చేయిం చుకున్నారని తెలిపారు. సీబీఐ దృష్టికి రాని జగన్ అంశాలను కూడా ఇపుడు తెస్తానని బెది రిస్తున్నారని అయితే ఆయన వీటిని ఇంత కాలం ఎందుకు దాచారో చెప్పాలని నిలదీశారు.
సాక్షి కథనాలకు కోతుల్లా ఎగురుతున్నారు
అవినీతిపరుల గుండెల్లో నిద్ర పోతానని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు ఇపుడు లింగమనేని కట్టిన అక్రమ భవనంలో నిద్ర పోతున్నారని అంబటి ఎద్దేవా చేశారు. సాక్షిలో వచ్చే కథనాలకు సమాధానం చెప్పలేక నిప్పు తొక్కిన కోతిలాగా ఎగరడం దేనికన్నారు. అవినీతికి సమాధానం చెప్పుకోవాలి గానీ జగన్‌పై బురద జల్లి తప్పుకు పోవాలంటే కుదరదన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో గానీ, సీబీఐ చేత గానీ విచారణకు చంద్రబాబు సిద్ధం కాకపోతే టీడీపీ నేతలంతా అవినీతికి ప్పాడినట్లేనని అంబటి పేర్కొన్నారు.
ముద్రగడ పద్మనాభం రాసిన లేఖ వెనుక జగన్ హస్తం ఉందని మంత్రి నారాయణ వ్యాఖ్యానించడం విడ్డూరమన్నారు. వాస్తవానికి ముద్రగడ పోరాడుతున్నది చంద్రబాబు ఇచ్చిన హామీ అమలు కోసమేనన్నారు. రాజధాని భూదందాపై బీజేపీ స్పందించాలని కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని అంబటి కోరారు. ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం పేరుతో ప్రపంచం ఆశ్చర్యపోయే కుంభకోణానికి పాల్పడ్డారని ఆయన అన్నారు.