
కొత్త ప్రాజెక్టులకు రెడ్‌సిగ్నల్
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పెండింగ్‌లో ఉంచాలని రాష్ట్ర సర్కారు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో కొత్తగా సాగునీటి ప్రాజెక్టులను మంజూరు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ప్రారంభం కాకుండా ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల విషయంలో ఏటూ తేల్చుకోలేకపోతోంది. దీంతో ఈ ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎనిమిదేళ్ల క్రితం రాష్ట్రంలో జలయజ్ఞం కింద అనేక సాగునీటి ప్రాజెక్టులను చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికే కొన్ని పూర్తవగా... మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. గత నాలుగేళ్లుగా ప్రభుత్వం సరైన చర్యల్ని తీసుకోకపోవడంతో అనేక ప్రాజెక్టులు చివరి దశలో నిలిచిపోయాయి. మరికొన్నింటికి పరిపాలన అనుమతి ఇచ్చినా ఇంకా ప్రారంభించలేదు. వీటితోపాటు మరికొన్ని కొత్త ప్రాజెక్టులు నిర్మించాలన్న డిమాండ్లు రాష్ర్టంలో అనేకచోట్ల ఉన్నాయి.
ఉదాహరణకు పాలమూరు ఎత్తిపోతల పథకం కోసం చాలాకాలం నుంచి డిమాండ్ ఉంది. జూరాల ప్రాజెక్టును ఆధారం చేసుకుని సుమారు 70 టీఎంసీల నీటిని లిప్టు చేయాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. తద్వారా మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని సుమారు 10 లక్షల ఎకరాలకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో ఈ ప్రాజెక్టు సర్వే కోసం రూ.7 కోట్లు విడుదల చేశారు. వచ్చే ఎన్నికల లోపు ఈ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతిని సాధించి, టెండర్లు ఖరారు చేయాలని భావించారు. అయితే ఈలోపు విభజన అంశం తెరపైకి రావడంతో ఈ ప్రాజెక్టును పక్కన పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును చేపట్టాలని ఇంతకు ముందే నిర్ణయించారు. ఇందుకు సంబంధించి టెండర్లు కూడా ఖరారు చేశారు. అయితే ఇప్పటిదాకా పనులు ప్రారంభించలేదు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రాజెక్టును కూడా కొంతకాలం పెండింగ్‌లోనే ఉంచాలని నిర్ణయించారు. దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టును కూడా పెండింగ్‌లో ఉంచాలని సర్కారు నిర్ణయించింది.
ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు 165 టీఎంసీల నీటిని తరలించాల్సి ఉంది. అయితే దీన్ని తెలంగాణకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారు. దాంతో పనులు మొదలుకాలేదు. ఇప్పట్లో ప్రారంభించే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి సంబంధించిన ఫైల్ ప్రస్తుతం సీఎం పరిశీలన కోసం ఎదురుచూస్తోంది. కల్వకుర్తి నాలుగో దశ వంటి ప్రాజెక్టుల కోసం కూడా డిమాండ్ ఉంది. ప్రస్తుతం వీటన్నింటినీ పట్టించుకోకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ర్ట విభజన విషయంలో నీటి పంపిణీయే ప్రధానం. ముఖ్యంగా కృష్ణా నదిలో నీటి లభ్యత కంటే ప్రజల అవసరాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో ఈ నీటి కోసం తీవ్ర ఒత్తిడి ఉంది. ఇటు తెలంగాణాతోపాటు అటు రాయలసీమ, ఆంధ్రా ప్రాంతం కూడా ఈ నదిపై ఆధారపడి ఉంది. ఇప్పటికే ఈ నదిపై పలు ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. ముఖ్యంగా నెట్టెంపాడు, కల్వకుర్తి, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగా, వెలిగొండు, ఏఎమ్మార్పీలాంటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపు ఇబ్బందికరంగా మారింది.