టీ బిల్లుకు సవరణలు | changes in Telangana bill | Sakshi
Sakshi News home page

టీ బిల్లుకు సవరణలు

Published Tue, Jan 7 2014 12:58 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

టీ బిల్లుకు సవరణలు - Sakshi

టీ బిల్లుకు సవరణలు

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లుకు అనేక సవరణలు చేయాల్సిన అవసరముందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వాటితో పాటు పొరపాట్లను సరిదిద్దిడం, గతంలో పేర్కొనని సంస్థలను చేర్చడంతో పాటు విభజిస్తే ఏ రంగంలో ఏ రాష్ట్రానికి ఎంత వాటా వస్తుంది వంటి వివరాలను 56 ప్రభుత్వ శాఖలు గత పది రోజులకు పైగా సేకరించాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ఆదేశానుసారం ఈ కసరత్తు చేపట్టి, వాటిపై ఆయనకు నివేదికలు సమర్పించాయి. ఆ సమాచారాన్ని సీఎస్ ఇటీవలే కేంద్ర హోం శాఖకు కూడా పంపారు. అయితే, బిల్లుపై ఇప్పటికే అసెంబ్లీలో చర్చ కూడా మొదలైన నేపథ్యంలో ఈ సవరణలు తదితరాలపై కేంద్ర హోం శాఖ ఏం చేస్తుందన్నది చూడాల్సి ఉంది. ఈ సమాచారాన్ని ఎమ్మెల్యేలు కూడా అడిగిన నేపథ్యంలో దాన్ని అసెంబ్లీకి కూడా సమర్పించాలని సీఎస్ భావిస్తున్నారు. సవరణలు ఇలా ఉన్నాయి...
 
 ఏడో షెడ్యూల్‌లో మరో 160 సంస్థలు
 విభజన బిల్లు ఏడో షెడ్యూల్‌లో పేర్కొన్న 41 సంస్థల నిధులే కాకుండా మరో 160 సంస్థలకు పైగా నిధులున్నాయని ఆర్థిక శాఖ తేల్చింది. వాటి వివరాలన్నింటితో సమాచారాన్ని సిద్ధం చేసింది. ఈ 160 సంస్థలనూ ఏడో షెడ్యూల్‌లో చేర్చాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే విశ్వవిద్యాలయాల నిధులను కూడా వాటికే పంపిణీ చేయాల్సి ఉంటుంది తప్ప జనాభా ప్రాతిపదికన కుదరదని తెలిపింది. ఏడో షెడ్యూల్‌లో పేర్కొన్న 41 సంస్థల నిధులను జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయాలని చెప్పినా ఉద్యోగుల పీఎఫ్, పించన్, బీమా వంటి పలు సంస్థల విషయంలో ఇది అసాధ్యమని పేర్కొంది. ఉద్యోగి పీఎఫ్, పించన్, బీమా నిధుల వంటివి అతని సర్వీసు ఆధారంగా ఉంటాయి గనుక వాటిని ఉద్యోగులవారీగా వ్యక్తిగతంగానే పంపిణీ చేయాల్సి ఉంటుందని నివేదికలో స్పష్టం చేసింది. కాకపోతే ఈ సంస్థల నిధులను ఏ ఫార్ములా ప్రకారం పంపిణీ చేయాలో కేంద్రమే చెప్పాలని కోరాలని ప్రభుత్వం భావిస్తోంది.
 
 కులాల తప్పులపై సవరణల నివేదిక
 తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బిల్లులో పేర్కొన్న షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన పేర్లలో తప్పొప్పులు చోటుచేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిం చారు.  తెలంగాణలో మాలి అనే ఎస్టీ తెగ లేదని, దాన్ని జాబితా నుం చి తొలగించాలని, హోల్య తెగ బదులు హోల్వగా మార్చాలని, తొటి తెగ జిల్లాల జాబితాలో రంగారెడ్డి జిల్లాను చేర్చాలని పేర్కొన్నారు.
 
 తొమ్మిదో షెడ్యూల్‌లో మరో 63 ప్రభుత్వ సంస్థలు
 బిల్లులోని తొమ్మిదో షెడ్యూల్‌లో 44 ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల పేర్లను పొందుపరిచారు. కానీ మరో 63 సంస్థలను కూడా ఆ జాబితాలో చేర్చాలని పలు శాఖలు ప్రభుత్వానికి పేర్లతో సహా నివేదికలు సమర్పించాయి. రాష్ట్ర స్థాయి పరిధిలో ఉన్న రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ, జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్, శ్రీ పద్మావతి మహిళా, ద్రవిడ, తెలుగు, డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ వంటి విశ్వవిద్యాలయాలను ఏ రాష్ట్ర పరిధిలోకి తీసుకోవాలో కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని విద్యా శాఖ తన నివేదికలో పేర్కొంది.
 
 పదో షెడ్యూల్‌లో అకాడెమీలు
 బిల్లులోని పదో షెడ్యూల్‌లో హిందీ అకాడెమీ, తెలుగు అకాడెమీ, సాంస్కృతిక అకాడెమీ, ప్రాచ్ఛ లిఖిత గ్రంథాలయం,  ఆంధ్రప్రదేశ్ పురావస్తు-పరిశోధన సంస్థలను చేర్చాలని నివేదికలో పేర్కొన్నారు. గిరిజన యూనివర్సిటీలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండింట్లోనూ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. తెలంగాణలో ఉద్యాన వర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు బిల్లులో పేర్కొన్నా ఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందో స్పష్టం ఇవ్వాలని కోరారు. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌ఇఆర్, కేంద్రీయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ వర్సిటీ, ట్రిబుల్ ఐటీ వంటి జాతీయ స్థాయి సంస్థలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12, 13వ పంచవర్ష ప్రణాళికా కాలాల్లో ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
 
 స్థానిక నియోజక వర్గాల్లో రెండు జిల్లాలు
 ఆంధ్రప్రదేశ్‌తో పాటు శాసన మండలి, శాసనసభకు సంబంధించిన విభజన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వరలాల్ సమర్పించారు. తెలంగాణ ముసాయిదా బిల్లులో మండలికి సంబంధించి సీమాంధ్రలో స్థానిక సంస్థల నియోజకవర్గాల జాబితాలో కర్నూలు, అనంతపురం జిల్లాలను పేర్కొనలేదని ఆయన గుర్తు చేశారు. కర్నూలు జిల్లాలో రెండు స్థానిక సంస్థల నియోజవర్గాలు, అనంతపురం జిల్లాలో ఒక స్థానిక సంస్థల నియోజకవర్గం ఉన్నాయని, వాటిని తెలంగాణ బిల్లులో పొందుపరచాలని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement