రాష్ట్ర విభజన నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖలు నివేదికలు సిద్ధం చేయడంలో నిమగ్నమయ్యాయి. సచివాలయం నుంచి అందిన ఆదేశాల మేరకు ఇప్పటికే కొన్ని శాఖలు సమాచారాన్ని అందజేశాయి.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:
రాష్ట్ర విభజన నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖలు నివేదికలు సిద్ధం చేయడంలో నిమగ్నమయ్యాయి. సచివాలయం నుంచి అందిన ఆదేశాల మేరకు ఇప్పటికే కొన్ని శాఖలు సమాచారాన్ని అందజేశాయి. కోరిన సమాచారాన్ని అందించేందుకు సంసిద్ధులు కావాలంటూ మరికొన్ని శాఖలకు ఉన్నతాధికారుల నుంచి వర్తమానం అందింది. రాష్ట్ర రాజధానికి మెదక్ జిల్లా పొరుగునే ఉండటంతో హైదరాబాద్‌తో ముడిపడి వున్న అంశాలపై సమాచారం కోరుతున్నట్లు తెలిసింది. జంట నగరాలకు తాగు నీరు సరఫరా చేస్తున్న ‘సింగూరు జలాశయం’పై నీటి పారుదల శాఖ అధికారులు ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు నివేదిక సమర్పించారు. నీటి నిల్వ, మూడేళ్లుగా ప్రతీ యేటా ఎంత నీరు సరఫరా చేస్తున్నారు అనే కోణంలో వివరాలు కోరారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపుపైనా వాణిజ్య పన్నుల శాఖ నివేదిక సమర్పించినట్లు సమాచారం.
బీహెచ్‌ఈఎల్, బీడీఎల్ వంటి సంస్థలు చెల్లిస్తున్న వాణిజ్య పన్నుల వివరాలు ఈ నివేదికలో క్రోడీకరించారు. జిల్లాకు సంబంధించిన సమాచారాన్ని కోరితే నివేదికలు ఇవ్వాల్సి ఉంటుందని జిల్లా ప్రణాళిక అధికారులకు వర్తమానం అందింది.
త్వరలో ఇతర శాఖలకు..
విభజనకు సంబంధించిన పలు అంశాలపై నివేదిక రూపొందిస్తున్నారు. రవాణా, పరిశ్రమలు, రెవెన్యూ, ఉపాధి కల్పన తదితర అంశాలకు సంబంధించి కూడా త్వరలో సమాచారం కోరే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామచంద్రాపురం, పటాన్‌చెరు డివిజన్లతో పాటు శివారు ప్రాంతాలతో ముడిపడిన అంశాలపైనా నివేదికలు కోరే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.