
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రికి పటిష్ట భద్రత కల్పించే లక్ష్యంతో ఆయన నియోజకవర్గం గజ్వేల్‌లో నిర్మిస్తున్న క్యాంపు కార్యాలయానికి బుల్లెట్‌ప్రూఫ్ భద్రతను కల్పిస్తున్నారు. ఇటీవల మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో పటిష్ట భద్రత ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేలా ఎమ్మెల్యేలకు ఆయా నియోజకవ ర్గ కేంద్రాల్లో క్యాంపు కార్యాలయాల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే.
హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలకు కొత్త క్వార్టర్లు నిర్మిస్తున్నందున.. గ్రేటర్ హైదరాబాద్ పరిధి మినహా రాష్ట్రవ్యాప్తంగా 104 నియోజకవర్గాల్లో ఆధునిక హంగులతో, అన్ని సౌకర్యాలతో ఈ కార్యాలయాలను నిర్మిస్తున్నారు. అందులో ఇప్పటికే 16 భవనాలు సిద్ధం కాగా.. మరో 31 చోట్ల పదిహేను రోజుల్లో పూర్తికానున్నాయి. ఇందులో సీఎం నియోజకవర్గం గజ్వేల్‌లోని క్యాంపు కార్యాలయం కూడా సిద్ధమవుతోంది.
సీఎం కార్యాలయం కావడంతో..
గజ్వేల్ నియోజకవర్గ కార్యాలయం నిర్మాణ నమూనాలో మిగతావాటి తరహాలోనే ఉన్నా.. ముఖ్యమంత్రి కార్యకలాపాలు నిర్వహించే నేపథ్యంలో ప్రత్యేక హంగులు, ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల మావోయిస్టుల నుంచి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో.. ఈ భవనానికి బుల్లెట్ ప్రూఫ్ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖ ప్రతిపాదించింది. ఈ సూచనలకు సాధారణ పరిపాలన శాఖ ఓకే చెప్పడంతో.. ఆర్థిక శాఖ ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. ఆ నిధులతో బుల్లెట్ ప్రూఫ్ ఏర్పాట్లు చేస్తున్నారు.
సకల సౌకర్యాలతో..
గజ్వేల్–ముట్రాజ్‌పల్లి మార్గంలో సుమారు ఎకరం స్థలంలో ఈ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. అన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తుండగా.. దీనిని 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంతో చేపట్టారు. జీ ప్లస్ వన్ పద్ధతిలోని భవనంపోగా మిగతా స్థలంలో పచ్చిక పెంచి మొక్కలు నాటారు. భవనం ముందు వైపు, పక్కన 16 ఫీట్ల సీసీ రోడ్లను నిర్మించారు. రోడ్లకు ఇరుపక్కలా మొక్కలు నాటి, అందంగా ముస్తాబు చేశారు.
భవనంలో అన్ని గదులకు ఏసీ వసతి ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆయన కాన్వాయ్‌లోని కార్లన్నింటికీ సరిపడేలా పార్కింగ్ ఏర్పాటు చేశారు. ప్రజలు వస్తే కలిసేందుకు వీలుగా ఒక హాల్‌ను, సిబ్బంది కోసం క్వార్టర్లను నిర్మించారు. మొత్తంగా మిగతా క్యాంపు కార్యాలయాలకు రూ.కోటి చొప్పున ఖర్చవుతుండగా.. దీనికి రూ.2 కోట్లకుపైగా ఖర్చవుతోంది. సీఎం నిర్ణయం మేరకు ముహూర్తం చూసుకుని.. కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment