భారత్‌లో మరో లిగో?
సాక్షి, హైదరాబాద్: గురుత్వ తరంగాలను గుర్తించేందుకు వాడే లిగో (లేజర్ ఇంటర్‌ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ) వంటి ప్రయోగశాలను భారత్‌లోనూ ఏర్పాటు చేస్తారా? మరింత సున్నితమైన గురుత్వ తరంగాలను గుర్తించడంలో ఈ కొత్త లిగో కీలకపాత్ర పోషించనుందా? అవునంటున్నారు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థిరాటికల్ సెన్సైస్ (ఐసీటీఎస్) శాస్త్రవేత్తలు. అమెరికా సాయంతో భారత్‌లో లిగో వంటి అబ్జర్వేటరీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఒకటి చాలాకాలంగా ఉందని, తాజా ఆవిష్కరణతో ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చే అవకాశాలు పెరిగాయని ఐసీటీఎస్ శాస్త్రవేత్త పరమేశ్వరన్ అజిత్ ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ చెప్పారు. ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ (గాంధీనగర్), ఇంటర్ యూనివర్శీటీ సెంటర్ ఫర్ అస్ట్రానమీ (పూణే), రాజా రామణ్ణ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ (ఇండోర్)లు కలిసికట్టుగా ‘లిగో-ఇండియా’ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. 2012లోనే ఇందుకు కసరత్తు మొదలైంది. రూ.1,260 కోట్ల ఈ ప్రాజెక్టు కోసం రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలను ఎంపిక చేశారు. వీటిల్లో ఒకచోట కొత్త లిగో ఏర్పాటు కావచ్చు. కేంద్ర కేబినెట్ అనుమతి లభించాక పనులు చేపట్టి 2020 నాటికి దీన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు.
1992లో అమెరికాలోని కాల్‌టెక్, మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంయుక్తంగా గురుత్వ తరంగాల గుర్తింపునకు లిగోను ఏర్పాటు చేశాయి. దీంట్లో ఉన్న రెండు డిటెక్టర్లూ అమెరికాలోని లివింగ్‌స్టోన్ (లూసియానా), హాన్‌ఫర్డ్ (వాషింగ్టన్)లలో ఉన్నాయి. ఇవి కాకుండా జర్మనీ, ఇటలీ, జపాన్‌లలోనూ లిగో తరహా ప్రయోగశాలలున్నాయి. విశ్వం నుంచి భూమివైపుకు వచ్చే మరింత సున్నితమైన తరంగాల గుర్తింపు, అధ్యయనానికి ఇవి సరిపోవని శాస్త్రవేత్తల భావన. ఎక్కువ లిగోల ఏర్పాటు ద్వారా గురుత్వ తరంగాలు, స్థానిక ఇతర తరంగాలను వేరు చేయడం సులువని వీరి అంచనా. భారత్‌లో పరిశోధన శాల ఏర్పాటు ద్వారా తరంగాలు ఆకాశంలోని ఓ నిర్దిష్ట ప్రాంతం నుంచి వస్తున్నవేనని నిర్ధారించేందుకు వీలుంటుంది. లిగో సామర్థ్యాన్ని పెంచేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఫలిస్తే విశ్వంలో ఇప్పటివరకూ మనం గమనించదగ్గ దూరాలకు మూడు రెట్లు ఎక్కువ దూరాల నుంచి వచ్చే గురుత్వ తరంగాలను గుర్తించవచ్చు.