శివార్లలో మరో ‘స్నేక్ గ్యాంగ్’ | Another 'Snake Gang' in City outskirts | Sakshi
Sakshi News home page

శివార్లలో మరో ‘స్నేక్ గ్యాంగ్’

Published Thu, Dec 4 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM

శివార్లలో మరో ‘స్నేక్ గ్యాంగ్’

శివార్లలో మరో ‘స్నేక్ గ్యాంగ్’

సంఘీ టెంపుల్ సమీపంలో ప్రేమజంటపై దాడి
యువతిపై సామూహిక అత్యాచారం.. నగ్న దృశ్యాలు     చిత్రీకరించి బెదిరింపులు
బాధితురాలి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి...
ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

 
 హైదరాబాద్:  నగరంలో మహిళలపై స్నేక్ గ్యాంగ్ దురాగతాలు మరచిపోక ముందే శివార్లలో ఇలాంటి దారుణమే మరోటి చోటుచేసుకుంది. హయత్‌నగర్ సమీపంలోని సంఘీ టెంపుల్‌కు వెళ్తున్న ప్రేమజంటపై దాడి చేసిన దుండగులు యువకుడిని తాళ్లతో కట్టేసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఆమె నగ్నంగా ఉన్న దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి  బ్లాక్‌మెయిల్‌కు దిగారు. ఆ మృగాళ్ల వేధింపులు భరించలేక ఆ యువతి పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. హయత్‌నగర్ పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన యువతి (22), యువకుడు (26) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరు ద్విచక్రవాహనంపై సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు సంఘీ దేవాలయానికి  వెళ్తున్నారు. గుడికి రెండు కిలో మీటర్ల దూరంలో ఉండగా వీరిని పెద్ద అంబర్‌పేట్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెంబడించారు. కొద్దిదూరం వెళ్లాక వారిని అడ్డగించి పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లారు. యువకుడి కాళ్లు, చేతులను తాడుతో కట్టేసి అతని ముందే యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు.

‘మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి మా కోరిక తీర్చాలి, లేకుంటే నీ ఫొటోలు ఇంటర్‌నెట్‌లో పెడతాం’ అని బెదిరించారు. ఆ మరుసటి రోజే యువతికి ఫోన్‌చేసి తమ దగ్గరికి రావాలని బెదిరించారు. వరుసగా బెదిరింపులు రావడంతో ఆమె బుధవారం హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులిద్దరినీ పెద్దంబర్‌పేటకు చెందినవారిగా గుర్తించారు. ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఫోన్‌లో చిత్రీకరించిన దృశ్యాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వీటిని ఎవరికైనా పంపారా అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాధిత యువతిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement