మరో రెండు రోజులు కుండపోత వర్షాలు
- తర్వాత మూడు రోజులు ఓ మోస్తరు వానలు
- హైదరాబాద్‌లో అతి భారీ వర్షం కురిసే అవకాశం
- అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరిక
- రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలలో రెట్టింపు వర్షపాతం నమోదు
- హైదరాబాద్‌లో ఏకంగా 361 శాతం అధిక వర్షపాతం
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. దాని ప్రభావంతో శుక్ర, శనివారాల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తర్వాత మరో మూడు రోజులు ఒక మోస్తరు వానలు పడతాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఊపందుకోవడం, అల్పపీడనంతో రాష్ట్రవ్యాప్తంగా గురువారం కూడా భారీ వర్షాలు కురిశాయి. దీంతో చెరువులు, కుంటలు నిండిపోయాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
హైదరాబాద్‌లో హెవీ స్పెల్: హైదరాబాద్ నగరంలో శుక్రవారం తక్కువ సమయంలో అతి భారీ వర్షం (హెవీ స్పెల్స్) కురిసే అవకాశముందని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. రెండు మూడు గంటల వ్యవధిలోనే ఏకంగా 7 నుంచి 11 సెంటీమీటర్ల వర్షం పడుతుందని అంచనా వేస్తున్నారు. రోజు మొత్తం కలిపి 7 నుంచి 11 సెంటీమీటర్ల వర్షం పడితే పెద్దగా ప్రమాదం ఉండదని.. కానీ 2, 3 గంటల్లోనే పడితే నగరం అతలాకుతలం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రజలు అవకాశం ఉంటే ఇళ్లలోనే ఉండిపోవాలని, అధికార యంత్రాం గం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది.
రెట్టింపు వర్షపాతం: నైరుతి రుతుపవనాలు మొదలైన జూన్ నెలలో 50 శాతం అధిక వర్షపాతం నమోదుకాగా.. జూలైలో 3 శాతం లోటు వర్షపాతం రికార్డయింది. ఆగస్టులో మాత్రం 42 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మళ్లీ ఈ నెల (సెప్టెంబర్) ఒకటో తేదీ నుంచి గురువారం వరకు 22 రోజుల్లో సాధారణం కంటే 120 శాతం అధిక వర్షపాతం నమోదుకావడం గమనార్హం. ఈ 22 రోజుల్లో సాధారణంగా 98.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. 217.2 మిల్లీమీటర్లు రికార్డయింది. హైదరాబాద్‌లోనైతే ఏకంగా 361 శాతం అధికంగా నమోదైంది. అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రబీ సీజన్‌కు ముందు కురుస్తున్న ఈ భారీ వర్షాలతో చెరువులు నిండుతాయని, భూగర్భ జలాలు పెరుగుతాయని.. దీనివల్ల రబీ పంటలకు మరింత ప్రయోజనం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
26 వేల ఎకరాల్లో పంట నష్టం: భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 26,312 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. ఐదు వేల ఎకరాల్లో పత్తి, 8,365 ఎకరాల్లో కంది, 4 వేల ఎకరాల్లో జొన్న పంట, 2,400 ఎకరాల్లో వరి, 4,500 ఎకరాల్లో మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. పలుచోట్ల సోయాబీన్, వేరుశనగ, మినుము పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు.
తీవ్రరూపం దాల్చిన అల్పపీడనం
Published Fri, Sep 23 2016 3:59 AM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM
Advertisement