ముత్తూట్ కార్యాలయంలో జరిగిన దోపిడీకి యత్నించిన ముఠాను సాధ్యమైనంత త్వరలో పట్టుకుంటామని రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి తెలిపారు.
హైదరాబాద్ : మైలార్‌దేవ్‌పల్లిలోని ముత్తూట్ కార్యాలయంలో జరిగిన దోపిడీకి యత్నించిన ముఠాను సాధ్యమైనంత త్వరలో పట్టుకుంటామని రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఈ కేసుకు సంబంధించి ఇద్దరు అనుమానితులు బంటి, సర్దార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితులు ఉన్నారన్న సమాచారంతోనే ఉప్పర్‌పల్లి హ్యాపీ హోమ్స్‌లో సోదాలు నిర్వహించామన్నారు. మొత్తం ఆరుగురు ముత్తూట్ కార్యాలయంలో దోపిడీకి యత్నించినట్లు గుర్తించామన్నారు. చోరికి నెల రోజులుగా ముఠా రెక్కీ నిర్వహించినట్లు గుర్తించామన్నారు.
వీరంతా ముంబైకి చెందిన అర్జున్‌వెట్టి గ్యాంగ్ సభ్యులుగా ఏసీపీ వెల్లడించారు. ఎక్కువ బంగారం దొరుకుతుందనే ముత్తూట్‌ను టార్గెట్ చేసి ఉంటారని, త్వరలోనే దోషులను పట్టుకుంటామన్నారు. టవేరా వాహనంలో యాక్సిల్ బ్లేడ్, వేట కొడవలి, ఫేక్ నంబర్ ప్లేట్, ఓ పెద్ద బ్యాగు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. టవేరా వాహనం గుజరాత్‌కు చెందినదిగా గుర్తించినట్లు ఏసీపీ తెలిపారు. మొత్తం ఎనిమిది బ్లాక్‌ల్లో తనిఖీలు చేశామని,ఇంకా సోదాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు క్లూస్ టీమ్ పూర్తి ఆధారాలు సేకరిస్తోందని అన్నారు. దుండగుల వద్ద ఆయుధాలు ఉండటం వల్లే ఎవరికీ ప్రాణనష్టం జరగకూడదనే ఆక్టోపస్‌ను రంగంలోకి దింపామన్నారు.
మరోవైపు పోలీసు శునకాలు దుండగుల వాహనం దగ్గరి నుంచి.. పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 171 దగ్గరకు వెళ్లి ఆగిపోయాయి. దీంతో కొందరు దుండగులు వేరే వాహనాల్లో వెళ్లిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. మిగిలిన వారు హ్యపీహోమ్ అపార్ట్‌మెంట్లో ఉండొచ్చనే యోచనతో అణువణువునా తెల్లవారు జాము 3 గంటల వరకూ తనిఖీ చేశారు.