
‘పవన్ కల్యాణ్‌కు తెలిసి ఉండకపోవచ్చు’
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై జనసేన అధినేత మరింత అధ్యయనం చేయాలి. ఒకవేళ విమర్శలు చేయాలనుకుంటే విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తరువాత చేయాలి. అంతేగానీ, కేవలం విమర్శల కోసమే విమర్శలు చేయడం సరికాదు..’ అని బీజేపీ ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ పేర్కొన్నారు. బుధవారం ఏపీ ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, సిద్ధార్థనాథ్ సింగ్ కలసి కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు నివాసంలో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు.
అనంతరం సిద్ధార్థనాథ్‌సింగ్, కామినేని శ్రీనివాస్, హరిబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు.. రెండున్నరేళ్లయినా చేసిందేమీ లేదని, అందిన నిధులు కూడా స్వల్పమేనని పవన్ కల్యాణ్ చేసిన విమర్శలను ప్రస్తావించగా ఆయన పైవిధంగా స్పందించారు. ‘పవన్ కల్యాణ్‌కు తెలిసి ఉండకపోవచ్చు. బహుశా ఆయన సినిమాలు, సినీపరిశ్రమకు నిధులు నెమ్మదిగా వస్తూ ఉండొచ్చు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు మాత్రం అవసరమైన మేరకు వెళుతున్నాయి.’ అని పేర్కొన్నారు.
ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీలోనే ఎక్కువ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని తెలిపారు.‘కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీని ప్రకటించింది. దానికి చట్టబద్ధత ఉంది. అవసరమనుకుంటే కేబినెట్ ఆమోదం కూడా లభిస్తుందని ఆర్థిక మంత్రి మొదటి రోజే చెప్పారని గుర్తు చే శారు.