
ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: పవన్
హైదరాబాద్: బీజేపీపై జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గొప్ప అనుభవం ఉన్న నేతలు బీజేపీలో ఉన్నప్పుడు పెద్ద నోట్ల రద్దువంటి తప్పిద నిర్ణయం ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దువల్ల సామాన్య జనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలియజేస్తూ పవన్ తన ట్విట్టర్ లో స్పందించిన విషయం తెలిసిందే. అయితే, దీనికి బీజేపీ గట్టిగా స్పందించింది. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ పవన్‌పై మండిపడుతూ చురకలంటించారు. పవన్ అవగాహనరాహిత్యంతో మాట్లాడుతున్నారని అన్నారు.
ట్విట్టర్లో స్పందించే ముందు అధ్యయనం చేయాలని ఆయన పవన్కు చురకలంటించారు. ప్రత్యేక ప్యాకేజీ విషయంలో ఐదు అంశాలపై సమాధానం చెప్పాలని గతంలోనే కోరామన్నారు. గోవధపై ఆయా రాష్ట్రాల్లో చట్టాలున్నాయని ఈ సందర్భంగా సిద్ధార్థ్నాథ్ సింగ్ గుర్తుకు చేశారు. దీనికి వెంటనే పవన్ మరోసారి ట్విట్టర్ లో స్పందించారు. 'నేను సిద్ధార్థ్ సింగ్ గారిని ఒకే ఒక్క సూటి ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీ పార్టీలో వారికి ఎంతో రాజకీయ అనుభవం ఉండి, రాజ్యాంగంపై నిష్ణాతులై ఉండి ఉంటే పెద్ద నోట్ల రద్దు వంటి ఘోర తప్పిదానికి ఎలా పాల్పడ్డారు. దీనివల్ల తమ తప్పు లేకుండానే ఎంతో మంది అమాయకులు ప్రాణాలు పోతున్నాయి. వీటిపై ఏం సమాధానం చెబుతారు. మీకు నిజంగా ఏదైనా చేయాలని ఉంటే ముందే మీ పార్టీ వాళ్లను పరిమితుల్లో ఉండేలా చేయండి' అంటూ ఆయన ట్వీట్ చేశారు.