టీ న్యూస్‌కు ఏపీ పోలీసుల నోటీసులు
ఓటుకు కోట్లు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన ఆడియో టేపులను ప్రసారం చేసినందుకు టీ న్యూస్ ఛానల్‌కు ఏపీ సర్కారు నోటీసులు జారీ చేసింది . శుక్రవారం అర్థరాత్రి 12.30 గంటలకు ఎపి పోలీసులు నోటీసులు జారీ చేశారు. విశాఖ ఏసీపీ రమణ నేతృత్వంలోని బృందం.. టీ న్యూస్ ఛానల్ కార్యాలయంలోకి ప్రవేశించి నోటీసులు ఇచ్చింది.
అయితే నోటీసులు జారీచేసే విషయంలో తమకు సమాచారం లేదని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. తమ కార్యాలయానికి విశాఖ నుంచి కొంతమంది పోలీసులు వచ్చారంటూ.. టి- న్యూస్ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు తాము చేరుకున్నట్టు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు.
1995 నాటి కేబుల్ నెట్‌వర్క్ నియంత్రణ చట్టంలో నిబంధనలను ఉల్లంఘించారని ఏపీ పోలీసులు తమ నోటీసులో పేర్కొన్నారు. జూన్ 7వ తేదీ రాత్రి 8:30 గంటల ప్రాంతంలో చంద్రబాబు స్టీఫెన్‌సన్ మాట్లాడినట్టుగా పేర్కొన్న ఆడియో టేపులు ప్రసారం కారణంగా రెండు రాష్ట్రాల్లోని ప్రజల ప్రశాంతతకు భంగం కలిగిందని నోటీసులో ఆరోపించారు. రాజకీయపార్టీల మధ్య, ప్రజల మధ్య శత్రుత్వాన్ని పెంచేదిగా ఉందని నోటీసులో పేర్కొన్నారు. ఆడియో టేపుల ప్రసారం ద్వారా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న వ్యక్తి పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించిందంటూ నోటీసులు జారీ చేశారు. ఆడియో టేపుల కథనాల ద్వారా తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ అందులో పేర్కొన్నారు.
.