T news channel
-
’బాబు ప్రయత్నాలన్ని ప్రజలదృష్టి మళ్లించేందుకే’
-
బాబు తప్పులు పరాకాష్టకి చేరాయి
-
టీన్యూస్‌కు నోటీసులతో టీ.టీడీపీకి నష్టం!
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్ల కేసు కీలక దశకు చేరుకుంటున్న నేపథ్యంలో టీ న్యూస్ చానల్‌కు ఏపీ పోలీసులు నోటీసులు ఇవ్వడం తెలంగాణలో పార్టీకి నష్టం కలిగిస్తుందని ఆ పార్టీ నేతలు చంద్రబాబు వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. శనివారం ఉదయం చంద్రబాబుతో సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, గరికపాటి మోహన్రావుతోపాటు పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ తెలంగాణలో ఏపీ ప్రభుత్వం, పోలీసులు జోక్యం వల్ల తమ మనుగడ కష్టమవుతుందన్న ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే ఆంధ్ర పార్టీగా ముద్రపడ్డ టీడీపీ...రేవంత్ వ్యవహారంతో ఇబ్బందుల్లో పడిందని, ఇప్పుడు నేరుగా టీ న్యూస్ చానల్‌కు నోటీసులు ఇవ్వడం వల్ల తెలంగాణలో చంద్రబాబు జోక్యం పెరిగిందనే ప్రచారం ఎక్కువవుతుందని, దాంతో సెంటిమెంట్‌తో టీఆర్ఎస్ నేతలు టీడీపీని మరింత దెబ్బ కొడతారని వ్యాఖ్యానించినట్టు సమాచారం. అయితే చంద్రబాబు అందుకు ఒప్పుకోకుండా జరిగిన నష్టం ఎలాగూ జరిగిపోయిన నేపథ్యంలో ఎదురుదాడితోనే టీఆర్ఎస్ను దెబ్బకొట్టొచ్చని చెప్పినట్లు సమాచారం. టేపులు టీ న్యూస్‌కు ఎలా వచ్చాయో చెప్పాలని మీడియా సమావేశాలు పెట్టి ప్రశ్నించాలని బాబు ఆదేశించారని తెలిసింది. ఇక్కడ నష్టం జరిగినా ఏపీలో మేలు జరిగేలా వ్యవహరిస్తే కొద్దిరోజుల్లో సమస్య మరుగున పడుతుందని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. కాగా, ఈ సమావేశానంతరం ఎర్రబెల్లి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీవీ9, ఏబీఎన్ చానల్స్‌ను తెలంగాణలో మూసేసినప్పుడు లేని బాధ సీఎం సొంత చానల్‌కు నోటీసులు ఇస్తే వచ్చిందా అని టీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసారాలు చేశారనే నోటీసులు ఇచ్చారని చెప్పారు. పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడే నైతిక అర్హత టీఆర్ఎస్కు లేదన్నారు. -
విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.
-
విద్వేషాలు రెచ్చగొడుతున్న చంద్రబాబు
* ‘ఓటుకు కోట్లు’ కేసులో ఏపీ సీఎం తీరుపై పాత్రికేయుల ఆగ్రహం * అర్ధరాత్రి టీ చానల్‌కు నోటీసులు ఇవ్వడంపై మండిపాటు * నోటీసులు ఉపసంహరించు కోవాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తున్నారని, తెలుగు ప్రజలమధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని సీనియర్ పాత్రికేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే శుక్రవారం అర్ధరాత్రి టీ న్యూస్ చానల్‌కు నోటీసులు ఇచ్చారని ధ్వజమెత్తారు. శనివారమిక్కడ టీ న్యూస్ చానల్ ఆధ్వర్యంలో ఏర్పాటైన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న పలు చానళ్లకు చెందిన సీఈఓలు, పత్రికా ప్రతినిధులు, సీనియర్ పాత్రికేయులు, జర్నలిస్టు యూనియన్ నాయకులు చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రెస్‌అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం కావాలని ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోందని మండిపడ్డారు. ఈ కేసులో చంద్రబాబు అవినీతి బాగోతాలను బయటపెట్టిన టీ న్యూస్ చానల్‌కు నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. వెంటనే నోటీసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఐజేయూ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ... తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసుకోవాలంటే ప్రజల్లోకి వెళ్లి మన్నన పొందాలే తప్ప ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే నేరస్తులు అవుతామనే చిన్న లాజిక్‌ను కూడా చంద్రబాబు తెలుసుకోలేకపోయారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చర్యలను చూస్తుంటే దేశంలో మరోసారి ఎమర్జెన్సీ నిజంగానే వచ్చేలా కనిపిస్తోందన్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబు నేరం నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నందునే.. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ... నోటీసులు ఇచ్చిన తీరు, అంతకుముందు జరిగిన రాజకీయ ప్రకటనలు చూస్తే ఆధిపత్యంతో దాడిచేసి లొంగదీసుకోవడానికి చూసే పక్రియలా కనిపిస్తోందన్నారు. టేపులు బయటకు వచ్చి రెండు వారాలు గడుస్తున్నా అది తన గొంతో కాదో ఇప్పటివరకూ చెప్పకుండా ఓ మీడియా సంస్థకు నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. 6టీవీ సీఈవో శైలేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు టీ చానల్‌కు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు టంకశాల అశోక్, టీ న్యూస్ సీఈవో నారాయణరెడ్డి, గౌరీ శంకర్ (దక్కన్ క్రానికల్), ఆర్.రవికాంత్‌రెడ్డి (ద హిందూ), ఈశ్వర్‌రెడ్డి(ఆంధ్రభూమి) క్రాంతి కిరణ్ (జై తెలంగాణ), పల్లెరవికుమార్, విరాసత్ఆలీ తదితరులు పాల్గొన్నారు. రేపు రాష్ట్ర వ్యాప్త ఆందోళన: టీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్యలు తెలిపారు. -
గళమెత్తిన జర్నలిస్టులు
- ఏపీ సచివాలయం, డీజీపీ కార్యాలయం ఎదుట ధర్నా - చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు - టీ న్యూస్‌కు ఇచ్చిన నోటీసులు ఉపసంహరించు కోవాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసుకు సంబంధించిన కథనాలను ప్రసారం చేసినందుకు టీ న్యూస్ చానెల్‌కు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ తెలంగాణ జర్నలిస్టులు శనివారం ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఎదుట ధర్నాకు దిగారు. టీ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన నోటీసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ‘బ్రీఫ్డ్ బాబు డౌన్ డౌన్, బ్రీఫ్ కేసు బాబు డౌన్ డౌన్’ అంటూ నినదించారు. ఏపీ సీఎం కార్యాలయం వైపు చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు, జర్నలిస్టులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు అడ్డుకోవడంతో ఎల్ బ్లాక్‌కు వెళ్లేదారిలో మీడియా పాయింట్ వద్దే జర్నలిస్టులు బైఠాయించారు. అవినీతికి పాల్పడినవారిపై కథనాలను ప్రసారం చేసే హక్కు మీడియాకు ఉందని, ఈ హక్కును ఏపీ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. నిరసన కార్యక్రమంలో తెలంగాణ ప్రెస్ అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యుజే) ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్, ఉపాధ్యక్షులు పల్లె రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ డీజీపీ కార్యాలయం వద్ద.. ఏపీ సచివాలయం ధర్నా కంటే ముందుగా లక్డీకాపూల్‌లోని ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయం వద్ద కూడా తెలంగాణ జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు. టీ-న్యూస్ చానెల్ ఉద్యోగులతో పాటు పలు పాత్రికేయ, ప్రజా సంఘాల నేతలు ఇందులో పాల్గొన్నారు. ఒక రాష్ట్ర పోలీసులు మరో రాష్ట్రానికి వచ్చి ఎవరికైనా నోటీసులు ఇవ్వాలంటే ఆ రాష్ట్ర పోలీసుస్టేషన్లో సమాచారం ఇవ్వాలని, దీన్ని విశాఖపట్నం పోలీసులు పట్టించుకోలేదని విమర్శించారు. చట్టాన్ని అమలు చేయాల్సిన వారే ఇలా ఉల్లంఘనలకు పాల్పడితే ఎలా అని ప్రశ్నించారు. నిరసనకారుల్ని అరెస్టు చేసిన సైఫాబాద్ పోలీసులు గాంధీనగర్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. కొద్దిసేపటి తరువాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఇది చంద్రబాబు వ్యక్తిగత సమస్య: అల్లం నారాయణ ఏపీ సీఎం చంద్రబాబు.. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికి పోయి తన వ్యక్తిగత సమస్యను రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల సమస్యగా చిత్రీకరిస్తున్నారని తెలంగాణ ప్రెస్ అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ విమర్శించారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తన వ్యక్తిగత సమస్య నుంచి బయటపడేందుకు తెలుగువారి మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. అవినీతికిపాల్పడిన వారిపై కథనాలను ప్రసారం చేసే హక్కు మీడియాకు ఉందన్నారు. దీనికి నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. తక్షణమే సాక్షి, టీ న్యూస్ చానెళ్లకు జారీ చేసిన నోటీసులను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంఈయూ మద్దతు జర్నలిస్టుల ధర్నాకు జీహెచ్ఎంఈయూ అధ్యక్షుడు యు.గోపాల్ తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మీడియాపై అక్కసు వెళ్లగక్కుతున్న చంద్రబాబునాయుడికి తెలంగాణలో అడుగు పెట్టే అర్హత లేదని ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. వెన్నుపోటు చరిత్ర నీదైతే ఉద్యమాల చరిత్ర తెలంగాణ బిడ్డలదన్నారు. -
' ఆ టేపులు ఎక్కడి నుంచి వచ్చాయి?'
-
'ఆ టేపులు ఎక్కడి నుంచి వచ్చాయో బయటపెట్టండి'
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో టేపులు ఎక్కడి నుంచి వచ్చాయో టీ న్యూస్ ఛానల్ వివరణ ఇవ్వాలని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. ఏపీ పోలీసులు ఇచ్చిన నోటీసులకు గగ్గోలు పెట్టకుండా జవాబు చెబితే సరిపోతుందన్నారు. గంటలో సంచలన వార్త వస్తుందన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్లోనే టీ న్యూస్ ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో విలువలు, పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ కు లేదని ఎర్రబెల్లి తెలిపారు. తెలంగాణ కోసం పోరాడిన గౌరవం జర్నలిస్టులకు ఉందని.. టీ న్యూస్ కోసం ధర్నా చేసి తెలంగాణ జర్నలిస్టులు గౌరవం కోల్పోవద్దన్నారు. -
ఏపీ డీజీపీ ఆఫీస్ వద్ద జర్నలిస్టుల ఆందోళన, అరెస్టు
హైదరాబాద్ : టీ న్యూస్ ఛానల్‌కు నోటీసులు జారీచేయడాన్ని నిరసిస్తూ శనివారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయం ఎదుట తెలంగాణ జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఐజెయు సెక్రటరీ జనరల్ అమర్ తో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఆందోళన చేపడుతున్న జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేసి గాంధీ నగర్ పీఎస్ కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీ సర్కార్ చర్యకు ఖండిస్తూ తెలంగాణ వ్యాప్తంగా జర్నలిస్టులు నిరసనలకు దిగారు. ఓటుకు నోటు కేసులో వాస్తవాలు బయటపెట్టిన టీ న్యూస్‌కు నోటీసులు జారీ చేయటంపై పలు జిల్లాలోనూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్: టీ న్యూస్ కు నోటీసులను నిరసిస్తూ కరీంనగర్ లో జర్నలిస్టులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. నిజామాబాద్: జిల్లాలో ధర్నా చేపట్టిన జర్నలిస్టులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. నల్లగొండ: నోటీసులను నిరసిస్తూ నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్ లో జర్నలిస్టు సంఘాలు ధర్నాకు దిగాయి. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలోనూ చంద్రబాబు ఫ్లెక్సీని దహనం చేసిన జర్నలిస్టులు నిరసన తెలిపారు. వివిధ రాజకీయ పార్టీలు జర్నలిస్టులకు మద్దతు తెలిపాయి. -
ఆందోళనకు సిద్ధమవుతున్న తెలంగాణ జర్నలిస్టులు
హైదరాబాద్ : టీ న్యూస్ ఛానల్‌కు నోటీసులు జారీచేయడాన్ని నిరసిస్తూ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయం ఎదుట తెలంగాణ జర్నలిస్టులు ఆందోళన చేపట్టనున్నారు. ఏపీ సర్కార్ చర్యకు ఖండిస్తూ తెలంగాణ వ్యాప్తంగా జర్నలిస్టులు నిరసనలకు సిద్ధం అవుతున్నారు. ఓటుకు నోటు కేసులో వాస్తవాలు బయటపెట్టిన టీ న్యూస్‌కు నోటీసులు జారీ చేయటంపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అర్థరాత్రి టీ న్యూస్ ఛానల్‌కు ఏపీ సీఐడీ నోటీసులు ఇవ్వడంపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో తెలంగాణ అడ్వకేట్లు ఫిర్యాదు చేశారు. -
టీ న్యూస్‌కు ఏపీ పోలీసుల నోటీసులు
ఓటుకు కోట్లు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన ఆడియో టేపులను ప్రసారం చేసినందుకు టీ న్యూస్ ఛానల్‌కు ఏపీ సర్కారు నోటీసులు జారీ చేసింది . శుక్రవారం అర్థరాత్రి 12.30 గంటలకు ఎపి పోలీసులు నోటీసులు జారీ చేశారు. విశాఖ ఏసీపీ రమణ నేతృత్వంలోని బృందం.. టీ న్యూస్ ఛానల్ కార్యాలయంలోకి ప్రవేశించి నోటీసులు ఇచ్చింది. అయితే నోటీసులు జారీచేసే విషయంలో తమకు సమాచారం లేదని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. తమ కార్యాలయానికి విశాఖ నుంచి కొంతమంది పోలీసులు వచ్చారంటూ.. టి- న్యూస్ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు తాము చేరుకున్నట్టు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. 1995 నాటి కేబుల్ నెట్వర్క్ నియంత్రణ చట్టంలో నిబంధనలను ఉల్లంఘించారని ఏపీ పోలీసులు తమ నోటీసులో పేర్కొన్నారు. జూన్ 7వ తేదీ రాత్రి 8:30 గంటల ప్రాంతంలో చంద్రబాబు స్టీఫెన్సన్ మాట్లాడినట్టుగా పేర్కొన్న ఆడియో టేపులు ప్రసారం కారణంగా రెండు రాష్ట్రాల్లోని ప్రజల ప్రశాంతతకు భంగం కలిగిందని నోటీసులో ఆరోపించారు. రాజకీయపార్టీల మధ్య, ప్రజల మధ్య శత్రుత్వాన్ని పెంచేదిగా ఉందని నోటీసులో పేర్కొన్నారు. ఆడియో టేపుల ప్రసారం ద్వారా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న వ్యక్తి పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించిందంటూ నోటీసులు జారీ చేశారు. ఆడియో టేపుల కథనాల ద్వారా తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ అందులో పేర్కొన్నారు. .