ఏపీ డీజీపీ ఆఫీస్ వద్ద జర్నలిస్టుల ఆందోళన, అరెస్టు
హైదరాబాద్ : టీ న్యూస్ ఛానల్కు నోటీసులు జారీచేయడాన్ని నిరసిస్తూ శనివారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయం ఎదుట తెలంగాణ జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఐజెయు సెక్రటరీ జనరల్ అమర్ తో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఆందోళన చేపడుతున్న జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేసి గాంధీ నగర్ పీఎస్ కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీ సర్కార్ చర్యకు ఖండిస్తూ తెలంగాణ వ్యాప్తంగా జర్నలిస్టులు నిరసనలకు దిగారు. ఓటుకు నోటు కేసులో వాస్తవాలు బయటపెట్టిన టీ న్యూస్కు నోటీసులు జారీ చేయటంపై పలు జిల్లాలోనూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్: టీ న్యూస్ కు నోటీసులను నిరసిస్తూ కరీంనగర్ లో జర్నలిస్టులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.
నిజామాబాద్: జిల్లాలో ధర్నా చేపట్టిన జర్నలిస్టులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు.
నల్లగొండ: నోటీసులను నిరసిస్తూ నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్ లో జర్నలిస్టు సంఘాలు ధర్నాకు దిగాయి. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలోనూ చంద్రబాబు ఫ్లెక్సీని దహనం చేసిన జర్నలిస్టులు నిరసన తెలిపారు. వివిధ రాజకీయ పార్టీలు జర్నలిస్టులకు మద్దతు తెలిపాయి.