- ఏపీలో మెడికల్ ప్రవేశాలకు ఈ ఏడాది మినహాయింపునివ్వాలని నివేదన
- ఏపీ ప్రభుత్వం నిర్ణయం.. కేంద్రానికీ లేఖ రాయాలని తీర్మానం
సాక్షి, హైదరాబాద్: నీట్‌తో సంబంధం లేకుండా ఈ ఏడాది ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలను ఎంసెట్ ద్వారానే భర్తీ చేసుకొనేందుకు అవకాశం కోరుతూ మరోసారి సుప్రీంకోర్టుకు నివేదించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఎంబీబీఎస్, డెంటల్ ప్రవేశాలకు ‘నీట్’ తప్పనిసరని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తదుపరి చర్యలపై ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం నిపుణులు, అధికారులతో సమావేశమయ్యారు.
నీట్‌కు ఏపీ విద్యార్థులు సన్నద్ధంగా లేరని, సీబీఎస్‌ఈ సిలబస్‌లో పరీక్షలు, హిందీ, ఆంగ్ల మాధ్యమాల కారణంగా వారికి తీవ్రనష్టం జరుగుతుందన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ ఏడాదికి ఎంసెట్ పూర్తిచేసినందున మినహాయింపునిస్తే, వచ్చే ఏడాదికి నీట్‌కు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేసి విద్యార్థులను సిద్ధం చేయడానికి వీలుంటుందన్న అంశాలను న్యాయస్థానానికి నివేదించాలన్న అభిప్రాయానికి వచ్చారు. నీట్ నుంచి రాష్ట్రాన్ని మినహాయించేలా సుప్రీంకోర్టులో ప్రయత్నాలు చేస్తూనే కేంద్రానికిలేఖ రాయాలని నిర్ణయించారు.
సీఎంతో చర్చించాకే తుది నిర్ణయం
ఎంసెట్‌లోని అగ్రికల్చర్, డెంటల్, మెడికల్, ఫార్మసీ విభాగాల ఫలితాల వెల్లడి, ప్రవేశాల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఈ కోర్సుల ప్రవేశాలపై కేంద్రం నుంచి స్పష్టత వచ్చేవరకు ఎదురుచూడడం, సుప్రీంకోర్టులో చేసే ప్రయత్నాల ఫలితాలను అనుసరించి ముందుకు వెళ్లడం అనే అంశాలపై సమావేశంలో వేర్వేరు ప్రత్యామ్నాయాల గురించి చర్చించారు. సాధారణంగా ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ పూర్తయ్యాకనే మెడికల్ ప్రవేశాలు జరుగుతుంటాయని, ఈలోగా నీట్‌పై స్పష్టత వస్తుంది కనుక తదనుగుణంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. అయితే, అన్ని అంశాలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మరోసారి చర్చించి అంతిమంగా నిర్ణయం తీసుకోనున్నారు.
27నే ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలను ఇప్పటికే విడుదల చేసినందున షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27 నుంచి ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగించేందుకు నిర్ణయించారు.
‘నీట్’పై మరోసారి సుప్రీంకోర్టుకు !
Published Sat, May 14 2016 4:44 AM | Last Updated on Sat, Oct 20 2018 5:44 PM
Advertisement
Advertisement